రచయిత్రి ఓల్గాకు గౌరవ డాక్టరేట్
ABN, First Publish Date - 2021-08-24T09:59:00+05:30
ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా (పోపూరి లలిత కుమారి)కి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 25న
పద్మావతి మహిళా వర్సిటీ ప్రకటన.. రేపు ప్రదానం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 23: ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా (పోపూరి లలిత కుమారి)కి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 25న వర్సిటీలో నిర్వహించే 18వ స్నాతకోత్సవంలో ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు వీసీ జమున సోమవారం ప్రకటన చేశారు. మహిళా సమస్యలపై గళం విప్పడంతో పాటు సాహిత్య రంగంలోనూ ఓల్గా విశేష కృషి చేశారు. దీనికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ లభించింది. గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లెకి చెందిన ఓల్గా... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. తెనాలిలోని వీఎ్‌సఆర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనలతో ప్రభావితమై అనేక స్త్రీవాద రచనలు చేశారు. ఈమె రాసిన స్వేచ్ఛ నవల పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది.
అస్మిత సంస్థ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పని చేసిన ఆమె... అనేక మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈమె రాసిన 12 రచనలను అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ తన జాబితాలో పొందుపర్చింది. ఓల్గా రాసిన ఆకాశంలో సగం అనే నవల, రాజకీయ కథలు, విముక్త కథలు సంచలనం రేకెత్తించాయి. 1998లో ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు, 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ స్త్రీవాద రచయిత్రి పురస్కారం, 2014లో లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాలను స్వీకరించారు. ఓల్గా రాసిన విముక్త కథల సంపుటికి 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
Updated Date - 2021-08-24T09:59:00+05:30 IST