రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి
ABN, First Publish Date - 2021-10-21T09:06:02+05:30
అరాచక పరిస్థితులు నెలకొన్న ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- డ్రగ్స్‌పై మాట్లాడితే ఆఫీస్ ధ్వంసం చేశారు
- దాడులపై సీబీఐతో దర్యాప్తు చేయించండి
- రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి
- మాజీ సీఎం చంద్రబాబు 39 పేజీల లేఖ
- దాడుల ఫొటోలు, వార్తలు, వీడియోల జత
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అరాచక పరిస్థితులు నెలకొన్న ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పునరుద్ధరించి రాజ్యాంగ బద్ధ పాలన నెలకొనేలా చేయడానికి మరో మార్గం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 39 పేజీలతో కూడిన లేఖలు రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, కొన్ని జిల్లాల కార్యాలయాలపై అధికార వైసీపీ కార్యకర్తలు దాడులు చేసిన నేపథ్యంలో చంద్రబాబు రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులకు సంబంధించి పలు ఫొటోలు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వీడియోలను జతచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సాగు, రవాణా, వ్యాపారం, వాడకం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితిని ఎత్తి చూపినందుకు ఆగ్రహంతో ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని, అధికారం అండతో జరిగిన ఈ దాడికి పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు.
దాడులు ఉద్దేశ పూర్వకమే!
‘‘ఈ దాడులు అనుకోకుండా జరిగినవి కావు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక సంస్ధలైన రాజకీయ పార్టీలు, శాసన, న్యాయ, అధికార వ్యవస్థ, మీడియాపై అధికార పార్టీ తెగబడి దాడులు చేస్తోంది. దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఈ దాడులు జరిగాయి. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు స్తంభించాయి. రాష్ట్రపతి పాలన విధించడానికి ఇంతకంటే అర్హమైన పరిస్థితి మరొకటి ఉండబోదు. అందుకే రాష్ట్రపతి పాలనను కోరుతున్నాం’’ అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.
ఇప్పటి వరకు జరగలేదు
దేశ చరిత్రలో అధికార పార్టీ గూండాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం ఇంతవరకూ జరగలేదని, ఆ రికార్డు కూడా వైసీపీ పాలనలో ఈ రాష్ట్రానికే దక్కిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ‘‘మా కార్యాలయం పోలీస్ డీజీపీ కార్యాలయానికి కిలోమీటరు దూరంలోనే ఉంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలోపే ఉంది. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కూడా ఒక కిలోమీటర్ లోపులోనే ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీ కార్యాలయంపైకి వందల మంది గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ పెరిగిపోవడంపై టీడీపీ ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాతే దాడులు జరిగాయని చంద్రబాబు తెలిపారు.
త్వరలో ఢిల్లీకి చంద్రబాబు
రాష్ట్రపతి, అమిత్ షాలకు ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో భేటీ కానున్నారు. పార్టీ తరఫున ఇప్పటికే వీరి అప్పాయింట్‌మెంట్లు కోరుతూ.. విజ్ఞప్తులు పంపించారు. అప్పాయింట్‌మెంట్లు ఖరారు కాగానే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులకు నిరసనగా గురువారం ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలతో దీక్ష ముగుస్తుంది. అనంతరం, చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నారు.
Updated Date - 2021-10-21T09:06:02+05:30 IST