పొరుగువారి సహకారం.. భూమి స్వాహాపర్వం!
ABN, First Publish Date - 2021-08-14T04:57:06+05:30
కాకుటూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.81-1, 81-2, 81-3, 81-5, 427, 428లలో 14.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చి.. భూములు కబ్జా చేసి..!
వెంకటాచలంలో 16 ఎకరాల ప్రభుత్వ స్థలం పరులపాలు
ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి నడిచిన వ్యవహారం
ఓ డిప్యూటీ తహసీల్దార్ లాగిన్‌లో మార్చినట్లు గుర్తింపు
పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్
అదంతా ప్రభుత్వ భూమి.. దాదాపు 16 ఎకరాలు.. జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో అందరి కళ్లు వాటిమీదే. రూ.కోట్లు విలువ చేసే ఈ భూమిని సొంతం చేసుకునేందుకు కుట్రపన్నారు. వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు మార్చి వారి పేర్లను చేర్చారు. ఇదంతా సంబంధిత తహసీల్దారు లాగిన్ నుంచి కాకుండా ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి జరగడం గమనార్హం. వెంకటాచలం మండలం కాకుటూరు, చెముడుగుంట రెవెన్యూ గ్రామాల పరిధిలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు కూడా ఈ అక్రమాలను గోప్యంగా ఉంచడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా బయటకు చెప్పకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ రికార్డుల మార్పు వ్యవహారంలో తెరవెనుక స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : కాకుటూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.81-1, 81-2, 81-3, 81-5, 427, 428లలో 14.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇదంతా అటవీ పోరంబోకు, అనాధీనం అని ఇటీవల వరకు రికార్డుల్లో కనిపిస్తోంది. డైగ్లాట్‌లోనూ ఇదే ఉంది. వెంకటాచలం మండల కేంద్రానికి సమీపంలో ఆర్టీసీ జోనల్ కాలేజీ ఎదురుగా జాతీయ రహదారికి ఆనుకొని ఈ భూములు ఉన్నాయి. ఎకరం దాదాపు రూ.రెండు కోట్లకుపైగానే ఉండటంతో ఎలాగైనా ఈ భూములను కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగా రికార్డుల మార్పునకు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ భూములు గత నెలలో కొందరి పేర్లపైకి చేరాయి. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో ఆ సర్వే నెంబర్లలో బొడ్డు మస్తానయ్య, బొడ్డు బుజ్జమ్మ పేర్లు కనిపిస్తున్నాయి. ఈ భూములు వారికి సొంతంగా సంక్రమించినట్లు రికార్డుల్లో కనిపిస్తోంది. అలానే వెంకటాచలం మండలంలోని కుంకమపూడి (చెముడుగుంట) రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.9-8లో ఉన్న 1.60 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూమి కూడా నలగర్ల కోటేశ్వరరావు (మస్తానయ్య) పేరుపై కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి ఎలా మారిందన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతన్నాయి.
ఒంగోలులో పేర్ల మార్పు
సాధారణంగా రెవెన్యూ రికార్డుల్లో ఏ చిన్న మార్పు చేయాలన్నా సంబంధిత తహసీల్దారు లాగిన్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో వెంకటాచలం తహసీల్దారు లాగిన్‌కు సంబంధం లేకుండా ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కిషోర్‌రెడ్డి రమణ కంప్యూటర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలానే గుంటూరు జల్లా వినుకొండకు చెందిన గొల్లా గురుబ్రహ్మం బయోమెట్రిక్ అథెన్టికేషన్ ఉన్నట్లు రాష్ట్ర అధికారులు గుర్తించారు. గత నెల 30వ తేదీన వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మారినట్లు రాష్ట్ర భూపరిపాలన విభాగం అధికారులు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు మార్పులు చేయడానికి ఉపయోగించిన పేర్లు, ఐడీ నెంబర్లు, కంప్యూటర్ ఐపీ అడ్రస్సులు, ఇతర పూర్తి వివరాలను గుర్తించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. వారి ఆదేశాల మేరకు వెంకటాచలం తహసీల్దారు ఇమ్మనేని శ్రీనివాసప్రసాద్ ఈ నెల 3వ తేదీన గొల్లా గురుబ్రహ్మం, కిషోర్‌రెడ్డి రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 120బీ, 420, 468, 471తోపాటు ఐటీ యాక్ట్ 66-సీ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారమంతా గోప్యంగా జరగడం గమనార్హం. ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
అనుమానాలెన్నో..
వెంకటాచలం మండలంలోని ప్రభుత్వ భూముల రికార్డులను ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మార్పులు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూకు సంబంధించి చిన్న మార్పు చేయాలన్నా సంబంధిత తహసీల్దారు లాగిన్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో వెంకటాచలం తహసీల్దార్ లాగిన్‌లో కాకుండా మరొక చోట మార్పు చేయడం గమనార్హం. అంటే ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా!? లేదా స్థానిక రెవెన్యూ అధికారులు వారికి సహకరించారా.. అన్నది తేలాల్సి ఉంది. వెబ్‌ల్యాండ్‌లోకి బయట వ్యక్తులు ప్రవేశించగలిగితే ఇంకెన్ని రికార్డులు ఈ విధంగా మార్పు చేశారోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ప్రభుత్వ భూముల రికార్డుల మార్పులో కొందరు అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన భూములను మరొకరి పేర్లపై మార్పు చేసి, కొన్నాళ్ల తర్వాత వారి నుంచి రిజిసే్ట్రషన్ చేసుకుంటే ఇబ్బందులు లేకుండా పూర్తిగా భూములను సొంతం చేసుకోవచ్చన్న స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి ఇప్పటికి పది రోజులు గడిచినా ఇంత వరకు ఎటువంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
పోలీసు కేసు పెట్టాం
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దారు లాగిన్‌లో రికార్డులు మార్చినట్లు కనిపిస్తోంది. విచారణ జరిపి పోలీసు కేసు కూడా పెట్టాం. పూర్తిస్థాయి విచారణ చేయమని ఆదేశించాం. వెబ్‌ల్యాండ్‌లో మార్పు చేసిన పేర్లను తొలగించమని తహసీల్దార్‌కు ఆదేశాలిచ్చాం.
- ఎంఎన్ హరేందిరప్రసాద్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)
విచారణ జరుగుతోంది
వెంకటాచలం తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఫిర్యాదులో పేర్లు రాసినప్పటికీ ఐటీ యాక్ట్ ప్రకారం ఎవరు, ఏమిటన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
- జగన్మోహన్‌రావు, నెల్లూరు రూరల్ సీఐ
Updated Date - 2021-08-14T04:57:06+05:30 IST