తెలుగు భాషా పరిరక్షణకు ప్రాధాన్యం
ABN, First Publish Date - 2021-10-30T05:11:04+05:30
తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు.
- విద్యావంతుల్లో చైతన్యం రావాలి
- భాషా చైతన్య సదస్సులో నందమూరి లక్ష్మీపార్వతి
కర్నూలు (అర్బన్), అక్టోబరు 29: తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఉపకులపతి ఏ. వరప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం భాషా చైతన్య సదస్సు జరిగింది. కవులు, రచయితలు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు, సంస్కృత భాషల పట్ల అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు, విద్యావంతులు, మేధావుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రాష్ట్ర వ్యాప్త సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లా వరకు పలు యూనివర్సిటీల్లో కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. తెలుగు భాషకు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక సందపను సృష్టించారని, నందమూరి తారక రామారావు తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని, తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. కోర్టును ఆశ్రయించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించారని గుర్తు చేశారు. తెలుగు అకాడమీలో ఏపీ వాటా రాబట్టేందుకు కోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీ గురించి పట్టించుకోలేదని, తాను బాధ్యతలు తీసుకున్న వెంటనే అమరావతిలోని ఉన్నత విద్యాశా ఖలో కార్యాలయం, తిరుపతిలో మరో కార్యాలయం ఏర్పాటు చేయించానని తెలిపారు.
కర్నూలులో తెలుగు అకాడమీ శాఖను ఏర్పాటు చేస్తే రాయలసీమ యూనివర్సిటీలో స్థలం కేటాయిస్తామని ఉపకులపతి ఆనందరావు అన్నారు. కర్నూలు జిల్లాలో 15 భాషా సాహిత్య వేదికలున్నాయని కేవీఆర్ కళాశాల తెలుగు విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ దంబోయిన పార్వతిదేవి అన్నారు. తెలుగు అకాడమీకి స్థలం కేటాయించాలని ఆమె వీసీని అభ్యర్థించారు. దీంతో ఉపకులపతి హామీ ఇచ్చారు. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు నగరం సాహిత్యానికి పెట్టింది పేరు అని విశ్రాంత సంస్కృత ఉపన్యాసకుడు డి. హయగ్రీవాచార్యులు అన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు తెలుగు, సంస్కృత భాషలను పరిరక్షించేందుకు చేపట్టే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌యూ రిజిస్ట్రార్ మధుసూదన వర్మ, రెక్టార్ ప్రొఫెసర్ సంజీవరావు, ప్రొఫెసర్లు ఎన్‌టీకే నాయక్, సుందరానంద పుచ్చా, విశ్వనాథరెడ్డి, విభాగాధిపతులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు హాజరయ్యారు.
Updated Date - 2021-10-30T05:11:04+05:30 IST