సీబీఐ తీరు అనుమానాస్పదం
ABN, First Publish Date - 2021-10-29T08:45:33+05:30
సీబీఐ తీరు అనుమానాస్పదం
నిందితులకు అండగా నిలుస్తున్నారా?
అభ్యంతరకర పోస్టులకు అడ్డుకట్టేదీ?
కేసులు పెడుతున్నా పోస్టులు ఆగలేదు
ఆ వ్యాఖ్యల్ని ఏడాదైనా తొలగించరేం?
పంచ్ ప్రభాకర్‌ను అరెస్టు చేయరేం?
రండి.. అరెస్టు చేస్తామంటే వస్తారా?
దూషణలకు తేలిక లక్ష్యాలుగా కోర్టులు
వీధుల్లోకి వెళ్లి మేం పోరాడలేం కదా!
హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం
కోర్టుకు రావాలని సీబీఐ ఎస్పీకి నోటీసు
‘‘‘న్యాయవ్యవస్థపై చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలను కేవలం మాపై చేస్తున్నవిగా చూడడం లేదు. రాష్ట్ర ప్రజలు, సంస్కృతిపై దాడిగానూ మేం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మా స్వరాష్ట్రం. ఇక్కడ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోం. తీర్పులు ఇచ్చిన ప్రతిసారీ దూషణలకు న్యాయస్థానాలు తేలికైన లక్ష్యాలుగా( సాఫ్ట్ టార్గెట్) మారుతున్నాయి. వీధుల్లోకి వెళ్లి మేం పోరాటాలకు దిగలేం కదా!’’
- హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు మండిపడింది. సీబీఐ కేసు నమోదు చేసిన తరువాత కూడా పోస్టులు పెట్టడం ఆగలేదని గుర్తు చేసింది. కేసు నమోదు చేసి ఏడాది గడుస్తున్నా, ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టింగ్‌ల తొలగింపునకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీబీఐని నిలదీసింది. అభ్యంతరకర పోస్టింగ్‌లు తొలగించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల యాజమాన్యాలకు యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ (యూఆర్‌ఎల్) వివరాలను ఎందుకు అందజేయలేదని ప్రశ్నించింది. సీబీఐ నిందితులకు అండగా నిలుస్తోందా అన్న అనుమానం కలుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీబీఐ కేసు నమోదు చేసిన తరువాత కూడా పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల వేదికగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం ఆపలేదని గుర్తుచేసింది. విదేశాల్లో ఉన్న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌కు నోటీసులు ఇచ్చి... ‘అరెస్ట్ చేస్తాం.. రండి’ అంటే ఎలా వస్తారని ప్రశ్నించింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించి యూఆర్‌ఎల్ వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఈ కేసులో పిటిషనర్ కూడా అయిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. నిందితుల అరెస్టు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల తొలగింపు, కేసు దర్యాప్తు పురోగతి తదితర అంశాలను వివరించేందుకు శుక్రవారం కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ఎస్పీని ఆదేశించింది. విచారణను అదే రోజుకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
అనుచిత వ్యాఖ్యలున్న వీడియోల్లో యాడ్‌లు
వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీర్పులు వెలువరించిన న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు ఆదేశంతో సీబీఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల వ్యవహారంలో ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 12న సీబీఐని ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై గురువారం మరోసారి విచారణ జరిగింది. హైకోర్టు తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.... ‘‘న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పై పోస్టుల విషయంలో సీబీఐ కఠినంగా వ్యవహరించడం లేదు. కేసు నమోదు చేసిన తరువాత కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టడం ఆగలేదు. విదేశాల్లో ఉంటూ న్యాయవ్యవస్థను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయడంలో సీబీఐ విఫలమైంది. మధ్యంతర నివేదికలు సమర్పించడం తప్ప నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న అభ్యంతరకర పోస్టుల తొలగింపునకు చర్యలు తీసుకోవడంలో దర్యాప్తు సంస్థ వైఫల్యం చెందింది. న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను కించపరుస్తూ తయారుచేసిన వీడియోల్లో కమర్షియల్ యాడ్‌లు వేస్తున్నారు. న్యాయమూర్తులపై మళ్లీ మళ్లీ పోస్టులు పెడితే ఐటీ సవరణ చట్టం ప్రకారం వాటిని గుర్తించి తొలగించేలా ఆటోమెషన్ టూల్‌ను ప్రవేశపెట్టేలా సామాజిక మాధ్యమాలను ఆదేశించండి’’ అని కోరారు.
వివరాలిస్తే తొలగిస్తాం: సామాజిక మాధ్యమాలు
సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్‌రోహత్గీ, కపిల్ సిబల్; యూట్యూబ్, గూగుల్ తరఫున న్యాయవాది అహ్లువాలియా, ట్విట్టర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టకుండా కట్టడి చేసే తగిన యంత్రాంగం లేదు. పిటిషనర్ లేక దర్యాప్తు సంస్థలు పోస్టింగ్‌లకు సంబంధించి (యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్)యూఆర్‌ఎల్ వివరాలు అందజేస్తే సంబంధిత పోస్టులు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేగానీ మాకు మేము అభ్యంతరకర పోస్టులు గుర్తించలేం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తాం’’ అని వారు తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది సుభాశ్ వాదనలు వినిపిస్తూ......‘‘సీల్డ్ కవర్‌లో స్థాయీ నివేదిక అందజేశాం. ఈ కేసులో మొత్తం 11మందిని అరెస్ట్ చేయగా, ఐదుగురు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. విదేశాల్లో ఉన్న పంచ్ ప్రభాకర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించాం. అభ్యంతరకర పోస్టుల తొలగింపు అంశంపై కేంద్రంతో సంప్రదిస్తున్నాం’’ అని వివరించారు. అయితే, సీబీఐ చేసిన వాదనలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Updated Date - 2021-10-29T08:45:33+05:30 IST