ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-బస్సులో ‘ఒకే ఒక్కడు’

ABN, First Publish Date - 2021-06-16T07:49:46+05:30

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసుల విషయంలో పాత రచ్చ ‘రిపీట్‌’ అవుతోంది. గత ఏడాది వివాదాలు తలెత్తడంతో ఆగిన ‘టెండరు’ ఈసారి మరింత అడ్డగోలు స్పీడుతో సాగుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అస్మదీయ కంపెనీ కోసం అడ్డగోలు ‘నిబంధనలు’

గత ఏడాది రచ్చ.. అయినా మారని పరిస్థితి

జ్యుడీషియల్‌ ప్రివ్యూ తర్వాతా సవరణలు

తిరుపతిలో తిప్పే బస్సుల్లో వెసులుబాట్లు

ప్రియమైన కంపెనీ అర్హత సాధించేందుకే!

ఒక్కరే బరిలో ఉండేలా తొలి నుంచీ స్కెచ్‌

చైనా టెక్నాలజీ బస్సులకే అన్నీ అనుకూలం

వాటినే తెప్పిస్తున్న పెద్దల కంపెనీ

సింగిల్‌ టెండర్‌ను ఆమోదిస్తారట!

ఇక.. కిలోమీటరుకు వారు చెప్పిందే చార్జి


అది ప్రతి కిలోమీటరుకూ కాసులు రాల్చే టెండరు! కాబట్టి...ఆ టెండరు ‘అస్మదీయ కంపెనీ’కే దక్కాలి. అంటే... ఆ కంపెనీ మాత్రమే ‘అర్హత’ సాధించాలి. దాని ప్రకారమే నిబంధనలను సిద్ధం చేయాలి. అంత జాగ్రత్తగా నిబంధనలు రూపొందించినప్పటికీ తమ కంపెనీకి టెండరు దక్కదని తెలిస్తే... అడ్డగోలుగా సవరణలు కూడా చేయాలి! రాష్ట్రంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టే విషయంలో ఇదే జరుగుతోంది! నిబంధనలన్నీ అచ్చంగా ఒక్క కంపెనీకే అనుకూలంగా అచ్చోసిన వైనంపై ఇతర కంపెనీల్లో విస్మయం వ్యక్తమవుతోంది. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసుల విషయంలో పాత రచ్చ ‘రిపీట్‌’ అవుతోంది. గత ఏడాది వివాదాలు తలెత్తడంతో ఆగిన ‘టెండరు’ ఈసారి మరింత అడ్డగోలు స్పీడుతో సాగుతోంది. ఒకే ఒక్కరికి టెండరు దక్కేలా మ్యాచ్‌ ఫిక్స్‌ అయిపోయింది. రాష్ట్రంలో మొత్తం 350 ఈ-బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నానికి వంద కేటాయిస్తారు. విజయవాడ-50, అమరావతి(గుంటూరు)-50, తిరుపతి ఇంటర్‌ సిటీ-50, తిరుమల(ఘాట్‌ రోడ్డు) 50, కాకినాడకు 50 బస్సులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బస్సు ఖరీదులో 60 శాతం మొత్తాన్ని కేంద్రం సబ్సిడీగా ఆ కాంట్రాక్టు సంస్థకు నేరుగా చెల్లిస్తుంది. 40 శాతం మాత్రమే కాంట్రాక్టు సంస్థ భరించాలి. ఆ తర్వాత... కిలోమీటరుకు ఇంత చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తుంది. ‘ఒక్కో కిలోమీటరుకు ఎంత చార్జీ వసూలు చేస్తారో చెప్పండి!’ అని కోరడమే ఈ-టెండర్‌ డాక్యుమెంట్‌ ఉద్దేశం! ఎక్కువ కంపెనీలు పోటీలో ఉంటేనే... తక్కువ మొత్తం కోట్‌ చేసే అవకాశముంటుంది. కానీ... సింగిల్‌ టెండర్‌కే ‘ఫిక్స్‌’ కావడంతో... ఆ అస్మదీయ కంపెనీ కిలోమీటరుకు ఎంత కట్టాలంటే అంతకు ఒప్పుకోవాల్సిందే. ఇది మున్ముందు రాష్ట్రానికి పెనుభారంగా మారడం ఖాయం! అదే సమయంలో... ఆ కంపెనీకి కాసుల వర్షం కురవడమూ ఖాయం!


