వరి.. వర్రీ!
ABN, First Publish Date - 2021-09-06T08:32:16+05:30
ఆంధ్రా అంటేనే అన్నపూర్ణగా ప్రసిద్ధి. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి. రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట ఇదే. లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల ఆయకట్టులో...
- పెరిగిన వ్యయం.. సాగు భారం
- మద్దతు ధర ప్రకటనలకే పరిమితం
- పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి
- రాష్ట్రంలో తగ్గుతున్న సొంత సేద్యం
- మూడొంతులు కౌలు సాగే
- కర్నూల్ సోనా ఉత్పత్తి ఢమాల్
- 35 లక్షల క్వింటాళ్లు తగ్గే ప్రమాదం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రా అంటేనే అన్నపూర్ణగా ప్రసిద్ధి. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి. రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట ఇదే. లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల ఆయకట్టులో వరి సాగే కీలకం. ప్రకృతి విపత్తులు, సాగునీటి సమస్యలు, కాల్వల దుస్థితి, ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల సమస్యలు, గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల దోపిడీ, మిల్లర్ల మాయజాలం తదితర కారణాలతో వరి సాగు కష్టంగా మారిందన్న భావన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. నిరుడు ఖరీ్‌ఫలో పండిన పంట తుఫాన్లకు దెబ్బతినగా, తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొన్నారు. పంట నష్టానికి ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వకుండా నామమాత్రంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంది. రబీలో పండిన ధాన్యాన్ని అందరి దగ్గర కొనకపోవడంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధర దక్కలేదు. పైగా పౌరసరఫరాల సంస్థకు అమ్మిన రైతులకు నెలల తరబడి సొమ్ము చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఓ వైపు ఖర్చులు పెరగగా, మరో వైపు మద్దతు ధర లభించక కొందరు రైతులు వరి సాగు తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరల పెరుగుదల కూడా వరిసాగుపై ప్రతికూల ప్రభావానికి కారణమైంది.
రెండో పంటే దిక్కు..
ప్రకృతి అనుకూలిస్తే, సొంత పొలంలో వరి పండించడానికి నిరుడు ఎకరాకు రూ.33 వేలు ఖర్చవగా, ఈ ఏడాది సగటున రూ.42వేలు ఖర్చవుతోంది. కౌలుదారుడికైతే రూ.55 వేలవుతోంది. ఎకరాకు 28 క్వింటాళ్ల (70 కిలోల బస్తాలు 40) దిగుబడి వస్తే, ఈ ఏడాది మద్దతు ధర ప్రకారం కామన్ వెరైటీ రూ.1,940, గ్రేడ్-ఏ రూ.1,960 చొప్పున అమ్మినా.. సుమారు రూ.55 వేలు వస్తాయి. ఎకరం పంట అమ్మితే సొంత రైతుకు రూ.13వేలు వస్తే, కౌలు రైతుకు రూ.5వేలు కూడా రాని పరిస్థితి. క్వింటా వరి ధాన్యం ఉత్పత్తికి రూ.1,293 ఖర్చవుతుందని వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణాయక సంస్థ అంచనా వేసింది. దోమపోటు వంటి తెగుళ్లు, ఎలుకలు విజృంభించినా, వర్షాలు ఎక్కువైనా, వరదలు ముంచెత్తినా, ధాన్యం తడిసినా, గిట్టుబాటు ధర లేకున్నా.. రైతు అంచనాలు కూడా తారుమారై నష్టాలు మిగులుతాయి. అందుకే వరి సాగు అంటే చిన్న, సన్నకారు రైతులు తట్టుకోలేని స్థితి. అయినా మాగాణుల్లో రెండో పంటపై వచ్చే ఆదాయం కోసమే డెల్టా ప్రాంతాల రైతులు వరిసాగు చేస్తున్నారు. గతంలో రెండో పంటగా మినుము, పెసర సాగు ఎక్కువగా ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా పశువులు, కోళ్ల దాణాగా వాడే మొక్కజొన్న సాగుతో వచ్చే ఆదాయమే అన్నదాతలకు మిగులుతోంది. అయితే రెండో పంట వేయడానికి మొదటి పంటను పొలంలోనే వచ్చిన రేటుకు అమ్మేస్తున్నారు. రెండు పంటలు సక్రమంగా పండితేనే కుటుంబ ఖర్చులకు వస్తాయని చిన్న, సన్నకారు రైతులు చెప్తున్నారు.
సొంత సేద్యానికి స్వస్తి..
సొంతంగా వరి సేద్యం చేయడం కన్నా.. కౌలుకు ఇవ్వడంపైనే కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలోని కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆరుగాలం శ్రమించి, పంట పండిస్తే వచ్చేంత ఆదాయం కౌలుకు ఇచ్చినా వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. డెల్టా ప్రాంతాల్లో ఎకరాకు 20-30 బస్తాల ధాన్యం కౌలు కింద ఇచ్చే విధానం నడుస్తుండటంతో భూ యజమానులు ఇతర వ్యాపకాలతో పొలాలను కౌలుకిచ్చేస్తున్నారు.
