ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదవి కోసం పోటాపోటీ

ABN, First Publish Date - 2021-07-28T06:10:03+05:30

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొలువులకు వైసీపీలో పోటాపోటీ నెలకొంది. నాకంటే నాకంటూ పోటీ పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. కర్నూలు డిప్యూటీ మేయర్‌ బరిలో ఆ ఇద్దరు
  2. నంద్యాల మున్సిపాలిటీలో మూడు ముక్కలాట
  3. వైస్‌ చైర్మన్‌ పదవికి శిల్పా నాగిని రెడ్డి పట్టు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొలువులకు వైసీపీలో పోటాపోటీ నెలకొంది. నాకంటే నాకంటూ పోటీ పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, పాలక వర్గాల మెప్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కేటాయించిన సామాజిక వర్గాలకు కాకుండా రెండో డిప్యూటీ మేయర్‌ స్థానానికి ముస్లిం మైనార్టీలు, ఎస్సీ సామాజిక వర్గాలకే కేటాయిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. కర్నూలు నగర పాలక సంస్థ, నంద్యాల మున్సిపాలిటీలో ఇద్దరు అంతకు మించి కార్పొరేటర్లు బరిలో ఉన్నారు. కర్నూలు రెండో వైస్‌ చైర్మన్‌ పదవికి ఇద్దరు పోటీ పడుతుండగా ఎస్సీ సామాజిక వర్గానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత సంప్రదాయానికి విరుద్ధంగా ముస్లింలకు రిక్త హస్తం చూపిస్తారనే ప్రచారం సాగుతోంది. నంద్యాల మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన్‌ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే సతీమణి నాగిని రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. కాకపోతే బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని శిల్పా కుటుంబం కోరుతోంది. ఈనెల 30న జరిగే ఎంపికలో తుది ఫలితాలు వెల్లడిస్తారు.


ఆ ఇద్దరే బరిలో


కర్నూలులో ఫరాజ్‌ ఖాన్‌, క్రాంతి కుమార్‌ అనే ఇద్దరు కార్పొరేటర్లు బరిలో ఉన్నారు. వీరిద్దరిలో 12వ డివిజన్లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన క్రాంతికుమార్‌కు రెండో డిప్యూటీ మేయర్‌ పీఠం కట్టబెడతారనే ప్రచారం ఉంది. మొదటి నుంచి నలుగురు కార్పొరేటర్లు రెండో డిప్యూటీ మేయర్‌ కోసం పోటీ పడ్డారు. మైనార్టీ వర్గం నుంచి 7వ డివిజన్‌ నుంచి జుబేర్‌ అహమ్మద్‌, 10వ డివిజన్‌ నుంచి షేక్‌ యూనస్‌ బాషా, 11వ డివిజన్‌ నుంచి ఫరాజ్‌ ఖాన్‌ , ఎస్సీ సామాజిక వర్గం నుంచి 12వ డివిజన్‌ నుంచి క్రాంతికుమార్‌, 18 డివిజన్‌ నుంచి పుల్లమ్మ ఆలియాస్‌ పల్లవి, 23 డివిజన్‌ నుంచి కటారి పల్లవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 


మైనార్టీలకు లెక్క తప్పుతోందా?


నగర పాలక సంస్థ పాలక మండలిలో ఈసారీ అనవాయితీకి చెక్‌ పడనుందనే ప్రచారం ఉంది. మొదటి నుంచి ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. 1981లో దావుద్‌ ఖాన్‌ ముస్లిం మైనార్టీ ప్రతినిధిగా మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేయగా 1987లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్‌బాబు మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఖాజా ఖాన్‌, సలీం బాషా వైఎస్‌ చైర్మన్లుగా పని చేశారు. 1995లో పురపాలక సంఘం నగర పాలక సంస్థగా ఏర్పడ్డాక ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన బంగి అనంతయ్య తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో తొలి ఉప మేయర్‌గా మైనార్టీ వర్గానికి చెందిన ఫకృద్దీన్‌ ఎన్నికయ్యారు. 2000లో ఫిరోజ్‌ బేగం మైనార్టీ వర్గం నుంచి తొలి మహిళా మేయర్‌గా కొలువు దీరారు. 2005లో అబ్దుల్‌ రజాక్‌ ఉప మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుత పాలక వర్గంలోనూ ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం లభిస్తుందని ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రధాన నాయకులు మాత్రం ఎస్సీ వర్గానికి కేటాయించాలని ప్రయత్నిస్తున్నారు.


మూడు ముక్కలాట 


నంద్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోసం తీవ్రమైన పోటీ ఉంది. తొలుత గంగిశెట్టి శ్రీధర్‌ను తొలి వైస్‌ చైర్మన్‌గా స్థానిక పాలక వర్గంతో పాటు నాయకులు కలిసి నిర్ణయించారు. రెండో వైస్‌ చైర్మన్‌ పదవికి ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి సతీమణి శిల్పా నాగిని రెడ్డి(36వ వార్డు కౌన్సిలర్‌) పట్టుబడుతున్నారని తెలుస్తోంది. గతంలో చైర్మన్‌ పదవి తనకే కావాలని ఆమె కోరారు. అధినాయకత్వం ఆ పదవిని ముస్లింలకు కేటాయించడంతో మాబున్నీసా చైర్మన్‌ అయ్యారు. దీంతో వైస్‌చైర్మన్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ఆ పదవిని బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనే నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో వాసగిరి విజయభాస్కర్‌(16వ వార్డు)కు వైస్‌ చైర్మన్‌ ఇవ్వాలని శిల్పా కుటుంబం కూడా నిర్ణయించింది. అయితే తెలుగు కృష్ణమోహన్‌ (25వ వార్డు)తో పాటు పాంషా వలి కూడా ప్రయత్నిస్తున్నారు. తనకు అత్యధిక కౌన్సిలర్ల మద్దతు ఉందని కృష్ణమోహన్‌ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-07-28T06:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising