కష్టాల్లో కౌలు రైతులు
ABN, First Publish Date - 2021-06-09T02:52:59+05:30
వ్యవసాయం చేసేది కౌలు రైతులు కానీ బీమా పరిహారం, రైతు భరోసా డబ్బులు మాత్ర ం భూ
వరినాట్లుకు సిద్ధం చేస్తున్న రైతులు( ఫైల్)
రైతు భరోసా నగదు భూయజమాని ఖాతాలో..- పొదలకూరు, జూన్ 8 : వ్యవసాయం చేసేది కౌలు రైతులు కానీ బీమా పరిహారం, రైతు భరోసా డబ్బులు మాత్ర ం భూయజమానికి వస్తుంటాయి. వడ్డీకి అప్పులు తెచ్చిసాగు చేస్తున్న కౌలు రైతు మరింత కష్టాల్లోకి కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందక పంటలు పండిస్తూ అప్పుల పాలై కౌలు రైతుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోనే కాక జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జిల్లాలో కౌలు రైతులే సుమారు 30 శాతం భూములను సాగు చేస్తున్నారు. 2011లో భూ అధీకృత సాగుదారు చట్టం ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసేవారు. ఆ కార్డు పొందాలంటే యజమాని అంగీకారం అవసరం లేకుండా రెవెన్యూ అధికారులే కౌలురైతుల్ని గుర్తించి రుణఅర్హత కార్డులు మంజూరు చేసేవారు. ఆ కార్డుల ద్వారా పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల భీమా పరిహారం విత్తనాల రాయితీ మొదలైనవి పొందేవారు. ఇదే పద్దతి 2019 వరకూ కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత కౌలుదారుల చట్టాలు రద్దు చేసి 2019 పంట సాగుదారు హక్కు చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు సీసీఆర్‌సీ ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ సీసీఆర్‌సీ కార్డులు పొందాలంటే 1 నెలకు సంబంధించిన కౌలు పత్రాలపై భూ యజమానితో సంతకం చేయించుకోవాలని నిబంధన పెట్టారు. అయితే ఆ ఒప్పంద పత్రాలపై ఎక్కువ మంది రైతులు సంతకాలు చేయడం లేదు. పంట సాగుదారు హక్కు పత్రాలు సీసీఆర్‌సీ కార్డులు లేకపోవడంతో పంట రుణాలు, బీమా పరిహారం, విత్తన రాయితీలు మొదలైన ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందడం లేదు. బంగారం తాకట్టుతోపాటు అప్పులు చేసి పంటలు పండిస్తున్నా తమ తలరాతలు మారడం లేదుని కౌలు రైతులు వాపోతున్నారు. పంట సాగుదారు హక్కు పత్రాలు చట్టంలో మార్పులు చేసి సీసీఆర్‌సీ కార్డులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కౌలు ఒప్పంద పత్రాలపై భూ యజమానులతో సంతకాలు చేయించే బాధ్యత అధికారులే తీసుకొని తమకు న్యాయం చేయాలని కౌలురైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - 2021-06-09T02:52:59+05:30 IST