తిరుపతి వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి
ABN, First Publish Date - 2021-03-17T08:42:23+05:30
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును సీఎం వైఎస్ జగన్
వ్యక్తిగత ఫిజియోను ఖరారు చేసిన సీఎం
టీడీపీ తరఫున పనబాక ముందే ఖరారు
బీజేపీ-సేన అభ్యర్థిపై రాని స్పష్టత
తిరుపతి ఉప ఎన్నికకు పార్టీలు సమాయత్తం
ఉప ఎన్నికకు పార్టీలు సమాయత్తం
అమరావతి/నెల్లూరు/తిరుపతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గురుమూర్తిని తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ తొలిగా చెప్పిన విషయం విదితమే. ఇంకోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును కొద్దినెలల కిందటే ప్రకటించారు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఖరారుచేయలేదు. తమ మద్దతుతో బీజేపీయే ఇక్కడ బరిలో ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీపీఎం కూడా మంగళవారమే తన అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరు యాదగిరిని ఎంపిక చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు తిరుపతిలో ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు.. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేడి తగ్గకముందే తిరుపతి ఉప ఎన్నిక రూపంలో ఈ రెండు జిల్లాల్లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల సమారానికి రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.
మూడు నెలల నుంచే..
నిజానికి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ మూడు నెలల కిందే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థిని ముందే ప్రకటించింది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఎన్నికల బాధ్యులను నిర్ణయించింది. పనబాక ఇప్పటికే 2-3 సార్లు చిత్తూరు, నెల్లూరు జిల్లాల టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికలపై చర్చించారు. అధికార పార్టీ వైసీపీ కూడా ఉప ఎన్నికల సన్నాహాలు ఇదివరకే పూర్తి చేసుకుంది. ఇంకోవైపు.. అభ్యర్థిపై నాయకుల అభిప్రాయాలు బీజేపీ సేకరించింది. ఒకరిద్దరు విశ్రాంత ఐఏఎ్‌సల పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. ఇంకా నిర్ణయమూ తీసుకోలేదు.
Updated Date - 2021-03-17T08:42:23+05:30 IST