ఇలా మార్చేశారు...

అక్రమాలకు తావివ్వకుండా టెండర్లను ‘జ్యుడీషియల్‌ ప్రివ్యూ’కు పంపిస్తున్నామని సర్కారు ఘనంగా చెప్పుకొంటోంది. టెండర్‌ డాక్యుమెంట్‌ ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత... అందులో మార్పులేవీ చేయకూడదు. కానీ... అస్మదీయ కంపెనీకోసం ఈ నిబంధనను ఉల్లంఘించారు. మరో కంపెనీ ఏదీ పోటీలో నిలవకుండా... కొరిజెండమ్‌ పేరుతో సవరణలు చేశారు. అదెలాగంటే... ఈ-బస్సులు ఎలా ఉండాలి? సదుపాయాలు ఎలా ఉండాలి? అనే అంశంపై ముందే స్పష్టమైన నిబంధనలు విధించారు. తిరుపతి మినహా మిగిలిన నగరాలకు 12 మీటర్ల పొడవు ఉన్న ఈ-బస్సులు సరఫరా చేయాలి. సీటింగ్‌ కెపాసిటీ, పుష్‌బ్యాక్‌ సీట్ల నిబంధనలను ఆయా నగరాల వినియోగ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ విషయంలో ‘అస్మదీయ’ కంపెనీకి ఎలాం టి ఇబ్బందీ తలెత్తలేదు. అయితే... తిరుపతి ఇంటర్‌ సిటీ ఈ-బస్సుల దగ్గర కొచ్చేసరికి వ్యవహారం తేడాకొట్టింది. ఈ ఈ-బస్సులు 9 మీటర్ల పొడవు, 35 సీట్ల సామర్థ్యంతో, పుష్‌బ్యాక్‌ సీట్లు కలిగి ఉండాలని నిర్దేశించారు.  భారతీయ ఈ-బస్సు ఉత్పత్తి కంపెనీలు మాత్రమే పుష్‌బ్యాక్‌తో 35 సీట్లు ఏర్పాటు చేసే అవకాశముంది. కానీ... పెద్దలకు ప్రియమైన అస్మదీయ కంపెనీ సమకూర్చుకుంటున్నది... చైనా టెక్నాలజీ బస్సులు. వీటి పొడవు 8.8 మీటర్లు మాత్రమే. పుష్‌బ్యాక్‌ పెడితే 35 సీట్లు ఏర్పాటు చేయడం సాధ్యంకాదు. ఒక వరుస తగ్గించాల్సి వస్తుంది. దీనివల్ల అస్మదీయ కంపెనీకి టెండర్లలో పాల్గొనే అర్హత లభించదు. దీంతో... జ్యుడీషియల్‌ ప్రివ్యూ తర్వాత కొరిజెండమ్‌ పేరుతో సవరణలు చేశారు. తిరుపతి ఇంటర్‌ సిటీ బస్సులకు పుష్‌బ్యాక్‌ సీట్లు అన్నది ఆప్షన్‌ మాత్రమే అని, ఫిక్స్‌డ్‌ సీట్లు కూడా ఉండొచ్చునని తేల్చారు.


మరిన్ని సవరణలు...

అస్మదీయ కంపెనీకి ఈ-బస్సు టెండరు దక్కేలా అంతకుముందే ఒక కీలక నిబంధన విధించారు. బస్సు ఒక్కసారి చార్జి చేస్తే గరిష్ఠంగా 250కి.మీ. పరుగులు తీయాలట! మన దేశంలో తయారయ్యే ఈ-బస్సులకు ఇంత సామర్థ్యం లేదు. అస్మదీయ కంపెనీకి చెందిన చైనా టెక్నాలజీ బస్సులు మాత్రమే ఒక్కసారి చార్జి చేస్తే 250కి.మీ. ప్రయాణించగలవు. నిజానికి... ఆర్టీసీ సమకూర్చుకుంటున్న ఈ-బస్సులను సిటీ బస్సులుగా నడపాలనుకుంటున్నారు. లేదా... తిరుపతి-తిరుమల మధ్య నడుపుతారు. ఇవేవీ లాంగ్‌రూట్‌ సర్వీసులు కావు. అయినా సరే, 250 కిలోమీటర్ల నిబంధన విధించడం గమనార్హం. దీనిపై భారతీయ కంపెనీల ప్రతినిధులు జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీకి ఫిర్యాదు చేశారు. ‘‘దేశీయంగా తయారయ్యే ఎలక్ట్రిక్‌ బస్సుల్లో కొన్ని సదుపాయాలు ఉండవు. చైనా సాంకేతిక సహకారం అందిపుచ్చుకున్న ఒక్క కంపెనీ మాత్రమే ఆ స్పెసిఫికేషన్స్‌తో బస్సులను అందించగలవు. ఈ టెండర్‌ వారికి వెళ్లేట్లుగానే డిజైన్‌ చేసినట్లుగా ఉంది’’ అని ఫిర్యాదు చేశాయి. ఈ ఆరోపణలను జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ తోసిపుచ్చింది. టెండర్‌ డాక్యుమెంట్‌ను ఆమోదించింది. అంటే... ఇక అదే ఫైనల్‌. టెండర్‌ డాక్యుమెంట్‌లో ఏవైనా అక్షర దోషాలు ఉంటే మాత్రం సరిచేసుకోవచ్చు. కానీ... ప్రభుత్వం  కీలకమైన నిబంధననే సవరించింది. తిరుపతి ఇంటర్‌సిటీలో తిరిగే 50 బస్సులకు ‘పుష్‌బ్యాక్‌’ సీట్లను ‘ఆప్షనల్‌’గా మార్చింది.


సింగిల్‌ టెండర్‌కూ సై...

టెండర్లు అంటేనే పోటీ. సింగిల్‌ టెండర్లు దాఖలైతే... మొత్తం ప్రక్రియ మళ్లీ మొదలుపెట్టాలి. ఇతర కంపెనీలకూ అవకాశం ఇవ్వాలి. కానీ... ఈ-బస్సుల విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. సింగిల్‌ బిడ్‌ దాఖలైనా, సింగిల్‌ ఎలిజిబులిటీ బిడ్‌ దాఖలైనా ఫర్వాలేదు... అనే వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే... ఈ టెండరులో ఒక్క కంపెనీ మాత్రమే అర్హత సాధించేలా ముందుగానే నిబంధనలు రూపొందించారు.


ఎవరికోసం ఇదంతా?

ఒక్కసారి చార్జ్‌ చేస్తే 100 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఎలక్ట్రిక్‌ బస్సులు దేశంలో ఉన్నాయి. దేశీయ కంపెనీలు వీటిని ఇక్కడి ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాయి. కానీ... 250 కిలోమీటర్లు ప్రయాణించాలన్న నిబంధనతో ప్రముఖ స్వదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనలేని పరిస్థితి కల్పించారు. విదేశీ టెక్నాలజీని, అది కూడా ‘మేడిన్‌ చైనా’ పరిజ్ఞానాన్ని వాడుకోవాలనుకోవడంపై దేశీయ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జ్యుడీషియల్‌ కమిషన్‌ ఆమోదం తర్వాత కూడా టెండర్‌ డాక్యుమెంట్‌ను మార్చడంపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2021-06-16T07:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising