ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పందెం పండింది!

ABN, First Publish Date - 2021-01-16T08:55:34+05:30

పందెం పందెమే! పెద్దదయినా, చిన్నదయినా బరి మీదకంటూ వచ్చాక జోరు పెంచాల్సిందే! కత్తి కట్టిన కోళ్ల ఎదుట కోట్లు కుమ్మరించాల్సిందే! వాస్తవానికి గతంతో పోల్చితే పెద్దబరులు పలచబడ్డాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాను కాలదన్ని కోట్లు కొట్టిన కోళ్లు

రూ.50 వేలతో భోగికి బోణీకొట్టి

కనుమనాడు 15 లక్షలకు పందెం

పశ్చిమలోనే 100 కోట్లు వసూలు

అదేస్థాయిలో గుండాట, పేకాట

ఇళ్లు, పొలాలు తనఖా పెట్టి మరీ

కృష్ణా జిల్లాలో పందేలేసిన వైనం

అధికార నాయకుల హడావుడితో

పలు బరుల వద్ద ఘర్షణ..ఉద్రిక్తత


కత్తి కట్టిన కోడి ఎదుట ఉక్కుపాదాలు నిలబడలేకపోయాయి. ఆంక్షలను కాళ్లతో తన్నేసి షరామామూలుగానే పండగ కోళ్లు రూ. కోట్లలో పందెం కొట్టాయి. కొవిడ్‌తో తగ్గుతారనుకొంటే.. గత ఏడాదికి ఏ మాత్రం తగ్గకుండా పందెంరాయుళ్లు దూసుకెళ్లారు. భోగినాడు రూ.50 వేలతో బోణీ కొట్టిన బరి..కనుమ రోజు రూ.15 లక్షలు కొల్లగొట్టింది.


(విజయవాడ, అమలాపురం,ఏలూరు- ఆంధ్రజ్యోతి)

పందెం పందెమే! పెద్దదయినా, చిన్నదయినా బరి మీదకంటూ వచ్చాక జోరు పెంచాల్సిందే! కత్తి కట్టిన కోళ్ల ఎదుట కోట్లు కుమ్మరించాల్సిందే! వాస్తవానికి గతంతో పోల్చితే పెద్దబరులు పలచబడ్డాయి. పందెం అనగానే గుర్తొచ్చే భీమవరం, పాలకొల్లుల్లో కోడి కూతే వినిపించలేదు. అదేసమయంలో ఎక్కడికక్కడ వెలిసిన చిన్నచిన్న బరులు ఆ పెద్ద బరుల లోటును తీర్చేశాయి. దాదాపు 100 కోట్లకుపైగా పశ్చిమగోదావరి జిల్లాలో కొల్లగొట్టాయి.


కోడి పందేల నిర్వహణలో ఈ సారి ఈ జిల్లాలో ఉండి మండలం సీసలి, తణుకు మండలం తేతలి, యలమంచిలి మండలం కలగంపూడి, మొగల్తూరు మండలం  శేరేపాలెం, గణపవరం మండలం మందలపర్రులలో అతి పెద్ద పందేలు జరిగాయి. ఈ శిబిరాలన్నింటికీ పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, గోవా నుంచి వచ్చిన కొందరు పేటీఎం పద్ధతిలో చెల్లింపులు చేయడం కనిపించింది. ఎక్కడికక్కడ అధికార నేతలే బరులన్నింటినీ (కెప్టెన్లు) నిర్వహించారు. ఒక్కో పందెం బరి నిర్వహించాలంటే నిర్వాహకులకు నేరుగా మూడు నుంచి పది లక్షలు చెల్లించుకోవాలి. పేకాట నిర్వాహకులు, గుండాట నిర్వాహకులు ఈ మొత్తాన్ని కలిపి ఎవరైతే ఆయా బరులకు కెప్టెన్లుగా వ్యవహరిస్తారో వారికి ముట్ట చెప్తారు. తమ ప్రాంతం వైపు చూసి చూడనట్లుగా పోవాల్సిందిగా పోలీసులకు ఈ కెప్టెన్లు కాస్తంత కప్పం కడతారు. ఇలా వాటల కిందే పోలీసులకు లక్షన్నర నుంచి మూడున్నర లక్షల వరకూ పంచినట్లు చెబుతున్నారు.


