ఇన్‌చార్జ్‌లపై టీడీపీ కసరత్తు
ABN, First Publish Date - 2021-12-24T09:00:44+05:30
టీడీపీ అధిష్ఠానం చేపట్టిన నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకం కసరత్తుతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సందడి నెలకొంది. కొత్త ఇన్‌చార్జ్‌ల...
- అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై అంతర్గత సమీక్ష
- సందడిగా మారిన ఎన్టీఆర్ భవన్
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధిష్ఠానం చేపట్టిన నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకం కసరత్తుతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సందడి నెలకొంది. కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకంపై అభిప్రాయాలు చెప్పడానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తుండటంతో కార్యాలయంలో రద్దీ పెరిగింది. ఇన్‌చార్జ్‌లు లేనిచోట లేదా క్రియాశీలకంగా లేనిచోట కొత్తవారిని ఎంపిక చేయడానికి టీడీపీ అధిష్ఠానం నడుం బిగించింది. వారానికి ఐదారు నియోజకవర్గాల నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. సీనియర్ నేతలతో, ఆ తర్వాత వారితో చంద్రబాబు సమావేశమై మాట్లాడుతున్నారు. తమకు లభ్యమైన సమాచారాన్ని... నేతల అభిప్రాయాలను వడపోత పోసి తుది నిర్ణయం తీసుకొంటున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ నేతలతో గురువారం మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పొరుగు రాష్ట్రానికి మకాం మార్చి వ్యాపారంలో మునిగిపోయారు. గురువారం భేటీకి ఆయనా హాజరయ్యారు. తనకు మళ్లీ పోటీ చేయాలని ఉందని, అవకాశం ఇస్తే నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతానని చెప్పారు. కాని నియోజకవర్గంలోని ఇతర నేతలు అనేకమంది దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండి పనిచేసేవారిని ఇన్‌చార్జిగా ఎంపిక చేయాలని కోరారు.
ప్రత్యమ్నాయంగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, పుంగనూరుకు చెందిన ఒక బీసీ నేత పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. వారిద్దరూ ప్రస్తుతం టీడీపీలో లేరు. చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత శంకర్ యాదవ్‌ను ప్రస్తుతానికి ఇన్‌చార్జిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆయనకు 3నెలలు సమయం ఇస్తామని, నియోజకవర్గంలో నిరూపించుకోవాలని... లేని పక్షంలో ప్రత్యమ్నాయం చూసుకొంటామని అధిష్ఠానం స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గత ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఖర్చు బాగా పెరిగిపోయిన ఈ సమయంలో దానిని తాను తట్టుకొనే పరిస్థితిలో లేనని, ఈసారి పోటీచేసే ఉద్దేశంలో లేనని పార్టీ నాయకత్వానికి చెప్పారు. ఆ నియోజకవర్గ నేతలను కొద్ది రోజుల క్రితం పిలిపించి మాట్లాడారు. వారిలో ఎక్కువ మంది శేషారావు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పారు. కాని ఆయన ఆసక్తిగా లేరు. ఖర్చుకు వెనకాడకుండా టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఇద్దరు ముగ్గురు నేతలు ముందుకు వచ్చారు. మరోసారి శేషారావుతో మాట్లాడి ఇతర నేతల విషయం పరిశీలించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గాల నేతలను శుక్రవారం ఇక్కడకు పిలిపిస్తున్నారు.
కాకినాడ రూరల్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పిల్లి అనంత లక్ష్మి... ఆమె భర్త సత్తిబాబు ఈసారి పోటీపై తమకు ఆసక్తి లేదని అధిష్ఠానానికి చెప్పారు. ప్రత్యమ్నాయంపై అధినాయకత్వం దృష్టి పెట్టిన తర్వాత మళ్లీ మనసు మార్చుకొని పోటీకి సిద్ధమేనని ముందుకొచ్చారు. కాని నియోజకవర్గ నేతల్లో వారికి మద్దతు తగ్గినట్లు కనిపిస్తోంది. దీనితో వారందరితో మాట్లాడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఆత్మకూరులో పోయిన ఎన్నికల్లో పారిశ్రామికవేత్త బొల్లినేని శీనయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరం అయ్యారు. దీనితో అక్కడ ఎవరికి బాధ్యత అప్పగించాలన్నదానిపై పార్టీ నాయకత్వం సమాచారం సేకరిస్తోంది.
రైతు సంతోషంగా ఉండాలి
8 అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది: బాబు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల రైతులకు గురువారం ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ ఈ రోజు రాష్ట్ర రైతాంగం పడే కష్టాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు. ‘‘దుక్కిదున్ని, విత్తనం నాటి, పంటను అమ్మి, డబ్బు చేతికొచ్చే వరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. కానీ ఏపీలో ఒక రోజు రుణాల కోసం, మరోరోజు విత్తనాల కోసం, ఇంకోరోజు ఎరువుల కోసం, చివరకు పంటను అమ్ముకోవడం కోసం, తర్వాత ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి. రాష్ట్రంలో 93ు మంది రైతులు అప్పుల్లో మునిగిపోయారు. వరి పంట వేయొద్దని చెప్పడం అన్నదాతల్ని అవమానించడమే. కౌలు రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని’’ అని చంద్రబాబు విమర్శించారు. కాగా, టీడీపీ వాణిజ్య విభాగం లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.
Updated Date - 2021-12-24T09:00:44+05:30 IST