కోత దశలో... వరి, ఉల్లి, మినుముకు తీవ్ర నష్టం
ABN, First Publish Date - 2021-10-30T05:24:41+05:30
కలసపాడు మండల వ్యాప్తంగా శుక్రవారం కురిసిన అకాల వర్షంతో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి.
కలసపాడు, అక్టోబరు 29: కలసపాడు మండల వ్యాప్తంగా శుక్రవారం కురిసిన అకాల వర్షంతో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. మండలంలో ఐదువేల ఎకరాల్లో వరి, 600 ఎకరాల్లో ఉల్లి, 1000 ఎకరాల్లో మినుము సాగు చేశారు. చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట ఒక్కసారిగా కురిసిన వర్షానికి నీటమునిగింది. ఇప్పటికే కోసి కుప్పలు వేసిన మినుముపైకి నీరు పారడంతో ఇవి మొలకలు వచ్చే అవకాశం ఉంది. ఉల్లి పంట గడ్డ పెరికే దశలో ఉంది. సాళ్లలో నీళ్లు నిలవడంతో పంటకు బొడ్డుకుళ్లు వచ్చే అవకాశం ఉందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికి రూ.25 వేలు, ఉల్లికి రూ.20వేలు, మినుముకు రూ.15వేలకు పైగా వెచ్చించి సాగు చేశామని, పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతన్నలు వాపోతున్నారు. వ్యవసాయాధికారులు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Updated Date - 2021-10-30T05:24:41+05:30 IST