‘దేవదాయం’...వివాదాల మయం!
ABN, First Publish Date - 2021-10-29T09:58:17+05:30
దేవదాయశాఖ వివాదాలకు నిలయంగా మారింది. గత ప్రభుత్వాల్లో అసలు ఉందా, లేదా అన్నట్టుగా ఉన్న ఈ శాఖ... ప్రస్తుతం అత్యంత వివాదాస్పద శాఖగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆరోపణలొస్తే పట్టించుకొనే వారు కరువు
తప్పుచేసిన అధికారులపై చర్యలు శూన్యం
విశాఖలో ఉద్యోగుల సామూహిక సెలవులు
మంత్రి పేషీలో ఓఎ్‌సడీ తీరుపై విమర్శలు
ఆరోపణలు వెల్లువెత్తడంతో సొంత శాఖకు
అవినీతి అధికారికి 7 విభాగాల బాధ్యతలు
గుడివాడ ఆలయ భూములకు ఎన్‌వోసీపై రచ్చ
శాఖను పూర్తిగా వదిలేసిన వెలంపల్లి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ వివాదాలకు నిలయంగా మారింది. గత ప్రభుత్వాల్లో అసలు ఉందా, లేదా అన్నట్టుగా ఉన్న ఈ శాఖ... ప్రస్తుతం అత్యంత వివాదాస్పద శాఖగా గుర్తింపు తెచ్చుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏదోక రూపంలో ఈ శాఖ వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఆలయాలపై దాడులు, రథాల దగ్ధంతో మొదలై దేవుడి ఆస్తులను మంత్రులు, అధికారులే దోచుకుంటున్నారనే ఆరోపణలు వచ్చేస్థాయికి పరిస్థితి దిగజారింది. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శాఖకు చెడ్డపేరు తెచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారనడానికి తాజా ఘటనలే నిదర్శనం.
విశాఖలో ‘ఇసుక’ పురాణం
విశాఖపట్నం దేవదాయశాఖ ఉన్నతాధికారుల మధ్య ఇటీవల జరిగిన ఇసుక ఘటన మొత్తం ప్రభు త్వ ఉద్యోగులనే ఆందోళనకు గురిచేసింది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ మొఖంపై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక కొట్టినా దేవదాయశాఖ ఆమెపై కనీస చర్యలు తీసుకోలేదు. ఆ ఘటనలో ఏసీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విచారణాధికారి స్పష్టంగా సిఫారసు చేసినా ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. పైగా బాధిత డిప్యూటీ కమిషనర్‌ను అక్కడినుంచి బదిలీ చేయడంతో మనస్తాపం చెందిన ఆయన ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె మరింత అత్యుత్సాహంతో ఉద్యోగులను వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె వద్ద పనిచేయలేమంటూ ఏసీ కార్యాలయ ఉద్యోగులంతా ఇటీవల సామూహిక సెలవుపై వెళ్లారు. ప్రొబేషనరీ కూడా డిక్లేర్ కాని ఓ అధికారి వివాదాల్లో చిక్కుకున్నా ప్రభుత్వం పట్టనట్లు ఉండటం చర్చనీయాంశమైంది.
ఓఎస్‌డీపై విచారణేదీ!
దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేషీలో ఓఎస్‌డీగా పనిచేసి ఇటీవల సొంత శాఖకు బదిలీపై వెళ్లిపోయిన అశోక్... ఈ ప్రభుత్వంలోనే అత్యంత వివాదాస్పద ఓఎ్‌సడీగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో ఆ శాఖకు ఆయనే మంత్రా... అన్నంత స్థాయిలో హవా నడిపించారు. దేవుడి భూముల అమ్మకాల నోటిఫికేషన్లు ఇప్పించడం మొదలు దీర్ఘకాల ప్రాతిపదిక లీజులు, ఎన్‌వోసీలు ఇలా ఆయన ప్రతిదాంట్లోనూ తలదూర్చారు. అందులో రూ.వందల కోట్ల విలువైన అంశాలు ఉండటమే ఆయన్ను వివాదాస్పదంగా మార్చింది. మంత్రికి, ఉన్నతాధికారులకు మధ్య దూరం పెంచి అధికారులను బదిలీ చేసే స్థాయిలో ఆయన చక్రం తిప్పారు. కమిషనరేట్‌లో ఎవరికి, ఏ సెక్షన్ బాధ్యతలు ఇవ్వాలో కూడా ఆయనే చెప్పే పరిస్థితి రావడంతో అధికారులు సైతం ఆయనేం ఓఎ్‌సడీ అంటూ షాక్‌కు గురయ్యారు. చివరికి దేవుడి భూమి విషయంలోనే వివాదాలు చుట్టుముట్టడంతో గుట్టుగా సొంత శాఖకు వెళ్లిపోయారు. ఎన్ని ఆరోపణలొచ్చినా ఆయనపై ప్రభుత్వం చిన్న విచారణ కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
గాడితప్పిన కమిషనరేట్
శాఖకు కేంద్ర బిందువు లాంటి కమిషనర్ కార్యాలయంలో అధికారుల తీరు ఎవరిష్టం వారిదన్నట్టుగా మారింది. జిల్లాల కార్యాలయాల్లో చిన్న తప్పు జరిగినా విచారణలు జరిపి అధికారులను వేధించే ఈ కార్యాలయంలో... లేని పోస్టులు ఉన్నట్లుగా చూపించి పదోన్నతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని తెలిసినా అధికారులు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని ఓ అధికారికి ఏకంగా ఏడు విభాగాల బాధ్యతలు అప్పగించారు. కొందరు అధికారులను మాత్రం ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారు. పైగా అదే అధికారి గతంలో పెనుగంచిప్రోలు ఈవోగా చేసినప్పుడు రూ.లక్షలు వసూలు చేసినట్లు స్వయంగా ఉద్యోగులే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
పట్టించుకోని వెలంపల్లి
దేవదాయ శాఖకు అసలు మంత్రి ఉన్నారా, లేరా అని ఆ శాఖ ఉద్యోగులకే సందేహం కలిగే స్థాయిలో వెలంపల్లి శాఖను వదిలేశారు. ఎంతసేపూ దుర్గగుడి గురించి తప్ప ఆయన శాఖ పని తీరునుగానీ, ఉద్యోగుల సమస్యలు, అర్చకుల డిమాండ్లపై గానీ దృష్టిపెట్టడం లేదు. సొంత పేషీలో ఓఎ్‌సడీ వ్యవహారాన్నే చక్కబెట్టుకోలేని మంత్రి... శాఖపై ఎలా పట్టుసాధించగలరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కృష్ణాజిల్లా గుడివాడ ఆలయాల భూములకు ఎన్‌వోసీ ఇప్పించుకునే వ్యవహారంలో ఓ మంత్రి ఇటీవల విజయవాడలో దేవదాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. దానికి వెలంపల్లిని కనీసం పిలవలేదంటేనే ఆయనకు ఆ శాఖపై ఏ స్థాయిలో పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ శాఖకు చెందిన ఏదైనా అంశంలో మరో శాఖ మంత్రికి ఆసక్తి ఉన్నప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం సంబంధిత శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే సమావేశం ఏర్పాటుచేస్తారు. కానీ విజయవాడలోనే ఉన్నా కూడా వెలంపల్లితో అవసరం లేదంటూ ఆ శాఖ అధికారులతో మరో శాఖ మంత్రి సమావేశం పెట్టించడం అధికార వర్గాలనే విస్తుపోయేలా చేసింది.
Updated Date - 2021-10-29T09:58:17+05:30 IST