ప్రక్షాళన అవసరం
ABN, First Publish Date - 2021-08-09T04:37:07+05:30
జిల్లా వ్యవసాయశా ఖలో పాలన గాడితప్పింది. పనిచేసే కొంతమందిపైనే పనిఒత్తిడి. కలెక్టర్ సమావేశాలు,
వ్యవసాయశాఖలో గాడితప్పిన పాలన
కొంతమందిపైనే పనిఒత్తిడి
కొన్ని విభాగాల్లో కార్యాలయాలకు రాని అధికారులు
జిల్లా ఉన్నతాధికారుల్లోనూ అసంతృప్తి
నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 8 : జిల్లా వ్యవసాయశా ఖలో పాలన గాడితప్పింది. పనిచేసే కొంతమందిపైనే పనిఒత్తిడి. కలెక్టర్ సమావేశాలు, వ్యవసాయశాఖ మంత్రుల పర్యటన అంటే హడల్. హడావిడి రిపోర్టులతో హాజరు. మరికొన్ని విభాగాల్లో అధికారులు కార్యాలయాలకు ఎప్పడు వస్తారో.. ఎప్పుడు పోతారో తెలియదు. కొంతమంది ఉద్యోగులు అసలేం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో తెలియని అయోమయం. వెరసి జిల్లా వ్యవసాయశాఖ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతోంది. తక్షణం ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారనున్నది.
ఎడగారు సీజన ప్రత్యేకం
వ్యవసాయానికి జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక ఎడగారు సీజన జిల్లాకు ప్రత్యేకం. దాదాపు 10లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం. ఈఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో దాదాపు 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించినా ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు పంట విరామం ప్రకటించారంటే వ్యవసాయశాఖ అధికారుల పనితీరు అర్థం అవుతోంది. రైతులకు అవసరమైన సలహాలివ్వడంతోపాటు సాగు సమయంలో ఎదురయ్యే చీడపీడలపై అవగాహన కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం వ్యవసాయశాఖ బాధ్యత. అయితే రైతుల గురించి పక్కన బెడితే అసలు వ్యవసాయశాఖలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆశాఖ జిల్లా ప్రధాన కార్యాలయంలో పనిచేసే వారిలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేది కొందరే. వారిపైనే పనిభారం మొత్తం పడుతోంది. ఏ సమావేశాలు జరిగినా, మంత్రుల పర్యటనలు జరిగినా పూర్తిస్థాయి నోట్‌బుక్ సిద్ధం చేయాల్సింది వారే. కొంత మంది అధికారులు వారి విధులను మమ అనిపిస్తున్నారు. అంతేకాక అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగుల్లో కుల రాజకీయాలు సైతం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అగ్రవర్ణాలకు చెందిన వారి మాటలు వినకపోయినా, చెప్పిన పని చేయకపోయినా వారిపై పరోక్షంగా వేధింపులుంటాయి. కిందిస్థాయి ఉద్యోగులు చేయాల్సిన పనులను సైతం వీరితోనే చేయిస్తారు. వీరి వేధింపులు తట్టుకోలేక బదిలీ, డిప్యుటేషన పేరుతో బయట ప్రాంతాలకు వెళ్లినవారు లేకపోలేదు. ఈవిషయాలన్ని పట్టించుకునే పరిస్థితిలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు లేరు. కారణం ఇనఛార్జి బాధ్యతలు కావడమే.
అధికారులెప్పుడొస్తారో...?
వ్యవసాయశాఖలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్(ఎస్‌టీఎల్), డిస్టిక్ట్ రీసోర్స్ సెంటర్(డీఆర్‌సీ), బయో కెమికల్(బీసీ)ల్యాబ్ విభాగాలు ఎంతో కీలకమైనవి. మట్టి నమూనాలు సేకరించడం, పురుగు మందులు, ఎరువుల వాడకం, పంటలను పరిశీలించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం వంటి ప్రధాన బాధ్యతలు వీరివి. అయితే ఆయా విభాగాల్లో అధికారులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు ఇంటికి వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. కొంత మంది ఒక్క రోజు విధులకు హాజరై రాని రోజులకు హాజరు పుస్తకంలో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రక్షాళనతోనే మార్పు..
వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. వీరిపైనే ఇనఛార్జి జేడీ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. వీరిలో ఏఒక్కరూ లేకపోయినా రిపోర్టులు తయారు చేయడం ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో వీరిపై పనిఒత్తిడి పడుతోంది. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తే ఒత్తిడిపడే పరిస్థితులు ఉండవని కొందరు అఽధికారులు చెబుతున్నారు. వారివారి విధులను ప్రతి మూడేళ్ల కొకసారి మారుస్తూ ఉంటే అన్ని పథకాలపై అందరికీ అవగాహన ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. అయితే ఆదిశగా చర్యలు తీసుకునేందుకు పూర్తిస్థాయి బాధ్యతలు వహించే జేడీ లేరు. రెండేళ్లుగా జిల్లా వనరుల కేంద్రం ఉపసంచాలకులుగా పనిచేస్తున్న జి.శివన్నారాయణ లేదంటే ప్రాజెక్టు డైరెక్టరుగా పనిచేస్తున్న వై.ఆనందకుమారిలు ఇనచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు సెలవు పెడితే మరొకరన్నట్లు బాధ్యతలు మార్చుకొంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో విధులపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఉన్నతాఽధికారుల్లోనూ అసంతృప్తి
వ్యవసాయశాఖ పనితీరుపై జిల్లా ఉన్నతాధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోపనిచేస్తున్న అధికారుల పనితీరునుబట్టి వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖకు ఒక్కటంటే ఒక్క ప్రశంసాపత్రం కూడా లభించలేదు. దీన్నిబట్టి వ్యవసాయశా ఖపై ఉన్నతాఽధికారులు ఏమాత్రం అంచనాలో ఉన్నారో అర్థం అవుతోంది.
Updated Date - 2021-08-09T04:37:07+05:30 IST