ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరి ఇవేంటి సారూ?

ABN, First Publish Date - 2021-07-21T07:31:17+05:30

ఏ నిర్మాణమైనా రెండు దశల్లో జరుగుతుంది. ఒకటి... కాగితాలు/కంప్యూటర్లలో ప్రణాళిక రూపంలో! రెండో దశలో... ఆ ప్రణాళికల ఆధారంగా నేలపై పునాదుల నుంచి నిజంగా లేచి నిలబడుతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రాఫిక్‌ల మాయ అంటూ నాడు గగ్గోలు.. నేడు వాటితోనే మాయోపాయం

నాడు అమరావతిపై ‘భ్రమరావతి’ ముద్ర.. బాహుబలి గ్రాఫిక్స్‌ అంటూ వైసీపీ ఎద్దేవా

ఒక్క ఇటుకా పడలేదంటూ అబద్ధాలు.. అధికారంలోకి వచ్చాక గిమ్మిక్కులతో సరి

చిన్న ప్రాజెక్టులూ పూర్తిచేయలేక చతికిల!.. పులివెందుల బస్టాండ్‌కే దిక్కులేదు

ఫిషింగ్‌ హార్బర్‌, బీచ్‌ఫ్రంట్‌ లదీ అదే కథ.. కిడ్నీ బాధితులకూ ‘గ్రాఫిక్స్‌’లోనే చికిత్స


అప్పుడు   అమరావతి పేరిట ఒక కొత్త నగర నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికలను ‘బాహుబలి గ్రాఫిక్స్‌’ అని ఎద్దేవా చేశారు!

ఇప్పుడు  మెడికల్‌ కాలేజీల నుంచి బస్టాండ్లు, మార్కెట్‌ యార్డుల వరకూ అన్నింటికీ అందమైన గ్రాఫిక్స్‌ రూపొందించి అలరిస్తున్నారు.

అప్పుడు  రాత్రికి రాత్రి ఒక నగర నిర్మాణం పూర్తి కావాల్సిందే అన్నట్లుగా గోల గోల చేశారు.

ఇప్పుడు   ఒక బస్టాండు, ఒక ఆస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేయలేక మొండిగోడలు, పిల్లర్ల మధ్యే కొట్టుమిట్టాడుతున్నారు.

అప్పుడు    అమరావతిలో విశాలమైన రహదారులు పడినా, అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నా, నివాస సముదాయాల హర్మ్యాలు పైకి ఎగుస్తున్నా ‘ఒక్క ఇటుకా పడలేదు’ అంటూ అదే అబద్ధం పదేపదే చెప్పారు.

ఇప్పుడు    గ్రాఫిక్స్‌ విడుదల చేసిన అనేక ప్రాజెక్టులకు నిజంగానే ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇదే వైసీపీ నేతలు అప్పుడు అమరావతిపై చేసిన రచ్చను జనం గుర్తు తెచ్చుకుంటున్నారు. అమరావతితో పోల్చితే అతి చిన్నవైన ప్రాజెక్టులనూ పూర్తి చేయలేకపోతున్న వైనంపై చర్చించుకుంటున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఏ నిర్మాణమైనా రెండు దశల్లో జరుగుతుంది. ఒకటి... కాగితాలు/కంప్యూటర్లలో ప్రణాళిక రూపంలో! రెండో దశలో... ఆ ప్రణాళికల ఆధారంగా నేలపై పునాదుల నుంచి నిజంగా లేచి నిలబడుతుంది. చేపట్టిన నిర్మాణాలు పూర్తి కావడానికి వాటి స్థాయిని బట్టి సమయం పడుతుంది. పొలాలు తప్ప మరేమీ లేని చోట ‘అమరావతి’ పేరిట ఒక నగరాన్ని... అందులోనూ అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో చేపట్టేందుకు కచ్చితంగా స్పష్టమైన ప్రణాళికలు అవసరం. కానీ... ఆ ప్రణాళికలనే వైసీపీ నేతలు ‘బాహుబలి గ్రాఫిక్స్‌’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత... అమరావతి ప్రణాళికల అమలు మొదలై, ఒక్కొక్క నిర్మాణం కళ్లముందు కనిపిస్తున్నా ‘ఒక్క ఇటుకా పడలేదు’ అంటూ అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి రాగానే... మొత్తం అమరావతిని అటకెక్కించారు. ఆ తర్వాత తామే స్వయంగా వివిధ ప్రాజెక్టులపై గ్రాఫిక్స్‌ మాయలు మొదలుపెట్టారు. నెలలూ, ఏళ్లూ గడుస్తున్నా చిన్న చిన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేక... అవే గ్రాఫిక్స్‌ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 


బీచ్‌ఫ్రంట్‌... గ్రాఫిక్‌ అదిరింది!

విశాఖ ఒక సుందర నగరం! తీరం వెంబడి అలా మూడున్నర కిలోమీటర్ల ప్రత్యేకమైన కారిడార్‌! ఆ దారి పొడవునా విందులూ, వినోదాలకు అవకాశం! బంగాళాఖాతం అలలు ఒకవైపు... అంతకు మించిన ఆనందం మరోవైపు! ఎంత బాగుందో కదా! సుమారు రెండేళ్ల క్రితం జగన్‌ సర్కారు విడుదల చేసిన ‘బీచ్‌ఫ్రంట్‌’ ప్రాజెక్టు గ్రాఫిక్స్‌ చూసి జనం ఇలాగే మైమరిచిపోయారు. బీచ్‌ఫ్రంట్‌లో వాకర్స్‌, గ్రీన్‌కోర్‌ గార్డెనింగ్‌, అందమైన లాన్స్‌ ఉండేలా డిజైన్‌ చేయించారు. కన్సల్టెంట్‌లతో భారీ చిత్రాలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.116 కోట్లు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది కదా... ‘బీచ్‌ఫ్రంట్‌’ పూర్తయి ఉంటుంది, ఈసారి విశాఖకు వెళ్లి అలా నడిచొద్దాం! అనుకుంటున్నారా! అలాగైతే ఈసారి మీరు ఇసుకలో కాలేసినట్లే. ఎందుకంటే... విశాఖలో ఎప్పట్లాగానే బీచ్‌ ఉంది కానీ, ‘ఫ్రంట్‌’ లేదు. ఆ ప్రాజెక్టుకు కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు.  ఒకవేళ జరిగినా... పనులు మొదలయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే, ఆ ప్రాజెక్టుకు సీఆర్‌జెడ్‌ అనుమతి లేదు. అంటే... గ్రాఫిక్స్‌ చూసి ఆనందించడమే!


న్యాయ రాజధానికీ అన్యాయం

‘మూడు’లో భాగంగా కర్నూలును జగన్‌ సర్కారు న్యాయ రాజధానిగా ప్రకటించింది. నగర పాలక సంస్థ ద్వారా అక్కడ రూ.8 కోట్ల వ్యయంతో అందమైన థీమ్‌ పార్కులను ప్రతిపాదించారు. చక్కటి గ్రాఫిక్‌లు కూడా రూపొందించారు. కానీ... నిర్మాణ పనులకు టెండర్లు పిలిచినా ఎవరు ముందుకు రాలేదు. కానీ, థీమ్‌ పార్కులు మాత్రం గ్రాఫిక్స్‌ రూపంలో చక్కగా అలరిస్తున్నాయి. కర్నూలు నగరంలో నిర్మించతలపెట్టిన క్లాక్‌ టవర్‌ కూడా గ్రాఫిక్స్‌ దశ దాటలేదు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలేదంటూ... పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాని పరిస్థితి.


మార్కెట్‌ యార్డు... ఎక్కడ?

సీఎం సొంత జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరులో అధునాతన మార్కెట్‌ యార్డు నిర్మాణం కోసం చక్కటి డిజైన్స్‌ రూపొందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాత మార్కెట్‌ యార్డును పడగొట్టారు. కొత్త దాని కోసం మహా అద్భుతం అని మైమరిచిపోయే గ్రాఫిక్స్‌ రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత కన్సల్టెన్సీని కూడా మార్చేశారు. ఆ తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఒక్క ఇటుకా పేర్చలేదు. అయినా ఈ మార్కెట్‌ యార్డును సర్కారు అద్భుత విజయాల జాబితాలోకి  తీసుకొచ్చి గ్రాఫిక్స్‌తోనే ఊదరగొడుతోంది.


సముద్రమే విస్తుపోయేలా... 

నీలి రంగు సముద్రం... అందులో నిలిచిన బోట్లు... ఒకవైపు బోట్ల మరమ్మతుల వర్క్‌షాప్‌... మరోవైపు మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు... ఇంకా 12 రకాల సదుపాయాలతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫిషరీ హార్బర్‌ను డిజైన్‌ చేశారు. బొమ్మ చూస్తే... ఎవరైనా ‘అబ్బా’ అనాల్సిందే! మనకోసం ఇంత అద్భుతమైన హార్బర్‌ రానుందా అని మత్య్సకారులు మైమరిచిపోయేలా త్రీడీ గ్రాఫిక్స్‌ రూపొందించారు. భూమి పూజ చేసినప్పుడు పని జరుగుతుందనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు అది డిజైన్స్‌ దాటి పనుల స్థాయికి రాలేదు.


అనేక మెడికల్‌ కాలేజీలదీ... 

కొత్త బోధనాస్పత్రుల పేరిట జగన్‌ సర్కారు భారీ హడావుడి చేస్తోంది. ఇటీవల జగన్‌ ఒకేరోజు 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ కాలేజీలన్నింటికీ రకరకాల అందమైన గ్రాఫిక్స్‌ రూపొందించారు. ఉదాహరణకు... విజయనగరం మెడికల్‌ కాలేజీ నమూనాను చక్కటి గ్రాఫిక్స్‌ రూపంలో ప్రదర్శించారు. భవన సముదాయాలు, వసతి గృహాలు, బోధనా విభాగాలు, రహదారులు, ఇరువైపులా పచ్చటి చెట్లు... ఇలా గ్రాఫిక్స్‌లో అన్నీ అదిరిపోయాయి. శంకుస్థాపన తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పలు ఆస్పత్రులకు కేటాయించిన స్థలాలు వివాదాల్లో ఉన్నా.. శంకుస్థాపనలు చేసేశారు. చాలా ఆస్పత్రులకు టెండర్లు కూడా ఖరారు కాలేదు. ఇక... ఆస్పత్రుల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో! అప్పటిదాకా గ్రాఫిక్స్‌ చూస్తూ గడపాల్సిందే!


పులివెందులకే దిక్కులేదు!

ముఖ్యమంత్రి జగన్‌ సొంత గడ్డ పులివెందుల! అక్కడ అద్భుతమైన బస్టాండ్‌ నిర్మించాలని సంకల్పించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అద్భుతమైన ఆర్కిటెక్టిక్‌ విలువలతో డిజైన్స్‌తో గ్రాఫిక్స్‌ రూపొందించారు. గత ఏడాది కిస్మస్‌ వేడుకలకు వెళ్లినప్పుడు జగన్‌ స్వయంగా ఈ బస్టాండ్‌కు శంకుస్థాపన చేశారు. అంటే... ఇప్పటికి తొమ్మిది నెలలు. స్వయంగా సీఎం సొంత నియోజకవర్గంలో, సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మిస్తున్న బస్టాండ్‌ కదా! ఈపాటికి పూర్తయ్యే దశలోనే ఉంటుంది... అని అనుకుంటే మీరు కంకరలో కాలేసినట్లే! ఇప్పటికీ పులివెందుల కొత్త బస్టాండ్‌ నిర్మాణంలో పిల్లర్లు కూడా పూర్తి కాలేదు. ఇక శ్లాబులు పడి, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో... ఆ గ్రాఫిక్‌ ఎప్పుడు నిజమవుతుందో దేవుడికే తెలియాలి!


కిడ్నీ బాధితులపైనా దయలేదా?

ఉద్దానం కిడ్నీ బాధితులకోసం 200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2019 సెప్టెంబరు 6వ తేదీన శంకుస్థాపన చేశారు. అది కూడా.. స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగానే! అంతకు ముందు ఆ భవనం డిజైన్స్‌ విడుదల చేశారు. ఆస్పత్రి భవనం డిజైన్‌ చాలా అద్భుతంగా ఉందని ఉద్ధానం బాధితులు సంబరపడ్డారు. రెండు నెలలు పనులు వేగంగా జరిగాయి. ఆ తర్వాత అన్నీ బంద్‌. ఈ ఆస్పత్రి పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయింది. నిధులు కేటాయించకపోవడమే దీనికి కారణం. ఇదేమీ వందలూ, వేల కోట్ల ప్రాజెక్టు కాదు. కేవలం... రూ.50 కోట్లు! ఆ మాత్రం నిధులు కూడా ఇవ్వలేక, ‘గ్రాఫిక్స్‌’తోనే మురిపిస్తున్నారు. ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డయాలసిస్‌ సెంటర్లలోనే బాధితులకు సేవలు అందుతున్నాయి.

Updated Date - 2021-07-21T07:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising