చిన్నచేపలను చంపేందుకు గుళికలు కలిపారు..!
ABN, First Publish Date - 2021-10-29T06:28:30+05:30
చేపల చెరువులో విషపు గుళికలు కలిపిన ఘటన మండలంలోని ఆవులమంద పంచాయతీ పరిధిలోని కొత్తూరులో జరిగింది.
కురిచేడు, అక్టోబరు 28: చేపల చెరువులో విషపు గుళికలు కలిపిన ఘటన మండలంలోని ఆవులమంద పంచాయతీ పరిధిలోని కొత్తూరులో జరిగింది. చేపల చెరువు నిర్వాహకులే ఉద్దేశ్యపూర్వకంగా ఈ గుళికలు కలిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుళికలు కలపడంతో చెరువులోని నీటితోపాటు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి.
కురిచేడు మండలం ఆవులమంద పంచాయతీ పరిధిలో కొత్తూరు గ్రామం పక్కనే 143 ఎకరాల్లో చెరువు ఉంది. దీనిని దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన అంకాళపరమేశ్వరీ జాలర్ల సంఘం వారికి లీజుకు ఇచ్చారు. వారు ఆ చెరువును స్థానికంగా ఉండే కొందరికి సబ్‌లీజుకు ఇచ్చారు. సబ్‌లీజుకు తీసుకున్న వారు ఈ సంవత్సరం చేపలు వేసి వాటిని పెంచి పట్టి అమ్ముకున్నారు. ఇక ప్రస్తుతం చెరువులో చిన్న చిన్న చేపలు మిగిలి ఉన్నాయి. ఆ చేపలను పట్టడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. వాటిని పట్టకుండా మరోసారి చేపలు వేసి పిల్లను వదిలితే వదిలిన పిల్లను అప్పటికే ఉన్న చేపలు తిసేస్తాయి. ఈ క్రమంలో మరోసారి పిల్ల వదలాల్సిన సమయం వచ్చింది. ఈ క్రమంలో చెరువులో ఇటీవల గుళికలు కలిపారు. ఆ గుళికలతో చెరువులో మిగిలిన చేప పిల్లలు మృతి చెందాయి. గుళికలు కలపడంతో ప్రస్తుతం నీరంతా విషతుల్యమైంది. ఆ నీటిని తాగిన గేదెలు, జీవాలు మృతి చెందుతున్నాయి. ఇక భూగర్భజలాలు విషతుల్యమౌతున్నాయి. ప్రస్తుతం చెరువు పక్కనే బావిని తీసి ఆ నీటిని ఆవులమంద గ్రామంలోకి మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. బావిలోకి దుర్వాసనతో ఉన్న విషపు నీరే గ్రామంలోని కుళాయిలకు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆ నీటిని ఇంటి అవసరాలకు కూడా వినియోగించలేకపోతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇక కొత్తూరు గ్రామంలోకి సాయంత్రం సమయంలో చెరువు నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. చెరువు నీటిని పొలాలకు వినియోగించినా పొలాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు.
కల్లూరులోనూ గ్రామస్థుల ఆందోళన
మండలంలోని కల్లూరు పంచాయతీ పరిధిలోని చెరువులోనూ ఇదే విధంగా గుళికలు కలిపారు. దీంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్, ఫిషరీస్ శాఖాధికారులు, పోలీసులు పరిశీలించి వచ్చారు. అయితే నిర్వాహకుల మీద కనీసం చర్యలు లేవు. గతంలో కల్లూరు చెరువులో గుళికలు కలిపినప్పుడు తగిన చర్యలు తీసుకుని ఉంటే మరలా ఆవులమంద చెరువులో గుళికలు కలిపే వారు కాదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నాడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులో చలనం లేదు. ఒక శాఖపై మరోశాఖ చెప్పుకుంటూ అసలు గుళికలు కలిపిన వారిని పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మరే చెరువులో విషపు గుళికలు కలపకుండా చూడాలని మండల వాసులు కోరుతున్నారు. అదే విధంగా ఇప్పుడు గుళికలు కలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2021-10-29T06:28:30+05:30 IST