ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరమే ‘సత్యం’!

ABN, First Publish Date - 2021-08-26T06:44:49+05:30

కోగంటి సత్యనారాయణ అలియాస్‌ సత్యం... కొందరి దృష్టిలో కళాభిమాని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్ర్కాబ్‌ నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన కోగంటి

భూవివాదాల్లో ముందుగా వినిపించే పేరు ఇదే

నేరాల్లోనూ అంతే..


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కోగంటి సత్యనారాయణ అలియాస్‌ సత్యం... కొందరి దృష్టిలో కళాభిమాని. మరికొందరి దృష్టిలో ప్రముఖ పారిశ్రామికవేత్త. పోలీసుల రికార్డుల్లో రౌడీషీటర్‌. విజయవాడలో ఎక్కువగా వినిపించే ఈ పేరు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ మార్మోగింది. 2019 జూలైలో హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఐరన్‌ వ్యాపారి తేలప్రోలు రామ్‌ప్రసాద్‌ హత్య కేసుతో అక్కడి పోలీసు రికార్డుల్లోకీ ఎక్కింది. ఇప్పుడు యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ హత్య కేసుతో కోగంటి పేరు మళ్లీ వినబడుతోంది. 


ఎడ్లపల్లి టు బెజవాడ

కోగంటి సత్యం స్వగ్రామం గుంటూరు జిల్లా ఎడ్లపల్లి. ఆయన తండ్రి రామయ్య వ్యాపారం నిమిత్తం విజయవాడకు వలస వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్ర్కాప్‌ దుకాణం నిర్వహించారు. కోగంటి సత్యం నేర సామ్రాజ్యానికి మంగళగిరిలోనే బీజం పడిందని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. 1985లో మంగళగిరి సర్పంచ్‌పై సత్యం, అతని అనుచరులు తాడేపల్లి రైల్వేట్రాక్‌ సమీపంలో దాడి చేసి కృష్ణానదిలో పడేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సర్పంచ్‌ చనిపోయాడు. కోగంటి సత్యంపై నమోదైన తొలి కేసు ఇదే. తర్వాత కృష్ణలంకలో పాత సీసాలు, ఇనుప సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇలా చిన్న వ్యాపారం మొదలుపెట్టిన సత్యం అనతి కాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులను వెనుకేసుకున్నాడు. భూ వివాదాలు, కబ్జాలతో సంపాదించిన డబ్బులతోనే కొండపల్లిలో ఎస్‌డీవీ స్టీల్స్‌ పేరుతో ఒక పరిశ్రమను స్థాపించారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సత్యం స్కెచ్‌లు కొండపల్లి ఫ్యాక్టరీలోనూ, సెటిల్‌మెంట్లు కృష్ణలంకలో ఆయన పేరుతో ఉన్న దొడ్డిలోనూ చేస్తాడన్నది బహిరంగ రహస్యం. పోలీసు కమిషనరేట్‌ సమీపంలో సీఎస్‌ఐ చర్చి పక్కన ఉన్న ఖాళీ స్థలం విషయంలో అప్పటి బిషప్‌ నేతల భగవాన్‌ దాసు హత్య కేసులో సత్యం ప్రధాన నిందితుడు. 1988 మార్చి 12వ తేదీన గాంధీనగర్‌లోని ఊర్వశి థియేటర్‌ వద్ద భగవాన్‌ దాస్‌ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. డోర్నకల్‌ రోడ్డులోని 2,400 గజాల స్థలాన్ని భగవాన్‌ దాస్‌ నుంచి సత్యం కొనుగోలు చేశారని, నగదు తీసుకున్న ఆయన రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో సత్యం ఈ హత్య చేయించారన్నది ఆరోపణ. సత్యం నుంచి ప్రాణహాని ఉందని అప్పటి పోలీసు కమిషనర్‌ డీటీ నాయక్‌కు భగవాన్‌ దాస్‌ పలుమార్లు విన్నవించుకున్నా, సరైన రక్షణ కల్పించలేదన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత ఈ కేసును న్యాయస్థానం కొట్టేసింది. 1988వ సంవత్సరంలో వంగవీటి మోహన్‌రంగా హత్య జరిగింది.  తరువాత ఆయన అనుచరగణం చెల్లాచెదురైపోయింది. వారిలో కొంతమందిని సత్యం చేరదీసి షెల్టర్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. అదే సంవత్సరంలో పోలీసు కమిషనర్‌ నాయక్‌ కోగంటి సత్యంపై రౌడీషీట్‌ తెరిచారు. బెంజ్‌సర్కిల్లో సినీనటి వహీదా రెహ్మాన్‌కు చెందిన భూకబ్జా విషయంలోనూ అనేక వేళ్లు కోగంటి సత్యం వైపే చూపిస్తున్నాయి. 


మృత్యువు నుంచి తప్పించుకుని...

నేర ప్రదేశంలో కనిపించడు. మ్యాప్‌ ఇస్తే అనుచరగణం అమలు చేస్తుంది. చేతికి మట్టి అంటుకోకుండా పని పూర్తి చేయించడం ఇతడి నైజం. పని పూర్తయిన తర్వాత నేరుగా మీడియా ముందుకు వస్తాడు. ఆ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. కోగంటి సత్యం స్కెచ్‌ వేస్తే ప్రత్యర్థి ప్రాణాలతో ఉండడం కష్టమని చెప్పుకుంటారు. ఆయన స్కెచ్‌ నుంచి ప్రాణాలతో బయటపడింది కాట్రాగడ్డ బాబు మాత్రమే అని చెబుతారు. ఎంజీ రోడ్డులోని ప్రశాంతి ఆస్పత్రి వద్ద 2008వ సంవత్సరంలో కాట్రగడ్డ బాబుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. సుపారీ గ్యాంగ్‌తో సత్యం ఈ పని చేయించాడని విమర్శలు ఉన్నాయి. ఈ దాడి నుంచి బాబు తప్పించుకున్నారు. కాట్రగడ్డ బాబు అన్న వెంకటనారాయణ హత్య కేసులో వంగవీటి శంతన్‌కు సత్యం సహకరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి ముందు 2006వ సంవత్సరంలో సీఎస్‌ఐ చర్చి ప్రాంగణంలో నిలబడి ఉన్న కోగంటి సత్యంపై ఎదురుగా ఉన్న భవనం పైనుంచి ముసునూరు శ్రీను అలియాస్‌ కాట్రగడ్డ శ్రీను నైఫర్‌ గన్‌తో కాల్పులు జరిపించాడు. ఈ ఘటన నుంచి సత్యం ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంజీ రోడ్డులో గల శేషసాయి కల్యాణ మండపంలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన సత్యంపై ప్రత్యర్థులు దాడికి యత్నించారు. కళ్లలో కారం చల్లి దాడికి ప్రయత్నించగా, సత్యం తప్పించుకున్నాడు. సత్యం, వంగవీటి శంతన్‌ ఓ కేసులో కోర్టు వాయిదాకు హాజరై వస్తుండగా ఇద్దరిపైనా దుండగులు కాల్పులు జరిపారు. హాట్‌కేక్‌ వంటి గాంఽధీనగర్‌లోని దుర్గాకళామందిర్‌ను ఎన్టీఆర్‌పై అభిమానంతో సత్యం కొనుగోలు చేశాడని కొందరు చెబుతారు. దీన్ని ఆక్రమించుకున్నాడని మరికొంతమంది చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి పోలీసు కమిషనర్‌ సురేంద్రబాబు సత్యంపై పోటా చట్టం కేసులు నమోదు చేయడంతోపాటు కొన్నాళ్లపాటు నగరం నుంచి బహిష్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఖైరతాబాద్‌ మాదిరిగానే గణపతి నవరాత్రులకు సంగీత కళాశాల ఆవరణలో డూండీ గణేష్‌ మండపం పేరుతో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో అప్పటి సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కోగంటి సత్యం మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదంలోనూ సత్యంపై కేసు నమోదైంది. సత్యంపై విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో ఇప్పటి వరకు 30 కేసుల వరకు నమోదయ్యాయి. 

Updated Date - 2021-08-26T06:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising