ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత రాజ్యం భ్రమల్లో..‘సూపర్‌బాస్‌’లు!

ABN, First Publish Date - 2021-06-29T08:44:03+05:30

కొందరు సీనియర్‌ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా ధిక్కరిస్తున్నారు. పబ్లిక్‌ సర్వెంట్లం అన్న విషయం మరచి సొంత రాజ్యం నడుస్తోందన్న భ్రమల్లో ఉంటూ చిన్న చిన్న అంశాలకు కూడా పదేపదే కోర్టులకు వెళ్లివస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోర్టులు చెప్పినా బేఖాతర్‌!!

బడా అధికారుల ధిక్కార ధోరణి

కోర్టు ఆదేశాల అమలులో అలసత్వం

చెప్పగానే చేయాలా అంటూ నిర్లక్ష్యం

జైలు శిక్ష అంటే తప్ప దిగిరావడం లేదు

ధిక్కారానికి 4 సార్లు కోర్టుకు డీజీపీ హాజరు

ఇంకొందరు ఉన్నతాధికారులు కూడా..

అధికార మత్తులో తప్పుటడుగులు!


అయామ్‌ బాస్‌.. సూపర్‌ బాస్‌! అంతా నేనే.. నాకు నచ్చితేనే ఏదైనా! ప్రభుత్వం చెప్పిందనో.. కోర్టులు ఆదేశించాయనో చేయను. నాకు నచ్చితే.. బుద్ధి పుడితేనే చేస్తా!! కోర్టు ధిక్కారమైనా పట్టించుకోను. అసలు విచారణలకే రాను.. ఏం చేస్తారు..? రాష్ట్రంలో కొందరు ఉన్నతాధికారుల ధోరణి ఇది. సమస్యలపై సకాలంలో స్పందించకుండా తీవ్రమైన నిర్లక్ష్యం నెత్తికెక్కించుకుని రాష్ట్రం పరువును కోర్టు బోనులకెక్కిస్తున్నారు. చివరకు అరెస్టులు, జైలుశిక్ష అని హెచ్చరిస్తే తప్ప అధికారం మత్తు వదలడం లేదు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కొందరు సీనియర్‌ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా ధిక్కరిస్తున్నారు. పబ్లిక్‌ సర్వెంట్లం అన్న విషయం మరచి సొంత రాజ్యం నడుస్తోందన్న భ్రమల్లో ఉంటూ చిన్న చిన్న అంశాలకు కూడా పదేపదే కోర్టులకు వెళ్లివస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. చేతులకు బేడీలు పడతాయి.. జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందనే సరికి వెన్నులో వణుకుపెట్టి కాళ్లబేరానికి దిగుతున్నారు. వీరి తీరుపై సీనియర్‌ బ్యూరోక్రాట్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఏదైనా సమస్యపై ప్రజలు.. సర్వీసు అంశాల్లో న్యాయం కోరుతూ ఉద్యోగులు.. పిటిషన్లు ఇచ్చినప్పుడు అధికారులు నిబంధనలకు లోబడి వాటిని పరిష్కరించాలి. అది వారి డ్యూటీ. ఎందుకంటే వారు పబ్లిక్‌ సర్వెంట్లు. వారు శాఖాధిపతి(హెచ్‌వోడీ)గానో.. లేక మరో కీలక పోస్టులో ఉన్నంత మాత్రాన ఆ శాఖ సొంత రాజ్యం కాదు. వారు సూపర్‌ బాసులూ కాదు. తోటి అధికారులకు, కిందివారికి ఆదర్శంగా నిలవాల్సిన కొందరు సీనియర్‌ అధికారులు తీవ్ర అహంభావం, ఒంటెత్తు పోకడలతో కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. దీంతో కొందరు మిన్నకుండిపోతున్నా.. మరి కొందరు ధైర్యంగా కోర్టుకెళ్లి సదరు అధికారి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. వాటిపై విచారణకు రావాలని కోర్టులు ఆదేశిస్తున్నాయి. సదరు అధికారులు వెళ్లడం లేదు. కోర్టును ధిక్కరించి ఘనకార్యం చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. కోర్టు తీవ్ర చర్యలు మొదలుపెడితే తప్ప అహం వదిలి నేలమీదకు రావడం లేదు. అరెస్టులు, బేడీలు, జైలు వద్దని వేడుకుంటున్నారు.


పబ్లిక్‌ సర్వెంట్లు కారా..? 

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌, ఐఆర్‌ఎస్‌ వంటివి అఖిల భారత సర్వీసు పోస్టులు. జిల్లా కలెక్టర్‌, వివిధ శాఖల విభాగాధిపతులు, ముఖ్యకార్యదర్శులుగా ఐఏఎ్‌సలు ఉంటారు, పోలీసు శాఖలో జిల్లా ఎస్పీ నుంచి డీజీ వరకు ఐపీఎ్‌సలు ఉంటారు. ఈ కేడర్ల అధికారులు పబ్లిక్‌ సర్వంట్లే. వీరిలో అత్యధికులు నీతి, నిజాయితీగా పనిచే స్తూ ప్రజాసేవకులుగా మన్నన పొందుతున్నారు. కొందరు మాత్రం నేతలతో అంటకాగుతూ ప్రభుత్వం, ప్రజలు, ఉద్యోగులు, కోర్టులన్నా లెక్కలేనితనంతో వ్యవహరిస్తూ తరచుగా కోర్టులతో చీవాట్లు తింటుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.


మచ్చుకు కొన్ని ధిక్కార కేసులు.. 

పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. వీరిద్దరూ ఇటీవల అరెస్టు, జైలు శిక్ష నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. విలేజ్‌ హార్టికల్చర్‌ పోస్టుల భర్తీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడమే వీరికి ఈ సమస్యను తెచ్చిపెట్టింది. తన ఆదేశాలను అమలు చేయనందుకు గిరిజాశంకర్‌, చిరంజీవి చౌదరికి తొలుత హైకోర్టు నెల రోజుల జైలు శిక్షతో పాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. తక్షణం ఇద్దరు అధికారులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు చివరి అవకాశం ఇవ్వాలని వారు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థించడంతో తన ఉత్తర్వులను న్యాయస్థానం ఉపసంహరించుకుంది. రెండు వారాల్లో ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.


డీజీపీ ఎన్నోసార్లు.. 

  • ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన్ను విమానాశ్రయంలోనే అడ్డుకున్న వ్యవహారంలో అక్కడి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినందుకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కోర్టు ముందు హాజరై క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

  • ఎస్సైగా పనిచేస్తున్న యు.రామారావుకు సీఐగా పదోన్నతి కల్పించే ప్యానెల్లో స్థానం కల్పించాలని హైకోర్టు లోగడ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో రామారావు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు డీజీపీ సవాంగ్‌తోపాటు ఐజీ మహేశ్‌ చంద్ర లడ్హాను కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. వారు గైర్హాజరయ్యారు. దీనిపై మండిపడిన కోర్టు.. వారిద్దరిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారని, వారెంట్‌ వెనక్కి తీసుకోవాలని వారి తరపున సీనియర్‌ న్యాయవాది కోరారు. దాంతో కోర్టు ఆ చర్యలను ఉపసంహరించింది. అయితే.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, డీజీపీ, ఐజీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో వారు నేరుగా హాజరై వివరణ ఇచ్చారు. కానీ వారు చెప్పిన కారణాలను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉన్నాయని న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు కళ్లు కనపడవని అనుకోవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరో రెండు సందర్భాల్లోనూ డీజీపీ హైకోర్టుకు హాజరయ్యారు. అక్రమ మద్యం వాహనాలను సీజ్‌ చేసి విడుదల చేయని కేసులోనూ కోర్టుకు వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు.


కలెక్టర్‌పై వారెంట్‌.. 

తూర్పు గోదావరి జిల్లా సీహెచ్‌ గున్నేపల్లికి చెందిన ఎస్‌.భైరవమూర్తి బిల్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వినతిని పరిగణనలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబరు 25న హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆదేశాలిచ్చి ఏడాదైనా అమలు కాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఆదేశించినా విచారణకు హాజరుకాని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జూలై 16న కలెక్టర్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలిచ్చింది.


ఐఏఎస్‌ శశిభూషణ్‌కూ..

ఇరిగేషన్‌ శాఖలో ఎన్‌ఎమ్‌ఆర్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన టి.సత్యనారాయణ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ ధిక్కరణ పిటిషన్‌ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకాకపోవడంతో ఐఏఎస్‌ అధికారి శశిభూషణ్‌కు హైకోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.


శాసనసభ కార్యదర్శి ధిక్కారం..

  • శాసనసభలో పనిచేసే పిటిషనర్లు(టైపిస్టులు), ఆఫీసు అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్లు, జీతాలు ఇచ్చే వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సకాలంలో బిల్లులు సమర్పించకుండా శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. ఆయనకు నెల రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించింది. తన వయసును, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని బాలకృష్ణమాచార్యులు వేడుకున్నారు. భవిష్యత్‌లో కోర్టు తీర్పుల అమలులో జాప్యం లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో మానవతా దృక్పథంతో కోర్టు తీర్పును సవరించింది. పనిగంటలు ముగిసేవరకు కోర్టు హాలులో కూర్చోవాలని ఆదేశించింది.
  • విజయనగరం జిల్లా పరిధిలోని ఓ బాలుర వసతి గృహం ఉద్యోగికి హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్‌-1గా పదోన్నతి ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు  చేయకపోవడంతో ఆయన ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా విచారణకు హాజరుకాకపోవడంతో  ఐఏఎస్‌ అధికారులు బి.రామారావు, కె.ప్రవీణ్‌కుమార్‌ అరెస్టుకు హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 


దాస్‌, ఉదయలక్ష్మికి కూడా..

రాజమండ్రి వీటీ జూనియర్‌ కాలేజీలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డి.రత్నకుమార్‌కు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ అమలు చేయాలని, పీఆర్‌ సీ వర్తింపచేయాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో 2014లో రత్న కుమార్‌ అప్పటి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంటర్‌ విద్య కమిషనర్‌ బి. ఉదయలక్ష్మిపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దాస్‌ తరఫున న్యాయవాది రఘువీర్‌ విచారణకు హాజరుకాగా.. ఉదయలక్ష్మి తరఫున ఎవరూ హాజరుకాలేదు. ఆమె కోర్టు ఉత్తర్వులను అమలు చేసినప్పటికీ ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె తరఫు న్యాయవాది విఫలమయ్యారు. కోర్టు ఆమెపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.


మరికొందరిపైనా ధిక్కార కేసులు..

ఇవి హైకోర్టులో విచారణకొచ్చిన కొన్ని ధిక్కార కేసులు మాత్రమే. ఇంకా అనేక కేసులు విచారణకు రావలసి ఉంది. ఓ సీనియర్‌ అధికారిపై ఏకంగా 11 ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖవి 9 దాకా ఉన్నాయి. మరో సీనియర్‌ అధికారిపై రెండు కేసులు ఉన్నాయి. ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు అంశాల్లో సర్కారు ఆదేశాల ప్రకారం నిర్ణయాలు తీసుకోకుండా ఒంటెత్తు పోకడలకు వెళ్లడం వల్లే ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. తమ నిర్లక్ష్యంతో.. జైలు దాకా తెచ్చుకుంటున్నారని సీనియర్‌ ఉన్నతాధికారులు అంటున్నారు.

Updated Date - 2021-06-29T08:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising