ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సంజీవ’మేదీ....?

ABN, First Publish Date - 2021-10-18T04:29:29+05:30

జనరిక్‌ మందుల దుకాణాలు మూత పడుతున్నాయి. సామాన్యులకు బ్రాండెడ్‌ మందుల కన్నా.. తక్కువ ధరకు మందులు అందించేందుకు ప్రభుత్వం ‘జనరిక్‌’ దుకాణాలు ఏర్పాటు చేసింది. వీటిపై ప్రచారం లేకపోవడం.. ప్రజలకు అవగాహన కరువవడంతో చాలామంది వినియోగించడం లేదు.

శ్రీకాకుళం అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద మూతపడిన అన్నసంజీవని మందుల దుకాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




- జనరిక్‌ మందులకు కానరాని ప్రచారం 

- నిర్వహణ భారంగా మారిన వైనం

- జిల్లాలో మూతపడుతున్న దుకాణాలు 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జనరిక్‌ మందుల దుకాణాలు మూత పడుతున్నాయి. సామాన్యులకు బ్రాండెడ్‌ మందుల కన్నా.. తక్కువ ధరకు మందులు అందించేందుకు ప్రభుత్వం ‘జనరిక్‌’ దుకాణాలు ఏర్పాటు చేసింది.  వీటిపై ప్రచారం లేకపోవడం.. ప్రజలకు అవగాహన కరువవడంతో చాలామంది వినియోగించడం లేదు. దీనికితోడు వైద్యులంతా బ్రాండెడ్‌ మందులనే ప్రిస్కిప్షన్‌పై రాసిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో జనరిక్‌ మందులకు ఆదరణ కరువై.. నిర్వహణ భారమవుతోంది. ఈ క్రమంలో కొన్ని దుకాణాలు మూతపడుతున్నాయి. జిల్లాలో జీవనధార పేరుతో ఒకటి, అన్న సంజీవిని కేంద్రాలు నాలుగు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు రెండు, ఇతర ప్రాంతాల్లో మూడు మొత్తం 10 జనరిక్‌ మందుల దుకాణాలు ఉన్నాయి. మెప్మా ఆధ్వర్యంలో పొదుపు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. పీఎంబీజేకే కింద దుకాణం పెట్టిన వారికి రూ.1.5 లక్షల రాయితీ ఇస్తామని నాలుగేళ్ల కిందట ప్రకటించారు. ఆ సమయంలో మునిసిపాలిటీల పరిధిలో కొన్ని దుకాణాలు ఏర్పాటయ్యాయి. మొదట కంప్యూటర్‌, ఫర్నీచర్‌ తదితర మెటీరియల్‌ ఇస్తామన్నారు. తర్వాత మందులకు మాత్రమే ఆ నగదు ఇస్తామని చెప్పారు. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు. దీనికితోడు జనరిక్‌ మందులు ఇతర ప్రాంతాల నుంచి సకాలంలో సరఫరా కాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఫలితంగా పలువురు దుకాణాలు మూసేశారు. ఉదాహరణకు శ్రీకాకుళం అంబేద్కర్‌ జంక్షన్‌, అరసవల్లిలో ఉన్న సంజీవిని మందుల దుకాణాలు చాలారోజుల కిందట మూతపడ్డాయి. వీటి బాటలోనే మిగిలినవి నిర్వహణ భారమై.. మూసివేత దిశగా పయనిస్తున్నాయి.  


అవగాహన కరువై

జిల్లావ్యాప్తంగా 80 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీలు, శ్రీకాకుళం సర్వజన వైద్యశాలతోపాటు టెక్కలిలో జిల్లా ఆసుపత్రి, సీతంపేటలో ఏరియా ఆసుపత్రి ఉంది. వీటిల్లో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో మాత్రమే జనరిక్‌ దుకాణం ఉంది. మిగిలినవి బయట ప్రాంతాల్లో ఉండటం, వ్యాపారం సరిగా సాగకపోవడంతో దుకాణాలు మూసేయాల్సిన దుస్థితి నెలకొంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేసినా కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు వెనక ఉండి నడిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పొదుపు సంఘాల మహిళలకు మందులపై అవగాహన లేకపోవడంతో ఫార్మాసిస్టులను ఏర్పాటు చేసుకున్నారు. వీరు తరచూ నిలిచిపోవడం.. కొత్తవారు వచ్చేందుకు సమయం పడుతుండటంతో ఈ లోపు వ్యాపారాలు సాగక మూతపడుతున్నాయి. 


 అంతా బ్రాండెడ్‌ వ్యాపారమే....

జిల్లాలో 1600 మందుల దుకాణాలు ఉన్నాయి. బ్రాండెడ్‌ మందుల వ్యాపారం ప్రతి నెలా రూ.25 కోట్ల వరకు జరుగుతుందని అంచనా. చాలా ప్రాంతాల్లో వైద్యులు సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిల్లో మందుల దుకాణాలను సొంతంగా కానీ, బంధువుల ఆధ్వర్యంలో కానీ నడుపుతున్నారు. వివిధ రోగాలతో బాధపడేవారు వైద్యులను ఆశ్రయిస్తుంటే... బ్రాండెడ్‌ మందులనే రాసిస్తున్నారు. దీంతో జనరిక్‌ మందుల వినియోగం ఉండడం లేదు. ఇప్పటికైనా జనరిక్‌ మందులపై అవగాహన కల్పిస్తే ప్రజలకు చాలా వరకు భారం తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


నిర్భయంగా వాడొచ్చు 

బ్రాండెడ్‌ మందులే పనిచేస్తాయని.. ఇతర మందులు పనిచేయవని కాదు. జనరిక్‌ మందులు ‘పేటెంట్‌’ లేకుండా వస్తాయి. అందుకే వీటి ధర తక్కువగా ఉంటుంది. రోగులు నిర్భయంగా జనరిక్‌ మందులు వాడొచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్‌ దుకాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.  పొదుపు సంఘాలకు అవగాహన లేకపోవడంతో ఇటీవల అన్నసంజీవని దుకాణాలు మూతపడ్డాయి. 

- లావణ్య, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ 


Updated Date - 2021-10-18T04:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising