పెట్రో మంటలపై నిరసన సెగ
ABN, First Publish Date - 2021-10-29T08:56:47+05:30
పెట్రో మంటలపై నిరసన సెగ
వామపక్షాల ఆందోళనలు, రాస్తారోకోలు.. పెట్రో, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్
రామకృష్ణ, మధు, చలసాని శ్రీనివాస్ అరెస్టు.. నేతలను ఈడ్చిపడేసిన పోలీసులు
పరిస్థితి ఉద్రిక్తం
సొమ్మసిల్లి పడిపోయిన మధు, బాబూరావు
ధరలు నియంత్రించకుంటే రాష్ట్ర బంద్: రామకృష్ణ, మధు
అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వామపక్షాలు భగ్గుమన్నాయి. ధరల పెంపును వ్యతిరేకిస్తూ పది వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు హోరెత్తాయి. పోలీసులు అరెస్టులకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విజయవాడలోని లోబ్రిడ్జి దగ్గర బొమ్మ సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్ వద్ద సీపీఐ, సీపీఎం విజయవాడ నగర కమిటీలు, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పి మధు, వామపక్ష నాయకులు సీహెచ్ బాబూరావు, దోనేపూడి శంకర్, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్, వివిధ కార్మిక, మహిళా, ప్రజా సంఘాల నేతలు తరలివచ్చి నలుదిక్కులా దిగ్బంధించారు. ఆటోలు, వాహనాలను రహదారులకు అడ్డంగా ఉంచి ఆటో కార్మికులు, మహిళలు నిరసన తెలిపారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. దాదాపు అర్ధగంటకుపైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకులతోపాటు ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం రెండూ పోటాపోటీగా నిత్యావసర ధరలు పెంచుతూ, ప్రజలపై భారాలు మోపుతున్నాయని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.60 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.114కు పెరిగిందన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. మరో నెలరోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.135కి చేరే ప్రమాదముందని అన్నారు. బీజేపీ నేతలు ద్విచక్ర వాహనాల డిజైన్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు తప్ప పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణకు ప్రయత్నిచండంలేదని మండిపడ్డారు. ధరల పెరుగుదలపై కేంద్రం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
సొమ్మసిల్లిన మధు, బాబూరావు
ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష నాయకులు విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద రాస్తారోకోకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మార్కెట్ వద్ద పెద్దఎత్తున మోహరించారు. కార్యక్రమానికి ఆటోలు పెద్దఎత్తున తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజాసంఘాల కార్యకర్తలు, మహిళలు నలువైపులా రోడ్లను దిగ్బంధించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వామపక్ష నాయకులను ఈడ్చి పోలీసు వాహనాల్లో పడేశారు. ఈ పరిణామంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీహెచ్ బాబూరావు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయారు. పలువురి నాయకుల చొక్కాలు చిరిగిపోయాయి. సుమారు 50 మంది వామపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
విశాఖలో వాహనాలు నడిపిస్తూ నిరసన..
పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్షాల నేతలు, కార్యకర్తలు విశాఖపట్నంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురు గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం కూడలి వరకూ ద్విచక్ర వాహనాలు నడిపించుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సీహెచ్ నరసింగరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకుడు వై.కొండయ్య మాట్లాడుతూ.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రో, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీలు ధరలు తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తేవడం విస్మరించి, ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారని విమర్శించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Updated Date - 2021-10-29T08:56:47+05:30 IST