రెండున్నర కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలు
ABN, First Publish Date - 2021-10-08T07:37:24+05:30
ఒక్క గూడ్స్ రైలును చూస్తేనే చాలా పొడవు ఉంటుంది. సగటున 58 బోగీలతో 800 మీటర్ల పొడవుతో.. ఎంతసేపు చూసినా బోగీలు తరగవు. అలాంటిది మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒక్కటిగా చేస్తే!
- మూడు గూడ్స్లు కలిపి.. ఒకే ట్రైన్గా!
- దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయోగం
విజయవాడ, హైదరాబాద్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఒక్క గూడ్స్ రైలును చూస్తేనే చాలా పొడవు ఉంటుంది. సగటున 58 బోగీలతో 800 మీటర్ల పొడవుతో.. ఎంతసేపు చూసినా బోగీలు తరగవు. అలాంటిది మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒక్కటిగా చేస్తే! అలాంటి ప్రయోగమే చేసింది దక్షిణ మధ్య రైల్వే. గూడ్స్ రైళ్ల వల్ల ప్రయాణికుల రైళ్లకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రైల్వే శాఖ చాలా ప్రయోగాలు చేస్తోంది. తాజాగా మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకేసారి నడిపే యోచన చేసింది. ఈ ఆలోచనకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే చేసిన సూచనల మేరకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ఓ సూపర్ రైలుకు రూపకల్పన చేశారు. ఈ సూపర్ రైలుకు 174 వ్యాగన్లు అమర్చారు. ట్రైన్ ముందు రెండు, మధ్యలో రెండు, చివర్లో రెండు చొప్పున మొత్తం ఆరు ఇంజిన్లు ఏర్పాటు చేశారు.
దీనిని గురువారం విజయవాడ నుంచి దువ్వాడకు ప్రయోగాత్మకంగా ఖాళీ రేకులతో నడిపారు. 2.40 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ భారీ గూడ్స్ రైలు 50 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఈ రైలుకు ‘త్రిశూల్’ అని నామకరణం చేశారు. ‘త్రిశూల్’ గూడ్స్ రైలు నిర్వహణలో కృషి చేసిన విజయవాడ డివిజన్ అధికారులను రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. పొడవాటి రైళ్లు సరుకు రవాణాకు బాగా ఉపయోగపడతాయని, పెద్దఎత్తున సరుకులు రవాణా చేయొచ్చని తెలిపారు. మూడు రైళ్లను జతచేయడంతో సిబ్బంది సంఖ్య కొంతవరకు తగ్గుతుంది. సెక్షన్లో ఇతర రైళ్ల నిర్వహణకు మార్గం సులువవుతుంది.
Updated Date - 2021-10-08T07:37:24+05:30 IST