ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెపై పెత్తనానికి నో

ABN, First Publish Date - 2021-07-13T07:15:52+05:30

పల్లెపై పెత్తనానికి నో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా జీవో 2

దీంతో పంచాయతీలు కీలు బొమ్మలే

సర్పంచ్‌, కార్యదర్శుల  అధికారాలు వీఆర్వోలకు బదిలీ కుదరదు

తేల్చి చెప్పిన హైకోర్టు

ఆ జీవోతో పరిపాలనా సహాయకులపై

సర్పంచ్‌లకు నియంత్రణ ఉండదు

పథకాలు, కార్యక్రమాల అమలుపై

తీవ్ర ప్రభావం పడుతుంది

పంచాయతీల స్వయం ప్రతిపత్తికి నష్టం

73వ రాజ్యాంగ సవరణ లక్ష్యానికే దెబ్బ

పంచాయతీలు, గ్రామ సచివాలయాలు

వేర్వేరని ప్రభుత్వం భావిస్తోంది

ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు

జీవో 2ను సస్పెండ్‌ చేస్తూ

మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ధర్మాసనం

కౌంటర్‌ దాఖలుకు సర్కారుకు ఆదేశం

విచారణ నాలుగు వారాలకు వాయిదా



గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలను ప్రభుత్వం లాగేసుకునేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి.

సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలు తొలగిస్తే గ్రామ సచివాలయాల్లోని పరిపాలనా సహాయకులపై వారికి ఎలాంటి నియంత్రణా ఉండదు. దీనివల్ల వివిధ కార్యక్రమాలు, పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది రాజ్యాంగంలోని 73వ సవరణ ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది.

జీవో నంబర్‌ 2లోని భాషను పరిశీలిస్తే.. గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీలు వేర్వేరని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. పంచాయతీ పరిపాలన, విధులను 

రాష్ట్రప్రభుత్వం ఆక్రమించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

- హైకోర్టు


అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాల్లో కొన్నిటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది. సదరు అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన జీవో 2 అమలును నిలుపుదల చేసింది. గ్రామాల్లో సమాంతర అధికార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్న పిటిషనర్‌ వాదనలో వాస్తవం ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 40, 243(జి)తో పాటు ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 4(2) కింద జారీచేసిన 110, 149 జీవోలను రెండో నంబరు జీవో ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ జీవోను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యను అనుమతిస్తే గ్రామ పంచాయతీలు స్వయంప్రతిపత్తి కోల్పోతాయని.. అవి అధికారులు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారతాయని స్పష్టం చేశారు.


సర్పంచ్‌లు నామమాత్రమయ్యారు..

సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని గుంటూరు జిల్లా తోకలవాని పాలెం సర్పంచ్‌ టి.కృష్ణమోహన్‌ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ‘సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలను హరించేలా ఈ జీవో ఉంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్వోలకు అధికారాలు అప్పగించారు. సర్పంచ్‌లు నామమాత్రమయ్యారు. సదరు ఉత్తర్వులు రాజ్యాంగంలోని 73వ సవరణకు, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి’ అని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసేందుకే గ్రామసచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిందని తెలిపారు. జీవో ద్వారా వీఆర్వోలకు చెక్‌ డిస్‌బర్సింగ్‌ పవర్‌, వారి ద్వారా సెలవుల మంజూరు దరఖాస్తు పంపేలా అధికారాన్ని కల్పించామని, ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని కొనసాగనివ్వాలని కోరారు. వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. సోమవారం తీర్పు వెలువరించారు. 


తీర్పులో ఏముందంటే..

‘ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సమస్యల పరిష్కారం లక్ష్యంతో ప్రభుత్వం నవరత్నాలను తీసుకొచ్చింది. వాటిని అమలు చేసేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2019 జూలై 19 ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 110లో గ్రామ సచివాలయ ఏర్పాటు ఉద్దేశాన్ని తెలియజేసింది. గ్రామ సచివాలయ సిబ్బంది జీతాలు, అలవెన్స్‌ల చెల్లింపులో పంచాయతీ కార్యదర్శి డ్రాయింగ్‌-డి్‌సబర్సింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొంది. గ్రామ వలంటీర్ల గౌరవ వేతనం కూడా ఆయనే చెల్లిస్తారని అందులో తెలిపింది. సిబ్బందికి సాధారణ సెలవుల మంజూరు అధికారాన్ని గ్రామ సర్పంచ్‌లకు కల్పించారు. తదనతరం పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసిన జీవో 149లో.. గ్రామ పంచాయతీలనే గ్రామ సచివాలయాలుగా పరిగణిస్తారని.. పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అలాంటి అధికారాలు కల్పించడం ద్వారా గ్రామ సచివాలయ పరిపాలనా సహాయకులు గ్రామపంచాయతీకి జవాబుదారీగా ఉండేలా చూడడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అయితే ఈ ఏడాది మార్చి 25న తీసుకొచ్చిన జీవో 2 ద్వారా సర్పంచ్‌, కార్యదర్శిల కార్యనిర్వహక, పరిపాలనా విధులను సవరించినట్లు స్పష్టమవుతోంది.


 పంచాయతీలు, సచివాలయాల మధ్య సమన్వయం పెంచడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్వులు సవరించినట్లు పేర్కొన్నారు. ఆ జీవోలోని భాషను పరిశీలిస్తే.. గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీలు వేర్వేరన్నది రాష్ట్రప్రభుత్వ భావనగా అర్థమవుతోంది. ఇది గ్రామ సచివాలయాల ఏర్పాటు ఉద్దేశాలు, లక్ష్యాలకు విరుద్ధం. గ్రామ పంచాయతీల పరిపాలన, విధులను ప్రభుత్వం ఆక్రమించిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో జీవో 2ని సస్పెండ్‌ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2021-07-13T07:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising