ఇస్రో ‘తొలి’ విక్టరీ
ABN, First Publish Date - 2021-03-01T08:59:22+05:30
ఇస్రో విజయాశ్వం గురి తప్పలేదు. లాక్‌డౌన్ అనంతరం, ఈ ఏడాది ఇస్రో తలపెట్టిన ‘తొలి’ వాణిజ్య ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 14 విదేశీ, 5 స్వదేశీ
గురితప్పని పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్
ఎన్‌ఎ్‌సఐఎల్ తొలి వాణిజ్య ప్రయోగం సక్సెస్
14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలు రోదసిలోకి
17 నిమిషాల్లోనే కక్ష్యలోకి అమెజోనియా-1
మరో గంటన్నరలో మిగతా 18 ఉపగ్రహాలు
ప్రయోగ ప్రత్యేకతలివే..
ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగం
పీఎ్‌సఎల్వీ రాకెట్లలో 53వ ప్రయోగం
పీఎ్‌సఎల్వీ రాకెట్లలో 51వ విజయం
షార్ నుంచి నింగిలోకి 79వ రాకెట్ పయనం
ప్రథమ ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం
ఈ ప్రయోగంతో ఇప్పటివరకు 34 విదేశాలకు
చెందిన 342 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేత
రాకెట్ తయారీ, ప్రయోగ ఖర్చు రూ.130 కోట్లు
శ్రీహరికోట(సూళ్లూరుపేట), ఫిబ్రవరి 28: ఇస్రో విజయాశ్వం గురి తప్పలేదు. లాక్‌డౌన్ అనంతరం, ఈ ఏడాది ఇస్రో తలపెట్టిన ‘తొలి’ వాణిజ్య ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి ఎగసిన పీఎ్‌సఎల్వీ-సీ51 అలవోకగా లక్ష్యాన్ని పూర్తిచేసి ఇస్రోకు మరో ఘన విజయాన్ని కట్టబెట్టింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీ్‌షధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 10:24 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రోదసీలోకి దూసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ51 గంటా 55 నిమిషాల్లోనే 19 ఉపగ్రహాలను అంచలంచెలుగా నిర్ణీత కక్ష్యల్లో విడిచిపెట్టింది. నాలుగు దశల మోటార్లతో పైకెగిరిన రాకెట్ తొలి 17.24 నిమిషాల్లోనే సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి చేరుకొని బ్రెజిల్‌కు చెందిన 637 కేజీల భూపరిశీలన ఉపగ్రహం అమెజోనియా-1ను అక్కడ విడిచిపెట్టింది.
తదుపరి రాకెట్‌లోని నాల్గవ దశ ఇంజన్‌ను ఆఫ్‌ఆన్ చేస్తూ శాస్త్రవేత్తలు రాకెట్‌ను రోదసీలో 1:33 గంటలు పయనింపచేశారు. అనంతరం డీఆర్‌డీవో ఆధ్వర్యంలో బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం స్పేస్‌కిడ్జి ఇండియా విద్యార్థులు రూపొందించిన సతీశ్ ధవన్‌శాట్, అమెరికాకు చెందిన ఎస్‌ఎఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం, ఆ దేశానికే చెందిన 12 స్పేస్‌బీస్ ఉపగ్రహాలు వరుసగా రాకెట్ నుంచి విడివడి కక్ష్యల్లోకి చేరుకున్నాయి. చివరగా గంటా 55 నిమిషాలకు స్వదేశీ విద్యార్థులు రూపొందించిన జేఐటీశాట్, జీహెచ్‌ఆర్‌సీఈశాట్, శ్రీశక్తిశాట్‌లతో కూడిన యూనిటీశాట్ కక్ష్యలోకి చేరుకుంది. దాంతో ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ ప్రకటించారు.
ఎన్‌ఎ్‌సఐఎల్ తొలి వాణిజ్య ప్రయోగం
గతంలో భారత అంతరిక్షశాఖ ఆధ్వర్యంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని ఆయా దేశాల ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా కక్ష్యల్లోకి చేరవేయించేది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నూతనంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఐఎల్)ను రూపొందించి విదేశాలతోపాటు భారత్‌లోనూ ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష ప్రయోగాలలో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. ఎన్‌ఎ్‌సఐఎల్ సంస్థ వాణిజ్య ఒప్పందాల మేరకు ఇస్రో రాకెట్లు దేశ, విదేశీ ప్రైవేటు ఉపగ్రహాలను ప్రయోగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పీఎ్‌సఎల్వీ-సీ51 రాకెట్‌తో ఇస్రో ఎన్‌ఎ్‌సఐఎల్ తొలి వాణిజ్య ప్రయోగాన్ని నిర్వహించి 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసింది.
అంతరిక్షంలోకి భగవద్గీత, మోదీ ఫొటో
పీఎ్‌సఎల్వీ-సీ51 ప్రయోగం ద్వారా భగవద్గీతతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపారు. స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యార్థులు రూపొందించిన సతీశ్ ధవన్‌శాట్ అనే బుల్లి ఉపగ్రహం ద్వారా భగవద్గీత కాపీలు, మోదీ ఫొటో, పేరుతోపాటు ఇస్రో చైర్మన్ శివన్, సాంకేతిక కార్యదర్శి ఆర్ ఉమామహేశ్వరన్, చెన్నై విద్యార్థులు, ఆత్మనిర్భిర్ భారత్ పేరు కలిపి 25వేల పేర్లను పంపారు.
‘సింధునేత్ర’ విజయానికి అభినందనలు: పీఈఎస్ చాన్స్‌లర్
బెంగళూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీ విద్యార్థులు మూడేళ్లపాటు శ్రమించి రూపొందించిన ‘సింధునేత్ర’ ఉపగ్రహం పీఎ్‌సఎల్‌వీ సీ-51 ద్వారా అంతరిక్షంలోకి చేరింది. పీఈఎస్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి తమ సిబ్బందిని అభినందించారు. ఇస్రోలో మూడున్నర దశాబ్దాలపాటు వివిధ హోదాలలో పనిచేసిన శాస్త్రవేత్త సాంబశివరావు, నాగేంద్ర సహకారంతో పీఈఎస్ విద్యార్థులు రూపొందించిన ‘సింధునేత్ర’ సముద్ర తీరంపై నిఘా పెట్టనుంది.
అంతరిక్ష సంస్కరణల్లో కొత్త శకం: మోదీ
ఇస్రో చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం పీఎ్‌సఎల్వీ-సీ51 విజయం పట్ల ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. ‘దేశంలో అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకానికి ఇది నాంది పలికింది. పీఎ్‌సఎల్వీ-సీ51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపి తొలి వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఐఎల్)కు అభినందనలు’ అని ప్రయోగానంతరం మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రధాని జెయిర్ బోల్సొనారోతోపాటు ఆ దేశ శాస్త్రజ్ఞులను కూడా మోదీ అభినందించారు. ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్వీ-సీ51 విజయవంతం కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇస్రో టీమ్‌కు అభినందనలు చెప్పిన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ ఇది అంతరిక్ష పరిశోధన, అన్వేషణలో భారత్ చేస్తున్న కృషికి నిదర్శనమని కొనియాడారు.
భారత్‌తో బంధం బలోపేతం: బ్రెజిల్ మంత్రి
భారత్‌తో బ్రెజిల్ సంబంధం మరింత బలోపేతమవుతుందని ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కస్ పోంటెస్ అన్నారు. పీఎ్‌సఎల్వీ-సీ51 ద్వారా బ్రెజిల్ ఉపగ్రహం అమెజోనియా-1ను ప్రయోగిస్తున్న సందర్భంగా ఆయన ఆదివారం షార్‌కు విచ్చేసి మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగానంతరం ఆయన మాట్లాడుతూ.. ఇస్రో చైర్మన్‌కు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది ఇస్రో బిజీ బిజీ: శివన్
ఇస్రోకు ఈ ఏడాది చేతినిండా పని ఉందని ఇస్రో చీఫ్ శివన్ అన్నారు. పీఎ్‌సఎల్వీ-సీ51 ప్రయోగ విజయానంతరం షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచిఆయన ప్రసంగించారు. ఈ ఏడాది ఏడు రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఇస్రో ఉందన్నారు. 6 రాకెట్లతో ఉపగ్రహాలు ప్రయోగిస్తామన్నారు. గగన్‌యాన్ రిహార్సల్స్‌లో భాగంగా ఈ ఏడాది చివర్లో ఒక మానవరహిత రాకెట్‌ను ప్రయోగిస్తామని వెల్లడించారు. కాగా.. బెంగళూరుకు చెందిన పిక్సెల్ ఇండియా రూపొందించిన ‘ఆనంద్’ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించి ఉంటే తాజా ప్రయోగం పరిపూర్ణమయ్యేదని శివన్ అన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ సంస్థ ప్రయోగానికి ముందు వైదొలిగిందని ఆయన చెప్పారు.
Updated Date - 2021-03-01T08:59:22+05:30 IST