ఐదేం అన్యాయం..!
ABN, First Publish Date - 2021-10-30T04:40:02+05:30
సింగరాయకొండ ఏఎంసీ ప్రాంగణంలో చేపలు అమ్ముకొని జీవనం వెళ్లదీస్తున్న గిరిజనులపై వైసీపీ నాయకులు కన్నెర్రజేశారు. లోపల చేపలు అమ్మడానికి వీల్లేదని హుకుం జారీ చేసి బయటకు గెంటేశారు.
సింగరాయకొండ ఏఎంసీలో గిరిజనులు, మార్కెట్‌లో వ్యాపారుల మధ్య అమ్మకాల వివాదం
వ్యాపారులకు మద్దతుగా రంగంలోకి దిగిన వైసీపీ నేతలు
ఏఎంసీ ప్రాంగణంలో చేపలు అమ్మనివ్వకుండా గిరిజనుల గెంటివేత
సింగరాయకొండ, అక్టోబరు 29 : స్థానిక ఏఎంసీ ప్రాంగణంలో చేపలు అమ్ముకొని జీవనం వెళ్లదీస్తున్న గిరిజనులపై వైసీపీ నాయకులు కన్నెర్రజేశారు. లోపల చేపలు అమ్మడానికి వీల్లేదని హుకుం జారీ చేసి బయటకు గెంటేశారు. దిక్కుతోచిన స్థితిలో గిరిజనులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ప్రవహించే వాగుల్లో గిరిజనులు చేపలు పట్టుకొని వాటిని ఏఎంసీ ఆవరణలో పెట్టి అమ్ముతూ బతుకు వెళ్లదీస్తుంటారు. వీరు మొట్టమొదట ఏఎంసీ వద్ద ఉన్న చేపల మార్కెట్ ఎదురు స్థలంలో చేపలు అమ్మేవారు. ఈ అమ్మకాలను చేపల మార్కెట్‌లో ఉండే వ్యాపారులు వ్యతిరేకించారు. మీ వల్ల తమ వ్యాపారం సక్రమంగా సాగక నష్టపోతున్నామని గొడవకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదేమీలేక గ్రామానికి దూరంగా కందుకూరు ఫ్లైఓవర్ దగ్గరకు మకాం మార్చారు. అక్కడ చేపలు అమ్మకాలు చేశారు. ఆ తరువాత ఏఎంసీ చైర్మన్ రాపూరి ప్రభావతి చొరవతో గిరిజనులు ఏఎంసీ ప్రాంగణంలో చేపలు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో 40 నుంచి 50 మంది గిరిజనులు తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకొని దాదాపు ఏడాది నుంచి చేపలు అమ్ముతున్నారు. అందుకుగాను వీరు ఏఎంసీకి ఒక్కొక్కరు నెలకు రూ.300 రుసుం చెల్లిస్తున్నారు. దాదాపు వీరి వలన ఏఎంసీకి నెలకు సుమారు పదిహేను వేల రూపాయలలోపు ఆదాయం సమకూరుతుంది.
అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కథ మళ్లీ మొదటికి వచ్చింది. చేపల మార్కెట్‌లో అమ్మకాలు చేసుకుంటున్న వారు గిరిజనులపై స్థానిక వైసీపీ నేతలకు ఫిర్యాదులు చేశారు. ఏఎంసీ ప్రాంగణం లోపల చేపలు అమ్ముతుండడం వల్ల తాము నష్టపోతున్నామని తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవరించారన్న ఆరోపణలు ఉన్నాయి. గిరిజనుల వద్దకు వెళ్లి ఏఎంసీని ఖాళీ చేసి బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. లేకపోతే ఒక్కొక్కరిపై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో వారు ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేసి బయట చేపల మార్కెట్ ఎదురు రోడ్డు పక్కన ఎండకు, వానకు తడుస్తూ అమ్మకాలు చేసుకుంటున్నారు. ఈ సమస్యను ఏఎంసీ చైర్మన్ ప్రభావతి ఇప్పటికే పీడీసీసీబీ చైర్మన్ మాదాసి దృష్టికి తీసుకెళ్లారు. కాని సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎప్పటిలాగే ఏఎంసీ ప్రాంగణంలో అమ్మకాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
సమస్య పరిష్కారానికి కృషిచేస్తా
ఏఎంసీ చైర్మన్ రాపూరి ప్రభావతి
సమస్యను పీడీసీబీ చైర్మన్ మాదాసి వెంకయ్య దృష్టికి, మార్కెట్ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలోనే పరిష్కారానికి కృషిచేసి గిరిజనులకు న్యాయం చేస్తా.
Updated Date - 2021-10-30T04:40:02+05:30 IST