వైసీపీ అక్రమాల వల్లే టీడీపీకి ప్రజాదరణ
ABN, First Publish Date - 2021-10-30T03:17:21+05:30
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాల వల్లే టీడీపీకి ప్రజాదరణ పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాల వల్లే టీడీపీకి ప్రజాదరణ పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలోని అంబేద్కర్ భవన్‌లో పార్టీ మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య అఽధ్యక్షతన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చి అంబేద్కర్ నగర్ నుంచి స్థానిక ప్రజలతో వైసీపీ నాయకులు కిషోర్, కే.ప్రసాద్, ఆలపాక శీనయ్యతోపాటు పలువురికి పోలంరెడ్డి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. నీతివంతమైన రాజకీయాలతో నియోజకవర్గంలో ప్రజలు 2004లో కోవూరు ఎమ్మెల్యేగా తనకు పట్టం కట్టారన్నారు. అందుకు కట్టుబడే నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ది చేశామన్నారు. బుచ్చి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాగా గత ప్రభుత్వం హయాంలో బుచ్చిరెడ్డిపాళేనికి టీడీపీతోనే అభివృద్ధికి బీజం పడిందని బుచ్చి మాజీ సర్పంచ్ జూగుంట స్నేహలత భర్త పురుషోత్తం అన్నారు. మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తే నిస్స్వార్దంగా సేవలు చేసుకుంటామన్నారు.
టీడీపీలోకి వైసీపీ తలమంచి ఎంపీటీసీ
కొడవలూరు : పెరిగిన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, కరెంటు చార్జీల పెంపుతో రాష్ట్రంలో పేద ప్రజలు అనుభవరహిత పాలనతో అల్లాడిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని నార్తురాజుపాళెంలో పీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం పోలంరెడ్డి ఆధ్వర్యంలో తలమంచి వైసీపీ ఎంపీటీసీ మన్నేపల్లి శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరారు. ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. ఒక్కసారి అంటూ అసత్య వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి నేడు అనుభవరహిత పాలనతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టనున్నదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరకటి మల్లికార్జున, చెముకుల చైతన్య, జొన్న శివకుమార్, చెక్క మదన్, కేతు వెంకటరమణారెడ్డి, మన్నేపల్లి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T03:17:21+05:30 IST