ఎట్టకేలకు ఈడబ్ల్యూ‘ఎస్’
ABN, First Publish Date - 2021-07-15T07:31:11+05:30
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాపై సర్కారు ఎట్టకేలకు దిగి వచ్చింది. ఉద్యోగాలలో అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేరిట జీవో జారీ
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్
విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం కోటా
జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రూ.8 లక్షల వార్షిక ఆదాయం పరిమితి
ఓబీసీ ఆదాయ పరిమితి 8 లక్షలకు పెంపు
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాపై సర్కారు ఎట్టకేలకు దిగి వచ్చింది. ఉద్యోగాలలో అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేరిట జీవో జారీ అయ్యింది. విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ ఈ కోటా అమలవుతుంది. రూ.8 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న వారిని ఆర్థికంగా వెనుకబడిన వారిగా పరిగణిస్తారు. జీతం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తిపరమైన ఆదాయం ఏదైనా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కోటా కింద లబ్ధి పొందాలనుకునే వారు తహసిల్దార్ నుంచి ‘ఈడబ్ల్యూఎస్’ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందని... ఇతర వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ కోటా వర్తిస్తుందని... అందులోనూ మూడో వంతు మహిళలకు కేటాయించామని ఈ జీవోలో పేర్కొన్నారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను, ఇతర నిబంధనలతో తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తారు.
కేంద్రం చట్టం ప్రకారం..: విద్యా, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగాన్ని సవరించింది. అయితే... దీనికి పలు నిబంధనలను విధించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి రావాలంటే... ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండొద్దు. నగరాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మించి ఫ్లాట్ ఉండొద్దు. నగరాల్లో అయితే వంద గజాలు, గ్రామాల్లో రెండొందల గజాలకు మించిన ఇంటి స్థలం ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి రారని కేంద్రం చెప్పింది. అయితే... ఇప్పుడు అవన్నీ తీసేసి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించరాదనే ప్రాతిపదికను మాత్రమే తీసుకున్నారు.
కాపు కోటా లేనట్లే..: ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం ఇచ్చిన పది శాతం కోటాలో ఐదు శాతాన్ని చంద్రబాబు కాపులకు కేటాయించారు. మరో ఐదు శాతాన్ని ఇతర అగ్రవర్ణ పేదలకు వర్తింప చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి.. దానిని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కానీ, కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. ఆ తర్వాత దీనిపై కోర్టుల్లోనూ కేసులు పడ్డాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక... ఈడబ్ల్యూఎస్ కోటా గురించి పట్టించుకో లేదు. తాజా జీవో ప్రకారం... కాపులు కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా పొందే అగ్రవర్ణాల పరిధిలోకే వస్తారు. మరోవైపు... ఓబీసీలకు ‘క్రీమీలేయర్’ ఆదాయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.6 లక్షలను ఇప్పుడు 8 లక్షలకు పెంచింది.
Updated Date - 2021-07-15T07:31:11+05:30 IST