తగ్గనున్న కర్నూలు సోనా ఉత్పత్తి
ఈ ఏడాది సార్వా వరి సాగు సగటున 20ు తగ్గింది. ముఖ్యంగా కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వరి సాగు తగ్గింది. ప్రకాశం జిల్లా 25ు, కర్నూలు 36ు, కడప 41ు, గుంటూరు 59ు, అనంతపురం 78ు మాత్రమే వరి వేశారు. ఏటా ఈ పాటికే వరి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా, కృష్ణా, గోదావరి వంశధార, నాగావళి ప్రాజెక్టుల పరిధిలో ఇంకా 100ు నాట్లు పడలేదు. కృష్ణా, గోదావరి నదులకు వరదలొచ్చి, జలాశయాలు నిండుగా ఉన్నా, డెల్టాలో సార్వా సాగు మందకొడిగానే సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కాల్వల వ్యవస్థ అధ్వానంగా ఉన్నందున వరి సాగు చేపట్టలేమని కొందరు రైతులు క్రాప్ హాలిడే పాటిస్తున్నారు. పెట్టుబడులు పెరగడంతో ఈ ఏడాది వరి సాగుపై విముఖత చూపుతున్నట్లు కర్నూలు జిల్లా రైతులు చెప్తున్నారు. దీంతో మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కర్నూలు సోనా రకం బియ్యం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. దాదాపు లక్షా 25వేల ఎకరాల్లో వరి సాగు తగ్గడంతో 35 లక్షల క్వింటాళ్ల కర్నూలు సోనా రకం ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో వరి సాగు లక్ష్యం 38,39,925 ఎకరాలు కాగా, నిరుడు 30,50,115 ఎకరాల్లో పండించారు. ఈఏడాది ఇప్పటికి 30,18,050 ఎకరాలే వరి సాగులోకి వచ్చాయి.
నీరిస్తారన్న గ్యారెంటీ లేదు..
2014-19 మధ్య రాయలసీమలో వర్షాలు కాస్త తక్కువగా కురిసినా, కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగానే కురిశాయి. అయినా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు అప్పటి ప్రభుత్వం సాగునీరిచ్చి, వరి సాగుకు ఊతమిచ్చిందని రైతులు చెప్తున్నారు. కానీ, గత రెండేళ్లలో వర్షాలు బాగా కురిసినా.. ప్రాజెక్టులు నిండినా.. కాల్వలకు నీరిస్తారన్న గ్యారెంటీ లేక.. చాలా మంది రైతులు వరి సాగును తగ్గిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కన్పిస్తోంది. నాగార్జునసాగర్‌లో నీరొచ్చినా.. అధికారికంగా వరి సాగుకు నీరివ్వలేకపోతుండటంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగడం లేదు. సాగర్ ఆయకట్టులో మొదటి పంటగా చిరుధాన్యాలు, అపరాలు వేస్తుండగా, రెండో పంటకు నీరివ్వడంతో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వరి సాగు చేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కాల్వలకు నీరొస్తే మాగాణిగా, లేకపోతే వర్షాధారంగా వెద పద్ధతిలోనే వరి సాగు జరుగుతోంది. ప్రస్తుతం ఒడిశా నుంచి వంశధార, నాగావళికి వరద నీరొస్తుండటంతో ఆ జిల్లాల రైతులకు కాస్త ఉపశమనం కలుగుతోంది.
సాగునీటిపై సమీక్షలేవీ?
ఖరీఫ్, రబీ ప్రణాళికలు విడుదల చేయడం, జిల్లా స్థాయిలో వ్యవసాయం, సాగునీటి సలహా సంఘ సమావేశాలు నిర్వహించడం, ప్రాజెక్టులలో నీటి నిల్వల ఆధారంగా, వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదలశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించడం, రుతుపవనాల ఆధారంగా వాతావరణశాఖ వర్షపాతం నివేదికలపై రైతుల్ని అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలు గతంలో మాదిరిగా సాగడం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో నీటి పారుదలపై రైతుల్ని అప్రమత్తం చేస్తున్న దాఖలా లేదు. ప్రతి నెల 14వ తేదీన అగ్రిమిషన్ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించినా, గతేడాది ఏప్రిల్ నుం చి అగ్రి మిషన్ భేటీ అయిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ, అనుబంధ రంగాల సమీక్షలు జరుపుతున్నా.. వాటి ఫలితాలు సమస్యలు ఎదుర్కొంటున్న రైతు స్థాయికి చేరడం లేదన్న విమర్శలున్నాయి.
అడ్రస్ లేని మిల్లెట్ బోర్డు..
బోర్ల కింద వరి సాగు వద్దని, చిరుఽధాన్యాల సాగు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించినా, ప్రస్తుత ఖరీ్‌ఫలో చిరుధాన్యాల సాగు పెరగకపోగా, సాధారణ లక్ష్యం మేర కూడా సాగులోకి రాలేదు. మిల్లెట్స్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు హడావిడి చేయడం తప్ప, ఆచరణలో బోర్డు ఆచూకీ లేదు.
Updated Date - 2021-09-06T08:32:16+05:30 IST