ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జడ్‌ఎక్స్‌ఇన్‌’ను చవకగా కొట్టేయాలని..

ABN, First Publish Date - 2021-08-22T06:11:40+05:30

ఒకరు భాగస్వామిగా చేరారు. మరొకరు..

కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం, కోరాడ పద్మజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాక్టరీపై కన్నేసి..

‘జడ్‌ఎక్స్‌ఇన్‌’ను చవకగా కొట్టేయాలని కోరాడ, కోగంటి ప్లాన్‌

అందుకోసం రాహుల్‌ పై ఒత్తిడి

అంగీకరించకపోవడంతో హత్య

సూత్రధారి కోగంటి... పాత్రధారి కోరాడ!

ఏ1, ఏ2లుగా వీరిద్దరి పేర్లు

ఎఫ్‌ఐఆర్‌లో ఐదుగురి పేర్లు 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఒకరు భాగస్వామిగా చేరారు. మరొకరు ఫ్యాక్టరీపై కన్నేశారు. ఇద్దరూ కలిసి ఆ ఫ్యాక్టరీని చేజిక్కించుకునేందుకు ప్లాన్‌ వేశారు. కరణం రాహుల్‌ నెలకొల్పిన ‘జడ్‌ఎక్స్‌ఇన్‌’లో భాగస్వామిగా చేరిన కోరాడ విజయ్‌కుమార్‌ తన వాటాను అమ్ముకునే ప్రయత్నంలో కోగంటిని రంగంలోకి దింపాడు. అప్పుడే ఆ ఫ్యాక్టరీపై కోగంటి కన్ను పడింది. ఫ్యాక్టరీని తమకు అమ్మేయాలని ఒత్తిడి తెచ్చారు. కాదనడంతో రాహుల్‌ను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.


కరణం రాహుల్‌.. కెనడాలో ఎమ్మెస్‌ చేశాడు. తిరిగి వచ్చి జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో భాగస్వాములతో కలిసి గ్యాస్‌ సిలిండర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పాడు. దీనిలో భాగస్వామిగా చేరిన కోరాడ ఆ తరువాత తన వాటాను వాల్చేసుకుని, మొత్తం డబ్బులు ఇచ్చేయాలని రాహుల్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ వ్యవహారంలో కోగంటి సత్యనారాయణ అలియాస్‌ సత్యంను రంగంలోకి దింపాడు.


రెండేళ్లుగా ఒత్తిడి తెచ్చి..

రెండేళ్ల క్రితం కోగంటి సత్యంను వెంటబెట్టుకుని కోరాడ జడ్‌ఎక్స్‌ఇన్‌ కంపెనీకి వెళ్లాడు. రాహుల్‌తో భేటీ ఏర్పాటు చేయించాడు. కంపెనీని చూసిన కోగంటి దానిని కొట్టేయాలని స్కెచ్‌ వేశాడు. అప్పటి నుంచి కంపెనీ మొత్తాన్ని కోగంటి సత్యంకు ఇచ్చేయాలని కోరాడ రాహుల్‌పై ఒత్తిడి తేవడం మొదలు పెట్టాడు. కోగంటి చరిత్రను చెప్పి బెదిరించాడు. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కంపెనీని అమ్మే ప్రసక్తి లేదని రాహుల్‌ కరాఖండిగా చెప్పాడు. అప్పటి నుంచి కోరాడ రకరకాల వ్యూహాలను అమలు చేస్తూ వచ్చాడు. ఏదీ ఫలించకపోవడంతో చివరికి రాహుల్‌ ప్రాణాలు తీసేశారు. 


ఐదుగురిపై కేసు నమోదు

రాహుల్‌ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మాచవరం పోలీసులు, ఏ1గా కోరాడ విజయ్‌కుమార్‌, ఏ2గా కోగంటి సత్యం, ఏ3గా కోరాడ పద్మజ, ఏ4గా పద్మజ, ఏ5గా గాయత్రి పేర్లను చేర్చారు. ఏ3గా ఉన్న పద్మజ కోరాడ విజయ్‌కుమార్‌ భార్య. ఏ4గా ఉన్న పద్మజ గాయత్రి కుమార్తె. కోరాడకు అత్యంత సన్నిహితంగా ఉండే మహిళ గాయత్రి. ఈమె రాహుల్‌ హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఓ అపార్టుమెంట్‌లో కుమార్తెతో కలిసి ఉంటోంది. కోరాడ నిత్యం ఇక్కడికి వచ్చి వెళ్లేవాడు. కొద్దినెలల క్రితం గాయత్రి తన కుమార్తెను తీసుకుని ఒంగోలులోని రాహుల్‌ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి గొడవ చేసినట్టు తెలుస్తోంది.


కోరాడ, రాహుల్‌ డీవీ మ్యానర్‌ వీధిలో ఉన్న ఫుడ్‌ ప్లాజా ఎదురుగా ఉన్న వీధిలోనే పలుమార్లు చర్చించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 18వ తేదీ రాత్రి కూడా అలాగే మాట్లాడుకుందామంటూ రాహుల్‌కు ఫోన్‌ చేసి ఇక్కడికి రప్పించారు. దాదాపు మూడు గంటలపాటు కారులో కూర్చుని మాట్లాడిన తర్వాత, ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం రాహుల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో కారులో గాయత్రి గానీ, ఆమె కుమార్తె గానీ ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. రాహుల్‌ మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత క్లూస్‌ టీం కొన్ని నమూనాలను సేకరించింది. అందులో మహిళ తల వెంట్రుక ఉన్నది. దీన్ని బట్టి ఇద్దరిలో ఒకరు కచ్చితంగా హత్యలో పాల్గొన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌ ఘటనా స్థలానికి సమీపంలో ఉండడం దీనికి బలాన్ని చేకూర్చుతోంది. ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రెండో నిందితుడిగా ఉన్న కోగంటి సత్యం కొండపల్లిలోని తన ఫ్యాక్టరీలోనే ఉన్నాడు. మిగిలిన నిందితులంతా బెంగళూరులో మకాం వేసినట్టు తెలుస్తోంది. 


కొండపల్లిలోనే స్కెచ్‌!

రాహుల్‌ హత్యకు ప్రణాళిక మొత్తం కొండపల్లిలోనే సిద్ధమైనట్టు భావిస్తున్నారు. ఇలాంటి నేరాల్లో ఎక్కువగా కోగంటి సత్యం పేరు వినిపిస్తుంది. అదేవిధంగా రాహుల్‌ హత్య కేసులోనూ ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. కొండపల్లిలోని తన ఫ్యాక్టరీలో ఉన్న కోగంటి కొంతమంది మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తనకు ఎలాంటి పాపం తెలియదంటూనే అనుమానాలను రేకెత్తించే వ్యాఖ్యలను చేశాడు. నేరం జరిగినప్పుడు సీన్‌లో లేకుండా పని పూర్తి చేయించడంలో కోగంటికి మంచి నైపుణ్యం ఉందని, రాహుల్‌ హత్యనూ అదేవిధంగా చేయించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2019 జూలైలో హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రామ్‌ప్రసాద్‌ అనే స్టీల్‌ వ్యాపారి హత్య కేసులోనూ కోగంటి సత్యం నిందితుడు. ఈ హత్యకు కర్త, కర్మ, క్రియ ఈయనే అయినప్పటికీ ఆ ఆనవాళ్లు లేకుండా చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.


హత్య జరిగిన సమయంలో తిరుమలలో ఉన్నట్టు నిరూపించుకోవడానికి వేంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద కూర్చుని రాజకీయ విమర్శలు చేస్తూ ఒక వీడియోను తన అనుచరుల ద్వారా బయటకు విడుదల చేయించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు హైదరాబాద్‌లో రోజుకో ప్రాంతంలో తలదాచుకుని వివిధ మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు రాహల్‌ హత్య కేసులోనూ అదే తీరును అమలు చేశాడు. ఆయన పేరు వెలుగులోకి రాగానే మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులోనూ పాత పాటే పాడాడు. రాహుల్‌ ఫ్యాక్టరీని చూడడానికి ఇంజనీర్లు, ఆడిటర్లతో కలిసి వెళ్లానని చెప్పాడు. ఇందులో వాస్తవం తేలాల్సి ఉంది. 


‘పశ్చిమ’లో రాహుల్‌ను పరిచయం చేసిన కోరాడ

వ్యాపార భాగస్వామిగా ఉన్న కరణం రాహుల్‌ను కోరాడ పలుమార్లు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కోరాడ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. దీనికి ముందు నుంచే అక్కడ కోరాడ ఫౌండేషన్‌ పేరుతో సేవాకార్యక్రమాలు నిర్వహించాడు. ఆ సమయంలో రాహుల్‌ను నియోజకవర్గానికి తీసుకొచ్చి తన మేనల్లుడిగా కొంతమందికి పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కోరాడ కారు డ్రైవర్‌ బాబును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడ్ని నూజివీడు వద్ద పట్టుకున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-08-22T06:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising