ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ చెదిరింది

ABN, First Publish Date - 2021-09-12T05:34:38+05:30

కళల ఖిల్లాగా గుంటూరు జిల్లా పేరొందింది. కళారంగం ఇక్కడ మూడు పూలు.. ఆరుకాయల్లా వెలుగొందింది.

తెనాలి కళాక్షేత్రంలో గతంలో కన్యాశుల్కం నాటకం ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళారంగంపై కరోనా కాటు!

ఉపాధి కోల్పోయిన కళాకారులు

ఏడాదిన్నరగా ప్రదర్శనలు లేవు..

బోసిపోతున్న కళానిలయాలు

దిక్కుతోచని స్థితిలో వృత్తి కళాకారులు 

ఆపన్నహస్తాల కోసం ఎదురుచూపులు 

  

ఆరున్నొక్క శృతిలో వినిపించే పద్యం గాత్రం నేడు మూగబోయింది. కళాకారులు మొఖానికి రంగులు వేసుకుని ఎన్ని రోజులైందో..?  నర్తకీమణులు కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఏడాదిన్నరపైగానే అయింది.. కరోనా మహమ్మారి కళారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గత రెండేళ్లుగా జాతరలు, ఉత్సవాలు లేవు... శ్రవణానందం చేసే పద్య నాటకాలు కరువయ్యాయి.. పరిషత్‌ నాటకాల ప్రసక్తే లేదు. సంగీత విభావరిల ఊసే లేదు. మువ్వల సవ్వడి.. వినిపించడం లేదు. కరోనా ప్రభావంతో కళారంగం కుదేలైంది. తమ తమ కళా నైపుణ్యాలతో ప్రజలను అలరిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఎందరో తమ భుక్తిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆడిటోరియాలు బోసిపోతున్నాయి.  

గుంటూరు (సాంస్కృతికం), నరసరావుపేట కల్చరల్‌, తెనాలిటౌన్‌, సెప్టెంబర్‌ 11: కళల ఖిల్లాగా గుంటూరు జిల్లా పేరొందింది.  కళారంగం ఇక్కడ మూడు  పూలు.. ఆరుకాయల్లా వెలుగొందింది. పద్యనాటకాలు, పరిషత్‌ నాటికలు, నృత్య ప్రదర్శనలు, పాటకచేరీలు.. ఒకటేమిటి ఎప్పుడూ ఏదో ప్రదర్శనతో థియేటర్లు కళకళలాడుతూ ఉండేవి. కరోనా మహమ్మారి కళారంగం పైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. అన్నిరంగాల్లాగే కొవిడ్‌.. ఈ కళారంగాన్ని అతలాకుతలం చేసింది. నిబంధన కారణంగా ప్రదర్శనలు లేవు.. పైగా ఎంతోమంది కళాకారులను కూడా పొట్టపెట్టుకుంది. గుంటూరు నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరం, బృందావన్‌ గార్డెన్స్‌ అన్నమయ్య కళావేదిక, అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజ ఆడిటోరియం, ఏకాదండయ్య పంతులు హాలు.. వీటిలో రోజూ ఏదో ఒక ప్రదర్శనతో కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడవన్నీ వెలవెలబోతున్నాయి.  

 

కళల కాణాచి తెనాలిలో.. 

 కళల రాజధాని తెనాలి. దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం తెనాలి కళాకారుల ప్రదర్శనలు ఉండేవి. ఇప్పుడు తెనాలిలో కూడా కరోనా రక్కసి చిమ్మిన విషానికి కళలు వెలవెలబోతున్నాయి. పద్య, పౌరాణిక, సాఘిక నాటకాల్లో నటించే ఇక్కడివారు 400మందికి పైగానే ఉన్నారు. భరతనాట్యం, కూచిపూడి సమాజాలు పదికి పైగా ఉన్నాయి. పేరొందిన బ్యాండ్‌ సమాజాలు 10వరకు ఉన్నాయి. వీరందరికీ ప్రస్తుతం పనిలేదు. నిత్యం ప్రేక్షకులతో సందడిగా కనిపించే కళాక్షేత్రాలు బోసిపోతున్నాయి. కళాకారుల ముఖాల్లో ఆనందం చూసి రెండేళ్లు కావస్తోంది. కళమీదే ఆధారపడి, కళనే జీవితంగా చేసుకున్న వృత్తి కళాకారుల జీవితాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. దీనికితోడు కరోనా సోకిన కుటుంబాల బాధలు వర్ణనాతీతం. ఆధునిక హంగులతో నిర్మించిన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ఎటువంటి ప్రదర్శనలు లేక వెలవెలబోతుంది. సంవత్సరానికి 100కు పైగా నాటకాలు ప్రదర్శించిన ఈ క్షేత్రంలో కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంలో ఒక్క ప్రదర్శనకూ నోచుకోలేదు. 


ఆపన్న హస్తాల కోసం ఎదురుచూపులు

జ్యోతి, విజయశ్రీ, సుబ్బారావు, తులసి, విజయదుర్గ, విజయ, వెంకటేశ్వరరావు.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే వందకు తగ్గరు. నిత్యం ముఖానికి రంగేసుకుంటేనే నోట్లోకి ముద్ద దిగుతుందనుకునే కళాకారులకు ఇప్పుడు చూద్దామన్నా ప్రదర్శనలు లేవు. బ్యాండ్‌ కళాకారులు, పాటలు పాడే కళాకారులు గత ఏడాదిన్నరగా ఎటువంటి శుభకార్యాలు, వేడుకలు లేక చేతికి చిల్లి గవ్వ రాక చితికిపోయి ఉన్నారు. ఏదో కొద్దిమంది కళాకారులకు కొందరు దాతలు తొలి విడత బియ్యం, నిత్యావసర వస్తువులు సాయం చేసినా అవి రెండు మూడు నెలలకే పరిమితమయ్యాయి. విభిన్న కళారూపాల్లో నిష్ణాతులైన 600మందికి పైగా కళాకారులు తెనాలి కళాకారుల సంఘంలో సభ్యులుగా ఉన్నారు. నటీమణులు నెలకు కనీసం రూ.10వేలకు పైగానే సంపాదించుకునే వారు. అటువంటిది ప్రపంచాన్ని  కరోనా ఆవహించాక  ఒక్క ప్రదర్శనా చేయలేదు. ఒక్కరూపాయి సంపాదించుకోలేదు. ప్రభుత్వాలు సైతం వీరి ఊసే ఎత్తలేదు. ఆదుకునే వారి కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఇకనైనా ప్రదర్శనలకు అవకాశమిస్తే తాము బతుకుతామని వారు ఆవేదనతో వేడుకుంటున్నారు. 


నరసరావుపేట పట్టణంలో..   

నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాల్‌ నాటక ప్రదర్శనలకు, సంగీత సాహిత్య కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. నెల వారి కార్యక్రమాలతో నాటక ప్రదర్శనలతో, సంగీత కచేరీలతో పట్టణ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అలాంటిది కొవిడ్‌ వలన ఏడాదిన్నరగా నాటక ప్రదర్శనలు లేవు. గత ఏడాది ఫిబ్రవరిలో రంగస్థలి ఆధ్వర్యంలో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మూడురోజుల పాటు ప్రదర్శించిన వివిధ నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఇక అదే ఆఖరు. మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించటంతో టౌన్‌హాల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా టౌన్‌హాల్‌లో నాటక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రేక్షకులు కోరుతున్నారు. టౌన్‌హాల్‌కు మునుపటి వైభవం తీసుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. 

 

 కళాకారుడి కష్టం చెప్పుకోలేనిది..

నిత్యం ఎందరినో ఆనందింపజేసే కళాకారుడు కరోనా విపత్తుతో మూగబోయాడు. కళాకారుడు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధను రంగస్థలంపై చక్కగా చెప్పగలడు కానీ తన కష్టాన్ని చెప్పుకోలేడు. నిత్యం కళా ప్రదర్శనలతో సందడిగా ఉండే తెనాలి గడ్డ గత ఏడాదిన్నరగా  కరోనాతో బోసిపోయింది. త్వరలో మంచిరోజులు రావాలని కోరుకుంటున్నాం.

- ఎం.సత్యనారాయణ శెట్టి, అధ్యక్షుడు, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం 


గొంతులు మూగబోయాయి

కళాకారుల గొంతులు ప్రదర్శనలు లేక మూగబోయాయి. పైసా సంపాదన లేదు. గతంలో ఏదన్నా కొద్దిపాటి సంపాదనను కూడబెట్టుకున్న వారున్నా ఉన్నదంతా ఖర్చుపెడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కళాకారుడికి ముఖానికి రంగేసుకుని రంగస్థలం కాలుమోపకపోతే సర్వస్వం కోల్పోయినట్లుగా ఉంటుంది. కళాకారులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు సైతం ముందుకు రావడం లేదు. 

- దేవిశెట్టి కృష్ణారావు, సీనియర్‌ రంగస్థల నటులు  

 

గాయకులకు ఉపాధి కరువు..

అన్నదాన సమాజం ఆడిటోరియంలో నెలకు నాలుగైదు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవాళ్ళం. దీంతో కళాకారులకు కొంత జీవనోపాధి కలిగేది. కరోనా ప్రభావంతో నేడు కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నాం. దీంతో కళాకారులు జీవనోపాధి కోల్పోయారు. కార్యక్రమాలను తిలకించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 

- మిరియాల ప్రసాదరావు, భారతీ సాంస్కృతిక సంగీత కళావేదిక వ్యవస్ధాపక అధ్యక్షుడు, గుంటూరు  

 

మూతపడే పరిస్థితులు..

 గతంలో దాతల, కళాపోషకుల సౌజన్యంతో ఎన్నో మహత్తర కార్యక్రమాలు నిర్వహించాం. ప్రస్తుత పరిస్థితులలో దాతల సహాయ సహకారాలు కరువయ్యాయి. ఎప్పుడూ సాంస్కృతిక  కార్యక్రమాలతో ప్రదర్శనశాలలు రద్దీగా ఉండేవి. ఇలాగే కొనసాగితే కళాసంస్థలు మూతపడే ప్రమాదం ఏర్పడుతోంది. 

 - పొత్తూరి రంగారావు, అమరావతి కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు 


 


Updated Date - 2021-09-12T05:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising