‘సూక్ష్మ’ం.. మోక్షం ఎప్పుడో..?
ABN, First Publish Date - 2021-06-07T05:30:00+05:30
మెట్ట రైతుకు సూక్ష్మ సేద్యం వరం. తక్కువ నీటితో ఎక్కువ పొలం సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు.
డీడీ కట్టిన 2,746 మంది రైతులు
ఏడాదిన్నరగా అందని బిందు, సూక్ష్మ సేద్య పరికరాలు
రివర్స్ టెండర్లకు ప్రభుత్వం సన్నాహాలు
ఈ ఏడాదైనా అందేనా..?
ఉద్యాన సాగు రైతుల ఎదురుచూపులు
(కడప-ఆంధ్రజ్యోతి): మెట్ట రైతుకు సూక్ష్మ సేద్యం వరం. తక్కువ నీటితో ఎక్కువ పొలం సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించి జిల్లా రైతులు బిందు, సూక్ష్మ సేద్యం పరికరాల కోసం ఏడాదిన్నరగా నిరీక్షిస్తున్నారు. అప్పు చేసి కంపెనీలకు డీడీలు కట్టారు. పాలకుల నిర్లక్ష్యం.. నిధుల కొరత వెరసి సూక్ష్మ సేద్యానికి మోక్షం ఎప్పుడో..? అన్నట్లుగా మారింది.
జిల్లా ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి. సాధారణ సాగు 1.20 లక్షల హెక్టార్లు. మామిడి, అరటి, చీనీ, బొప్పాయి, పసుపు, టమోటా, పూలు, నిమ్మ, దానిమ్మ తదితర పంటలకు ప్రధాన సాగునీటి వనరు భూగర్భ జలాలే. మెట్ట ప్రాంతాల్లో 350-400 అడుగుల్లో బోరుబావుల తవ్వినా రెండు ఇంచుల నీరు పడని పరిస్థితి. ప్రధానంగా వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటితే పండ్ల తోటలకు ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యాన రైతుకు బిందు, సూక్ష్మ సేద్యం వరం. తక్కువ నీటితో ఎక్కువ పంట చేలకు తడులు ఇవ్వవచ్చు. ప్రతి నీటిచుక్క మొక్కకు అందించి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది.
డీడీలు కట్టినా పరికరాలు ఏవీ..?
గత ప్రభుత్వం బిందు, సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. డ్రిప్‌కు ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం, స్ర్పింక్లర్లకు 50 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది. 2019లో జగన్ ప్రభుత్వం కొలువుదీరాక ఈ పథకం అమలుపై నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు అంటున్నారు. జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 21,369.84 హెక్టార్లలో బిందు, సూక్ష్మ సేద్య పరికరాల కోసం 16,369 మంది రైతులు దరఖాస్తు చేశారు. వారిలో 3,080.62 హెక్టార్లకు చెందిన 2,204 మంది రైతులకు ఏడాదిన్నర దాటినా పరికరాలు అందలేదు. అలాగే.. 2020-21లో 484 హెక్టార్లకు డ్రిప్, ప్ర్పింక్లర్స్ రాయితీపై ఇవ్వాలని 542 మంది రైతులు కొత్తగా దరఖాస్తు చేశారు. వారికి కూడా పరికరాలు అందలేదు. ఆ ఆర్థిక సంవత్సరంలో కనీస రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇస్తారా..? ఇవ్వరా..? ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు రాయితీ బిందు, సూక్ష్మ సేద్య పరికాలపై ఆశలు వదులుకొని అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో రూ.185 కోట్లకు పైగా బకాయి
డ్రిప్ పరికరాలపై 5 ఎకరాల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ గరిష్టంగా రూ.2 లక్షలు, ఇతర రైతులకు 90 శాతం గరిష్టంగా రూ.2 లక్షలు, 5-10 ఎకరాల మధ్య రైతులకు 90 శాతం సబ్సిడీ గరిష్టంగా రూ.2.80 లక్షలు, 10 ఎకరాలు పైబడి పెద్ద రైతులకు 50 శాతం రాయితీ గరిష్టంగా రూ.4 లక్షలు ఇస్తున్నారు. స్ర్పింక్లర్లకు భూమి పరిమితి లేకుండా అన్ని క్యాటగిరీల రైతులకు 50 శాతం రాయితీ గరిష్టంగా రూ.4 లక్షలు ఇస్తారు. ఒక రైతుకు ఒక యూనిటే. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సూక్ష్మ సేద్యం పరికరాల పంపిణీ సజావుగా సాగింది. జిల్లాలో అనుమతి పొందిన 34 మైక్రో ఇరిగేషన్ కంపెనీలు రైతులు డీడీలు కట్టిన తక్షణమే అవసరమైన పరికరాలు సరఫరా చేసేవి. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ కంపెనీలకు రూ.185 కోట్లకు పైగా బకాయి చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప పరికరాలు సరఫరా చేయలేమని ఆ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
రివర్స్ టెండర్లకు సన్నాహాలు
రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిల జోలికి వెళ్లకుండా ఈ ఏడాది నుంచి సూక్ష్మ సేద్య పథకం అమలు కోసం కంపెనీల నుంచి రివర్స్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఆ ఫైల్ ఆర్థిక శాఖలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగానే రివర్స్ టెండర్లకు ప్రభుత్వం సన్నాహాలు చేయనుందని సమాచారం.
అప్పు చేసి డీడీలు కట్టాను
- గోపాల్‌రెడ్డి, అరటి రైతు, లింగాల
నాకు 8.30 ఎకరాల పొలం ఉంది. అరటి పంట వేశాను. ఏడాదిన్నర క్రితం బిందు సేద్యం పరికరాల కోసం రూ.50 వేలు అప్పు చేసి బ్యాంకులో డీడీ తీసీ ఏపీఎంఐపీ అనుమతి పొందిన కంపెనీకి చెల్లించాను. ఇంతవరకు పరికరాలు ఇవ్వలేదు. పంటకు తడి ఇవ్వాల్సి రావడంతో మరో రూ.80 వేలు అప్పు చేసి ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేశాను.
ఈ ఏడాది ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు
- మదుసూధన్‌రెడ్డి, డీడీ, ఏపీఎంఐపీ, కడప
గత ఏడాది ఒక్క రైతుకు కూడా డ్రిప్ ఇవ్వని మాట నిజమే. 2019-20లో డీడీలు తీసిన 2,204 మంది రైతులకు సంబంధించి 3,080.62 హెక్టార్లకు, 2020-21లో డీడీలు తీసిన 542 మంది రైతులకు 484 హెక్టార్లకు డ్రిప్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం రివర్స్ టెండర్లు పూర్తి చేసి ఈ ఏడాది సరఫరా చేస్తుంది.
Updated Date - 2021-06-07T05:30:00+05:30 IST