రైల్వే ట్రిక్..ట్స్
ABN, First Publish Date - 2021-10-22T05:07:51+05:30
కరోనా బూచిని చూపి రైల్వే శాఖ స్పెషల్ పేరుతో చార్జీల దోపిడీని కొనసాగిస్తూనే ఉంది. ప్రయాణికులపై రోజూ మోయలేని భారం మోపుతూనే ఉంది. అప్పుడెప్పుడో కరోనా పేరు(సీట్లలో ఎడం)తో మొదలుపెట్టిన ప్రత్యేక బాదుడు నేటికీ కొనసాగిస్తూనే ఉంది.
‘స్పెషల్’ పేరుతో కొనసాగిస్తున్న అదనపు చార్జీలు
కరోనా తగ్గినా, లాక్‌డౌన్ ఎత్తేసినా తగ్గని బాదుడు
ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
గిద్దలూరు, అక్టోబరు 21 : కరోనా బూచిని చూపి రైల్వే శాఖ స్పెషల్ పేరుతో చార్జీల దోపిడీని కొనసాగిస్తూనే ఉంది. ప్రయాణికులపై రోజూ మోయలేని భారం మోపుతూనే ఉంది. అప్పుడెప్పుడో కరోనా పేరు(సీట్లలో ఎడం)తో మొదలుపెట్టిన ప్రత్యేక బాదుడు నేటికీ కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది.. లక్షల కేసులు వేలల్లోకి వచ్చాయి.. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేశారు.. కానీ రైల్వేశాఖకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. కరోనా సమయంలో రెగ్యులర్ రైళ్లను కొన్నింటిని స్పెషల్ (ప్రత్యేక) పేరుతో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. ప్రస్తుతం సాధారణ జనజీవనం సాగుతున్నా రైల్వేశాఖ ప్రత్యేకం పేరుతో చేస్తున్న అదనపు వసూళ్లను రద్దు చేయకపోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ మాత్రం స్పెషల్ తోకలను అలాగే ఉంచి రెట్టింపునకు పైగా చార్జీలను ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది. బస్సు చార్జీల భారాన్ని మోయలేని ప్రయాణికులకు రైల్వే టికెట్ ధరలూ విపరీతంగా ఉండడంతో అల్లాడిపోతున్నారు. రైల్వేశాఖ ఇప్పటికైనా కరోనా పేరుతో వసూలు చేస్తున్న అదనపు తత్కాల్ చార్జీలను రద్దు చేసి పాత చార్జీలను వసూలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రత్యేక బాదుడికి ఉదాహరణ
కరోనాకు ముందు గిద్దలూరు నుంచి విజయవాడకు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బెర్త్ రిజర్వేషన్ చేయించుకుంటే రూ.180 చార్జీ వసూలు చేస్తారు. స్పెషల్ పేరుతో అదనంగా రూ.200 కలిపి మొత్తం రూ.380 దాకా వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు.
స్పెషల్ పేరు తగలించిన సాధారణ రైళ్లు ఇవే...
విజయవాడ-గిద్దలూరు-గుంతకల్లు రోడ్డులో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతుంటాయి. ప్రధానంగా విజయవాడ-హుబ్లీ అమరావతి ఎక్స్‌ప్రెస్, హౌరా-వాస్కోడిగామా పెద్ద అమరావతి ఎక్స్‌ప్రెస్, ధర్మవరం-విజయవాడ మధ్య ధర్మవరం ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ మధ్య కాచిగూడ ఎక్స్‌ప్రె్‌సలు రెగ్యులర్‌గా తిరిగేవే. వీటికి స్పెషల్ అనే పేరు తగిలించి రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
అన్‌రిజర్వుడ్ జోరు
గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా కాచిగూడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు భోగీలను అన్‌రిజర్వుడ్‌గా వేశారు. వీటిల్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకుని కూర్చుని ప్రయాణించవచ్చు. కానీ భోగీల్లో ఉండే సీట్ల కంటే పది రెట్లకు పైగా టికెట్లను అన్‌రిజర్వుడ్ కేటగిరీలో రైల్వేశాఖ జారీ చేస్తున్నది. దీంతో ఆ భోగీలలో నిల్చొని కూడా ప్రయాణించలేని పరిస్థితి ఉంది. ఆ రద్దీని తట్టుకోలేని కొంతమంది పక్క భోగీలకు వెళ్లి ప్రయాణికులను బతిమలాడి ఆ సీట్లలో సర్దుకొని కూర్చుని వెళ్తున్నారు. దీంతో రిజర్వు చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధర ఎక్కువైనా సీటు రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణిస్తున్న వారికి అన్‌రిజర్వుడ్ టికెట్లతో కొందరు ప్రయాణికులు ఆ భోగీల్లోకి ఎక్కుతున్నారు. అన్‌రిజర్వుడ్ భోగీల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కానప్పటికీ సీట్ల సంఖ్యకు కొంచెం అటూ, ఇటూ అయినా టికెట్లను జారీ చేయాలి. అడిగినన్ని టికెట్లు ఇవ్వడం వలన ఒకరిపై ఒకరు కూర్చుని వెళ్తుండడంతో కరోనా వ్యాప్తిపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు అదనపు చార్జీల వసూళ్లను రద్దు చేయడంతోపాటు యథావిధిగా రైళ్లను తిప్పాలని, రిజర్వుడ్ భోగీల్లోకి ఆ మేరకు మాత్రమే ప్రయాణికులు ఉండేలా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
Updated Date - 2021-10-22T05:07:51+05:30 IST