దీంతో ప్రధాన బరులను వదిలేసి మిగతా బరులపై కాస్తంత కన్నేశారు. గుండాటలపై దాడులు జరిపారు. పందెంరాయుళ్లు గుండాట.. పేకాటపై కోట్లే గుమ్మరించారు. దాడుల్లో అనేకచోట్ల ఒక బరికి 50 వేల నుంచి రెండు లక్షల వరకూ పట్టుబడింది. దాదాపు 400 మంది గుండాట నిర్వహణలో పాలు పంచుకున్నారు. వీరంతా పెద్ద తలకాయల కోసం దాదాపు రూ.60 లక్షలు పైబడే ‘మొక్కుబడి’ చెల్లించుకున్నారు. తీరా పండుగ చివరి రోజైన కనుమ నాడు అనేకచోట్ల పోలీసులు రెచ్చిపోవడంతో వీరంతా కెప్టెన్లపై మండిపడ్డారు. పేకాట విషయానికి వస్తే జిల్లాలోని ఆరు కేంద్రాల్లో రూ.50 లక్షలు చొప్పున పాడుకుని పందేల నిర్వహణకు కొందరు ముందుకు వచ్చారు. 20 మంది బృందాన్ని కూడగట్టి వీరందరికి సమస్తం సమకూర్చి ఆమేరకు పేకాటను తెగ ప్రోత్సహించారు. మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు, కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల్లోనూ కోడిపందేలు, గుండాటకు తిరుగులేకుండా పోయింది. 


గుండాటలకు జోడీగా డ్యాన్సులు

కోడిపందేలు.. గుండాట.. పేకాట పోటీలను కలిపి తూర్పుగోదావరి జిల్లాలో రూ.75 కోట్ల పైనే చేతులు మారినట్టు సమాచారం. కాకినాడ, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలతో పాటు కోనసీమలో అశ్లీల నృత్య ప్రదర్శనలు హోరె త్తాయి. కోనసీమ పరిధిలోని పలు గ్రామాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడి పందేలు, గుండాటలు నిర్వహించారు. 20కి పైగా కీలక బరులు, 150కు పైనే జిల్లాలో ఓ మోస్తరు బరుల్లో కోడిపందేలు, గుండాటలు జోరుగా సాగాయి. మూడురోజులపాటు పందెం బరుల వద్ద కోడిపందేల కంటే వందల సంఖ్యలో గుండాట బోర్డుల జాతర ఎక్కువ సాగింది. భారీగా జన సందోహం గుండాటలపై ఆసక్తి కనబర్చడంతో లక్షలాది రూపాయల మేర చేతులు మారాయి. వేలంపాటల ద్వారా గుండాటలను దక్కించుకున్న నిర్వాహకులు వారి వ్యాపారం సాగేందుకు వీలుగా ఆయాప్రాంతాల్లో రికార్డింగ్‌ డాన్స్‌లు ఏర్పాటుచేశారు.


పందెంబరుల వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సైకిల్‌స్టాండ్లు, తినుబండారాలు, ఇతర స్టాల్స్‌తో ప్రభల తీర్థాలను తలపించేరీతిలో బరులు కిటకిటలాడాయి. మెయిన్‌రోడ్ల చెంతనే పందేలు నిర్వహించడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. అయితే కోడిపందేల బరుల వద్ద పలుచోట్ల ఘర్షణలు తలెత్తి పలువురు గాయపడ్డారు.


అల్లవరం మండలం గోడి, ఇందుపల్లి, అంబాజీపేటతో పాటు కొత్తపేట ప్రభల తీర్థంలో వైసీపీ నాయకులు ఘర్షణలకు దిగారు. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎక్కడికక్కడ వైసీపీ పక్షానికి చెందిన నాయకుల ఆధిపత్యం బరులు వద్ద కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక్కో బరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు స్థాయిని బట్టి మామూళ్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజోలు పోలీసు సర్కిల్‌ పరిధిలోని దాదాపు 30 గ్రామాల్లో రికార్డింగ్‌ డ్యాన్సులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రధాన రహదారుల చెంతనే జోరుగా సాగాయి. అధికార నేతల ఒత్తిడితో పోలీసులు ఈ వ్యవహారాలను చూసీచూడనట్టు వదిలేశారు. 


పోలీస్‌ కేసులు.. అరెస్టులు...

విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కోడి పందేల శిబిరాల నిర్వహణపై పోలీసులు కన్నేశారు. కఠిన ఆంక్షలు అమలు చేశారు. దీంతో విజయవాడ చుట్టుపక్కల కోడి పందేల సందడి కాస్త తగ్గింది. గత ఏడాది విజయవాడ చెంతనే ఉన్న కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో భారీ బరులు ఏర్పాటు చేశారు. అయితే, ఈసారి ఆ లోటును కృష్ణాజిల్లా శివార్లలోని బాపులపాడు మండలం అంపాపురం తీర్చింది. విశాఖ జిల్లాలో పలుచోట్ల కోడి పందాలు వేస్తున్న 38 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 13 పందెం కోళ్లు, రూ.38 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో కోళ్ల పందేలకు తోడు పేకాటరాయుళ్లు కూడా రెచ్చిపోయారు. గడిచిన వారం రోజుల వ్యవధిలో పోలీసులు మొత్తం 19 చోట్ల దాడులు జరిపి, 94 మందిని అరెస్టు చేశారు. వారి నుంచీ రూ. 3.71 లక్షల నగదు సీజ్‌ చేశారు. 30 కోడి పుంజులు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 


సినీ సందడి... 

కృష్ణాజిల్లా గుడివాడ ఏలూరు రోడ్డులోని లింగవరం కే కన్వెన్షన్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిబిరం వద్ద ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాఽథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ కోడి పందేలను చూశారు. కోనసీమలో సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ పందేలను తిలకించారు. 


పందెం స్పెషల్‌

కోడి పందేలకో లెక్కుంది. కోడికి పెట్టే ఆహా రం దగ్గర నుంచి కత్తి కట్టి బరిలో దిగే వరకు పుంజుకు సపర్యలు చేయాల్సిందే. తాడేపల్లిగూడెం మండలంలో ఓ బరిలో కోళ్లకు కత్తి కట్టేందుకు కడప నుంచి ప్ర త్యేకంగా కత్తులు కట్టే వ్యక్తిని రప్పించారు. అతని కి వసతులు ఏర్పాటు చేయడంతోపాటు కోడికి కత్తికట్టి బరిలోకి దింపేందుకు ఒక్కో కత్తికి రూ.100 అం టే ఒకసారి పందెం వేస్తే వంద ఇవ్వాల్సిందే. అలా రెం డు కోళ్లకు రూ.200 పందెం ముగియగానే గెలిచిన పందెగాడు జమ చేయాలి. బరిలో కనీసం వంద నుంచి 2 వందల కోళ్లకు వీరు కత్తులు కడతారు. కోడి బరిలోకి దిగి కత్తులతో యుద్ధం మొదలయ్యాక దెబ్బ తగిలితే దానికి రక్తం కారకుండా వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి మళ్లీ బరిలోకి దించి పం దెం గెలిచేలా చేసేందుకు ప్రత్యేక శిక్షకులు ఉన్నారు. వా రి కోసం భోజన ఏర్పాట్లు జీతం భారీగానే ముట్ట చెబుతున్నారు. సాధారణంగా కోడిని రూ.10 వేల నుంచి రూ.3 లక్షల వర కూ వెచ్చించి కొంటుంటారు. పందెంలో చనిపోయిన కోడి(కోజా) దొరకడమే అరుదు. గోదావరి జిల్లాల్లో అరుదుగా భావించే పులస ధరకంటే కోజా ధర రెట్టింపైంది. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ ధర వెచ్చించి కొనుగోలు చేశారు.


అతివలు అదుర్స్‌..

ఓన్లీ ఫర్‌ లేడీస్‌ పేరిట ప్రత్యేక బరి నిర్వహించడం పశ్చిమ గోదావరి జిల్లాకు ఉన్న ఎన్నో ఆనవాయితీల్లో ఒకటి. నిడమర్రు మండలం మందలపర్రు గ్రామం ఇందుకు ఈసారి వేదికైంది. పలువురు ముఖ్యుల సతీమణులతోపాటు కాస్త పందెం అంటే సంప్రదాయం పేరిట చెవికోసుకునే యువతులు ఈ బరి వద్ద సందడి చేశారు. అమెరికా, కెనడా, లండన్‌ ప్రాంతాల నుంచి కొందరు యువతులు సైతం రావ డం పండగ కళను పెంచేసింది. సంక్రాంతి పండగకి ఇక్కడి తమ బంధువుల ఇంటికి హాజరై పనిలో పనిగా కోడిపందాల శిభిరాలకు తరలి వచ్చారు. తమకిష్టమైన పందెం పుంజులను చంకనేసుకుని ఫోజులిచ్చారు. ఒక్కో పందానికి 20 నుంచి 50 వేల వరకూ బెట్‌ కాశారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని జనార్దనవరంలో పలువురు మహిళలు కోసు ఆట ఆడారు. పిల్లలు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన మహిళ సరదాగా కొన్నిగంటలపాటు పందేలు వేస్తూ హుషారుగా గడిపారు. 


10 కోళ్లతో వచ్చి..ఐదు కోట్లు పట్టేసి..

పండగ మూడురోజులూ కృష్ణాజిల్లాలో కోళ్లు రెచ్చిపోయాయి. పందేల బరుల వద్ద సుమారు రూ.100 కోట్లపైచిలుకు చేతులు మారినట్లు సమాచారం. గుడివాడలో గడ్డం గ్యాంగ్‌ ఆధ్వర్యంలో భారీ బరులు నిర్వహించారు. ఈ గ్యాంగ్‌ కనుసన్నల్లో గుడివాడకు సమీపంలోని కే కన్వెన్షన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బరుల్లో కోతముక్క, కోడిపందేలు భారీ స్థాయిలో నిర్వహించారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణ జిల్లాల నుంచి పందెంరాయుళ్లు ఇక్కడికి తరలివచ్చారు. ఒక్క గుడివాడ బరిలోనే మూడు రోజుల్లో రూ.50 కోట్ల మేర చేతులు మారినట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో పందెం సుమారు 3 నుంచి 5 కోట్లు నడిచింది. ఇద్దరు ప్రముఖుల నడుమ నడచిన పందెంలో రూ.3 కోట్లు చేతులు మారాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఒకరు పది కోళ్లతో వచ్చి 10 పందేల్లో కృష్ణాజిల్లాకు చెందిన పందెం రాయుళ్లను ఓడించి సుమారు రూ.5 కోట్లుపైచిలుకు పట్టుకెళ్లినట్లు సమాచారం. గుడివాడ ఏలూరు రోడ్డు నుంచి లింగవరం కే కన్వెన్షన్‌ ప్రాంగణం వరకు ఉన్న రహదారి మూడు రోజులపాటు జనజాతరను తలపించింది.


ఇంకా... కోడూరు మండలంలో ఓ పాఠశాలలో కోడి పందేల నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిపై గ్రామస్థులు నిరసన వ్యక్తం చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బాపులపాడు మండలం ఎస్‌.ఎన్‌.పాలెం, బిళ్లనపల్లి, కొత్తపల్లి, వేలేరు, కానుమోలు అంపాపురం; మొవ్వ మండలంలోని అయ్యంకి, కారకంపాడు, కోసూరు, కూచిపూడి; పమిడిముక్కల మండలం ముళ్లపూడిలో కోడిపందేలు సాగాయి. అంపాపురంలో కోడి పందేల కోసం ఇళ్లు, పొలం పట్టాలను తనఖా పెట్టి సుమారు రూ.20 నుంచి 40 లక్షల వరకు పందేలు వేశారు. గత మూడు రోజులుగా 5 గ్రామాలలో జరుగుతున్న పందేలలో సుమారు రూ.2 నుంచి 3 కోట్ల వరకూ పందేలు నిర్వహించినట్లు సమాచారం. పందెంలో ఓడిపోయిన కోడికి రూ.20వేల వరకు పలికింది. 

- తాడేపల్లిగూడెం రూరల్‌

Updated Date - 2021-01-16T08:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising