డ్వాక్రా రుణాల్లో అక్రమాలు వాస్తవం
ABN, First Publish Date - 2021-03-11T04:56:07+05:30
ముద్దనూరు మండలం ఉప్పలూరులోని రెండు వీవోలలో డ్వాక్రా రుణాలకు సంబంధించి వెలుగు సిబ్బంది అక్రమాలకు పాల్పడటం వాస్తవమేనని, ఇందుకు సంబంధించి సీసీలు అయ్యన్న, రహేనాను సస్పెండ్ చేశామని వెలుగు పీడీ మురళీమనోహర్ తెలిపారు.
ఇద్దరు సీసీలను సస్పెండ్ చేశాం
కలెక్టర్‌కు నివేదిక పంపాం : పీడీ
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
ముద్దనూరు మార్చి 10: ముద్దనూరు మండలం ఉప్పలూరులోని రెండు వీవోలలో డ్వాక్రా రుణాలకు సంబంధించి వెలుగు సిబ్బంది అక్రమాలకు పాల్పడటం వాస్తవమేనని, ఇందుకు సంబంధించి సీసీలు అయ్యన్న, రహేనాను సస్పెండ్ చేశామని వెలుగు పీడీ మురళీమనోహర్ తెలిపారు. ‘డ్వాక్రా రుణాల్లో భారీ కుంభకోణం’ అంటూ ఇటీవల ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. బుధవారం ఉప్పలూరు పాఠశాలలో డ్వాక్రా గ్రూపు సభ్యులతో వెలుగు పీడీ, శ్రీనిధి ఏజీఎం రమణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రుణాల్లో జరిగిన తేడాపై ముందుగా లక్ష్మిచెన్నకేశవ, కార్తికా గ్రూపు మహిళలను విచారించారు. రుణంలో ఎటువంటి తేడా లేదని అధికారులు చెప్పడంతో గ్రూపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బాకీ ఉన్నట్లు కంప్యూటర్‌లో చూపించి, రాయించి ఇచ్చారని ఇప్పుడు బాకీ లేదంటున్నారని అయితే ఆ డబ్బు ఎవరు కట్టారని పీడీని ప్రశ్నించారు. దీంతో పీడీ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. డ్వాక్రా రుణాల్లో అక్రమాలకు పాల్పడింది మొదటి సూత్రధారులు ఏసీ మీణాకుమారి, ఏపీఎం భాగ్యమ్మ అని డ్వాక్రా మహిళలు వారిపై దాడికి ప్రయత్నించారు. ఇంతలో పీడీ ఏసీని కారులో ఎక్కించుకొని వెళుతుండగా మహిళలు అడ్డుకుని వారిద్దరి పై చర్యలు తీసుకోవాలని అర్జీలు ఇచ్చారు. చనిపోయిన సీసీలకు డబ్బులు చెల్లించినట్లు ఎటువంటి సాక్ష్యాలు ఉన్నా పెండింగ్ డబ్బులు చెల్లించనవసరం ఉండదని డ్వాక్రా మహిళలకుపీడీ హామీ ఇచ్చారు. పీడీ తమ సమస్యలు వినలేదని, డబ్బులు కట్టినట్లు సాక్ష్యాలు లేకుంటే తమ పరిస్థితి ఏమిటని అందరు గ్రూపు మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. కాగా విలేకరులతో పీడీ మాట్లాడుతూ డ్వాక్రా రుణాల్లో అక్రమాలు వాస్తవమేనని అయితే అది అంత పెద్ద మొత్తంలో లేదని అన్నారు. పూర్తి నివేదిక కలెక్టర్‌కు పంపుతామని, తదుపరి మరికొందరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Updated Date - 2021-03-11T04:56:07+05:30 IST