ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశీ ఓటమే లక్ష్యం: టీడీపీ ‘గన్నవరం’ శ్రేణులు

ABN, First Publish Date - 2021-10-24T06:08:25+05:30

వంశీ ఓటమే లక్ష్యం: టీడీపీ ‘గన్నవరం’ శ్రేణులు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బచ్చుల అర్జునుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వంశీపై పోటీకి లోకేశ్‌ అవసరం లేదు..బచ్చుల అర్జునుడు పోటీ చేసి గెలుస్తారని ధీమా

 గన్నవరం, అక్టోబరు 23: గన్నవరంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు 36 గంటల దీక్ష, చంద్రబాబు, లోకేశ్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గన్నవరం పాలిటిక్స్‌ గరంగరంగా మారాయి. గన్నవరంలో నారా లోకేశ్‌ పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే వంశీ డిమాండ్‌ చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వంశీపై పోటీకి లోకేశ్‌, సునీత అవసరం లేదని, బడుగు, బలహీనవర్గాల నేత, గన్నవరం టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పోటీ చేసి గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి కొండేటి ఏడుకొండలు, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి తదితరులు మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌పై ఎమ్మెల్యే వంశీ పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా హెచ్చరించారు. పార్టీ మారిన వంశీ రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని, రెండేళ్లుగా రాజీనామా చేస్తానంటున్న వంశీ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. గన్నవరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది తమ నేత బచ్చుల అర్జునుడేనని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి కొండేటి ఏడుకొండలు అన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌ వల్లే గన్నవరాన్ని అభివృద్ధి చేశానని, వారికి సత్కారం చేసిన వంశీ, నేడు వారిపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నత చదువులు చదివిన వంశీ హుందాగా వ్యవహరించాలి గానీ, ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు హెచ్చరించారు. గుండపనేని ఉమావరప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, గరిమెళ్ల నరేంద్ర చౌదరి, దండు సుబ్రహ్మణ్యంరాజు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, జూపల్లి సరేష్‌, జాస్తి వెంకటేశ్వరరావు, బోడపాటి రవి, గొడ్డళ్ల చినరామారావు, కంభంపాటి సుభాష్‌ చంద్రబోస్‌, పట్టపు వెంకటేశ్వరరావు (చంటి) పాల్గొన్నారు.

లోకేశ్‌, సునీత కాదు.. పోటీ చేసేది నేనే

రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమేనా..?

 ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అర్జునుడు సవాల్‌

 ‘‘గన్నవరంలో వంశీపై పోటీకి నారా లోకేశ్‌, పరిటాల సునీత అవసరం లేదు. వంశీని ఓడించేందుకే పార్టీ అధినేత చంద్రబాబు నన్ను గన్నవరం పంపించారు. టీడీపీ సింబల్‌పై గెలిచి వ్యక్తిగత అవసరాల కోసం వైసీపీలో చేరిన వంశీ, రాజీనామా చేస్తానంటున్నారేగానీ, నేటికీ చేయలేదు. వంశీ రాజీనామా చేస్తే ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నా. రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలే వంశీని ఓడిస్తారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును ఇష్టానుసారంగా దూషిస్తే సహించేది లేదు. టీడీపీ హయాంలో రూ.2 వేల కోట్లతో గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. వంశీ పార్టీ మారాక ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలి. టీడీపీలో ఉన్నపుడు సిగ్గు, శరం ఉన్న వారెవ్వరూ వైసీపీలో చేరబోరని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన వంశీనే..నేడు అదే నోటితో చంద్రబాబును దూషిస్తున్నారు. స్వార్థం కోసమే వంశీ పార్టీ మారారు.’’ అని ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అర్జునుడు ఘాటుగా బదులిచ్చారు. 



Updated Date - 2021-10-24T06:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising