నెల్లూరు జిల్లాకు మరో మణిహారం క్రిస్‌సిటీ!
ABN, First Publish Date - 2021-03-17T05:00:25+05:30
నగరానికి 40 కి.మీ దూరంలో సరికొత్త ఇండస్ర్టీయల్..
సీబీఐసీ కారిడార్ కింద రూపుదిద్దుకోనున్న సెజ్
మొదటి విడతలో 2500 ఎకరాల్లో ఏర్పాటు
ఇప్పటికే రూ.2,139.44 కోట్లు కేటాయించిన కేంద్రం
లక్ష ఉద్యోగాలు, 5 లక్షల మందికి ఉపాధి
ఇప్పటికే భూమి చదును పనులు ప్రారంభం
నెల్లూరు(వెంకటేశ్వరపురం): నెల్లూరు నగరానికి 40 కి.మీ దూరంలో సరికొత్త ఇండస్ర్టీయల్ సిటీ రూపుదిద్దుకోబోతోంది. సూమారు 13 వేల ఎకరాల్లో సీబీఐసీ (చెన్నై - బెంగళూరు ఇండస్ర్టీయల్ కారిడార్) ఏర్పాటు కానునున్నది. చిల్లకూరు, కోట మండలాల పరిధిలోని తమ్మినపట్నం, బల్లవోలు, మోమిడి, వేళ్లపాలెం, తూర్పుకనుపూరు, కోత్తపట్నం, సిద్దవరం తదితర గ్రామాల్లో ఏర్పాటు కానున్న సీబీఐసీలో భాగంగా మొదటి విడతలో 2500 ఎకరాల్లో క్రిస్‌సిటీ (కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ) పేరుతో రూపుదిద్దుకోనున్నది. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.2139.44 కోట్లు కేటాయించింది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కానున్న నేపథ్యంలో రూ.37,500 కోట్ల పెట్లుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో లక్ష మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ క్రిస్ సిటీలో కొంతభాగం విద్యాలయాలు, నైపుణ్యభివృద్ధి, పరిశోధన సంస్థల ఏర్పాటుకు కేటాయించనున్నారు. వీటితోపాటు బీచ్ వాతావరణంలో అవసరమైన వ్యాపార, వినోద సముదాయాల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. ప్రజారవాణా కోసం వెడల్పు కలిగిన రహదారులు, పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, ఆహ్లాదకర వాతావరణం కోసం పచ్చని పార్కులు, కొలనులతోపాటు అనేక సౌకర్యవంతమైన నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది.
మొదటి విడతలో..
క్రిస్‌సిటీలో మొదటివిడతలో 2500 ఎకరాల్లో ప్రాఽథమిక సౌకర్యాల నిమిత్తం రోడ్లు, నీటిశుద్ధి ప్లాంట్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. రానున్న నాలుగేళ్ల వ్యవధిలో క్రిస్‌సిటీ పూర్తిగా అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే మాస్టర్‌ప్లాన్, డిజైన్లపై నివేదిక సిద్ధం చేశారు. ఎన్‌ఐసీడీఐటీచే నియమింపబడ్డ జాకబ్స్ సంస్థ ఈ ప్రాజెక్టుకు పని చేస్తుంది. ఆహార సంబంధిత ఉత్పత్తులు, టెక్స్‌టైల్, ఖనిజాలు, ఆటోమొబైల్, ఎలకా్ట్రనిక్, సమాచార రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఇలా అనేక భారీ పరిశ్రమలు రానున్నయి. స్థానిక యువత పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని సిబ్బంది పలు మండలాల్లోని యువత వారి ఆసక్తి రంగాల అభిప్రాయాలను సేకరించారు. క్రిస్‌సిటీకి సంబంధించి భూముల్లో ఇప్పటికే పనులు ప్రారంభించారు.
అద్భుతంగా రూపుదిద్దుకోనున్న క్రిస్‌సిటీ
జిల్లా రూపురేఖలు మారిపోయేలా చేయకలిగిన భారీ ప్రాజెక్ట్ క్రిస్‌సిటీ. మొదటి విడతలో 2500 ఎకరాల్లో అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్‌కు అందిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.2139.44 కోట్లు కేటాయించింది. సేకరించిన భూమిలో చదును పనులు ప్రారంభం అయ్యాయి.
- జె.చంద్రశేఖర్, ఏపీఐఐసీ జెడ్‌ఎం
Updated Date - 2021-03-17T05:00:25+05:30 IST