సాహో సాహిల్
ABN, First Publish Date - 2021-09-07T06:01:46+05:30
సాహో సాహిల్
కాలిఫోర్నియాలో తెలుగు యువకుడి అద్భుతాలు
అంధులకు ‘స్మార్ట్’ కళ్లద్దాల సృష్టి
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ప్రాజెక్టు
ప్రశంసలు అందుకుంటున్న పదహారేళ్ల కుర్రాడు
అంధులకు కళ్లజోడు పెట్టి అన్నీ ఈజీగా కనిపెట్టేయడమే కాదు.. ఎదురుగా బోర్డుపై రాసిన అక్షరాలను చదివించేస్తే.., దొంగలు రహస్యంగా దాచితెచ్చే ఏ వస్తువునైనా కేవలం ఓ స్కానర్ ద్వారా ఇట్టే పట్టేస్తే.. ఇవేవో గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ అనుకోకండి. నిజంగా మన ముందున్న సరికొత్త సాఫ్ట్‌వేర్ ఇది. మన అమరావతికి చెందిన 16 ఏళ్ల సాహిల్ కాలిఫోర్నియాలో సాధించిన విజయమిది.
విజయవాడ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వయస్సు నిండా పదహారేళ్లు లేవు. చదివేది తొమ్మిదో తరగతే. అయితేనేం శాస్త్రవేత్తలకు ఉండాల్సిన మేధోసంపత్తిని సొంతం చేసుకున్నాడు అమరావతికి చెందిన తల్లం సాహిల్. కొన్నాళ్ల క్రితం సాహిల్ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడింది. అక్కడే విద్యాభ్యాసం సాగించిన సాహిల్ మొదటి నుంచి ప్రయోగాలపై ఆసక్తి చూపించేవాడు. కాలిఫోర్నియాలోనే ఉంటూ అనేక కొత్త ఆవిష్కరణలకు బీజం వేశాడు. తాజాగా అతను సృష్టించిన రెండు ప్రయోగాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
అంధుల కోసం ప్రత్యేక కళ్లద్దాలు
రోడ్డుపై నడవాలంటే కర్రసాయం.. రోడ్డు దాటాలంటే మరొకరి ఊతం.. పరీక్షలు రాయాలంటే ఇంకొకరి సహాయం.. అంధులుగా పుట్టినవారికి నిత్యం ఎదురయ్యే సమస్యలివి. ఇలాంటి సమస్యలకు ‘స్మార్ట్’ పరిష్కారాన్ని చూపాడు సాహిల్. కంటిచూపు లేని వారి కోసం స్మార్ట్ కళ్లద్దాలను సృష్టించాడు. కెమెరా, మైకు, సెన్సార్, స్పీకర్ వంటి పరికరాలను అమర్చి, వాటిని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌కు అనుసంధానించాడు. ఈ కళ్లద్దాలను ధరించడం వల్ల తమకు తారసపడిన వ్యక్తులను అంధులు తేలిగ్గా గుర్తించగలుగుతారు. వారి అలికిడి స్పష్టంగా తెలుస్తుంది. ఎదురుగా ఉన్న బోర్డుపై రాసిన అక్షరాలను చదవగలుగుతారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమవుతుందని సాహిల్ వివరించాడు.
ఇంటిగ్రేటెడ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ప్రాజెక్టు
కాలిఫోర్నియాలో తాను చదువుతున్న శాన్ రామన్ డౌగెర్టీ వ్యాలీ హైస్కూల్‌లో సాఫ్ట్‌వేర్ ఆధారిత సూక్ష్మ కెమెరా వ్యవస్థ అయిన ‘ఇంటిగ్రేటెడ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ప్రాజెక్టు’ను కూడా తయారు చేశాడు సాహిల్. కొంతమంది వ్యక్తులు రహస్యంగా దాచి తెచ్చే, ఏ వస్తువునైనా తేలిగ్గా స్కాన్ చేసి ఇట్టే పసిగట్టే సైన్స్ ఫిక్షన్ తరహా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఇది. మరొక పరిశోధనలో రెండు డ్రోన్ల సాయంతో నేల స్వభావంపై సర్వేయింగ్, విత్తనాల ఎంపిక, అంకురోత్పత్తి ప్రక్రియను జీపీఎస్‌కు అనుసంధానించి ఆటోమేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. విదేశాల్లో ఉంటూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించిన సాహిల్ మనదేశంలోనూ పలు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు.
Updated Date - 2021-09-07T06:01:46+05:30 IST