ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు కాదని నియామకం

ABN, First Publish Date - 2021-06-15T08:00:02+05:30

చట్టాలు, నిబంధనలతో తమకు సంబంధం లేదని, తమకు నచ్చినవారిని నచ్చిన స్థానంలో నియమించుకుంటామనే వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేవలం అశోక్‌ గజపతిరాజును తొలగించడమే లక్ష్యంగా సింహాచలం వరాహ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచయిత కోసం సర్కారు అత్యుత్సాహం

పురుషులే ఉండాలంటున్న ‘మాన్సాస్‌’ నిబంధన

హైకోర్టు తీర్పుతో ఆ జీవోలన్నీ మాయం

అశోక్‌ గజపతిరాజు తొలగింపే లక్ష్యంగా నియామకాలు

గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్‌ నుంచి తొలగింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చట్టాలు, నిబంధనలతో తమకు సంబంధం లేదని, తమకు నచ్చినవారిని నచ్చిన స్థానంలో నియమించుకుంటామనే వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేవలం అశోక్‌ గజపతిరాజును తొలగించడమే లక్ష్యంగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చైర్మన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేయడం సంచలనం రేపింది. దీంతో ట్రస్టు నిబంధనల ప్రకారం సింహాచలం ఆలయానికి, మాన్సాస్‌ ట్రస్టుకు తిరిగి అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో దేవదాయశాఖ మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శించింది. 1958లో మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ఏర్పాటు సమయంలోనే దాని వ్యవస్థాపకులు పీవీజీ రాజు తర్వాత ట్రస్టుకు ఎవరు చైర్మన్‌గా ఉండాలనే దానిపై డీడ్‌ రాశారు. దాని ప్రకారం ఆయన తర్వాత వారి కుటుంబంలోని పెద్దలైన పురుషులు ఆ బాధ్యతలు చేపట్టాలని స్పష్టంగా ఉంది. దానిని అనుసరించే పీవీజీ రాజు తర్వాత పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్టుకు, సింహాచలం ఆలయానికి చైర్మన్‌ అయ్యారు. 2016 ఆయన మరణించాక, ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆ బాధ్యతలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020 మార్చి 20న కొత్త ట్రస్టుబోర్డును ఏర్పాటుచేసి, అందులో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత పేరును చేర్చింది.


అనంతరం మార్చి 3న ఆమెతోపాటు ఆ కుటుంబంలోని మరో ఇద్దరిని ట్రస్టు ఫౌండర్‌ ఫ్యామిలీ సభ్యులుగా గుర్తిస్తూ జీవో 72 జారీచేసింది. అనంతరం మాన్సాస్‌ ట్రస్టుకు, సింహాచలం ఆలయానికి ఆమెను చైర్మన్‌గా నియమించింది. ట్రస్టు డీడ్‌ ప్రకారం కుటుంబంలో పెద్దలైన పురుషులే చైర్మన్‌గా ఉండాలని నిబంధనలు చెబుతున్నా,  ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. అనంతరం కొద్ది కాలానికి  ట్రస్టు పరిధిలో పలు జిల్లాల్లో ఉన్న చిన్న ఆలయాలకూ అశోక్‌ గజపతిరాజును తొలగించి, సంచయితను చైర్మన్‌ను చేసింది. విజయనగరంలోని రామతీర్థంలో విగ్రహ ధ్వంసం సాకు చూపి, అక్కడా చైర్మన్‌గా ఉన్న అశోక్‌ను తొలగించింది. ఇలా నిబంధనలు పక్కనపెట్టి ఇచ్చిన జీవోలన్నీ ఇప్పుడు రద్దయ్యాయి. సంచయితను ఫౌండర్‌ ఫ్యామిలీ సభ్యురాలిగా ఇస్తూ జారీచేసిన జీవోను కొట్టివేయడంతో అందుకు అనుగుణంగా ఇచ్చిన జీవోలన్నీ రద్దయిపోయాయి. 


సంచయిత నియామకంలో అనేక వివాదాలు..

కాగా, సంచయిత నియామకంలో అనేక వివాదాలు ఏర్పడ్డాయి. ట్రస్టు డీడ్‌ ఉల్లంఘన ఒకటి అయితే, ఆమె ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అని, వారు విడాకులు తీసుకోవడంతో ఆమెకు కుటుంబంతో సంబంధం లేదనే వాదన తెరపైకి వచ్చింది. అసలు వంశపారంపర్యంగా ఆ హక్కులు తమకు వస్తాయంటూ ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె కూడా కోర్టును ఆశ్రయించారు. సంచయిత చర్చిలకు వెళ్తారని, ఆమె హిందువే కాదనే ఆరోపణలు వచ్చాయి. అయినా వైసీపీ ప్రభుత్వం వీటిని కనీసం పట్టించుకోలేదు. సింహాచలం, మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచయితపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె ఎక్కడో ఉంటూ సింహాచలం కొండపై ఓ వ్యక్తిని పెట్టి, అతనితోనే ఆలయ పాలన సాగించాలని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో అధికారులకు, సంచయితకు మధ్య వివాదం కూడా ఏర్పడింది. దీంతో అక్కడ పనిచేసిన పలువురు అధికారులు తమను బదిలీ చేయాలంటూ దేవదాయశాఖ ఉన్నతాధికారులు లేఖలు కూడా రాశారు. మాన్సాస్‌ ట్రస్టు ఈవోగా నెలల వ్యవధిలోనే పలువురు మారారు. ట్రస్టు పరిధిలో తూర్పుగోదావరిలో ఉన్న ఆలయాల భూముల్లో ఉన్న ఇసుక వేలం విషయంలోనూ సంచయిత జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ ఇబ్బందులు తమ వల్ల కాదంటూ పలువురు అధికారులు అక్కడి నుంచి బదిలీ చేయాలని మొరపెట్టుకున్నారు.


ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జీవోలు మాయం..

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సంచయితను ఫౌండర్‌ ఫ్యామిలీ సభ్యురాలిగా గుర్తిస్తూ ఇచ్చిన జీవో, సింహాచలం, మాన్సాస్‌ ట్రస్టులకు చైర్మన్‌గా నియమిస్తూ ఇచ్చిన జీవోలను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రభుత్వం తొలగించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆ జీవోలు మాయమవడం విశేషం. దీంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రభుత్వం ముందుగానే భావించినట్టు అర్థమవుతోంది. కాగా, పంతం నెగ్గించుకునేందుకు ట్రస్టు డీడ్‌లో సవరణలకు దేవదాయశాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తుందనే ప్రచారం జరుగుతోంది.  


ధర్మం, చట్టం, న్యాయానిదే అంతిమ విజయం

అశోక్‌గజపతిరాజుకు లోకేశ్‌ అభినందనలు

ధర్మం, చట్టం, న్యాయానిదే అంతిమ విజయమని మాన్సాస్‌ ట్రస్ట్‌ కేసులో హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. అర్ధరాత్రి అప్రజాస్వామిక జీవోలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అన్నారు. భూములు, వేల కోట్ల ఆస్తులు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి, సత్యనిష్టకు ఈ తీర్పు మరింత వన్నెతెచ్చిందన్నారు. న్యాయపోరాటంలో విజయం సాధించిన అశోక్‌గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. అరాచక పాలనపై సింహాచలం అప్పన్న ఆశీస్సులు, ప్రజాభిమానం, రాజ్యాంగం సాధించిన విజయం ఇది అన్నారు.

Updated Date - 2021-06-15T08:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising