ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషజ్వరాలతో.. విలవిల

ABN, First Publish Date - 2021-10-02T05:53:15+05:30

జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఏటా కంటే ఈ ఏడాది ఆరు రెట్ల ఎక్కువ కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి.

అమరావతి కమ్యూనిటీ వైద్యశాలలో రోగులతో నిండిన బెడ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వారం వ్యవధిలో వినుకొండలో ముగ్గురు చిన్నారుల మృతి

ఆరేళ్లలో ఉధృత స్థాయిలో డెంగ్యూ

ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలు

జీజీహెచ్‌లోనూ సరిపడా లేని బెడ్లు

ప్రైవేటు వైద్యశాలల్లో వేలల్లో ఖర్చు

  

జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి.. వేలాదిమంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ విజృంభిస్తోంది. గతంలో కంటే ఈ ఏడాది ఆరు రెట్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్య వర్గాలే చెబుతున్నాయి. స్థోమత ఉన్నవారు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తుండగా.. పేదలు సర్కారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.  ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సరిపడా బెడ్లు లేవు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం.. పారిశుధ్య నిర్వహణలో లోపాలు జ్వరాల పెరుగుదలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. 


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు1: జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఏటా కంటే ఈ ఏడాది ఆరు రెట్ల ఎక్కువ కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. మొదటి నెలరోజులు పెద్దలపై ప్రభావం చూపించగా 15 రోజుల నుంచి చిన్నారులపై పంజా విసురుతోంది.  వినుకొండ ప్రాంతంలో వారం వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం ఇందుకు ఉదాహరణ. ప్రతి డెంగ్యూ సీజన్‌లోనూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు నాలుగైదు కేసుల నమోదవుతాయి. గతం వారం నుంచి రోజూ 30 డెంగ్యూ లక్షణాల కేసులు వస్తున్నాయి. వీరిలో నలుగురైదుగురు ఐసీయూకి వెళ్లే పరిస్థితి ఉంది.  సరాసరి ఒక చిన్నారి మృత్యువాత పడుతోంది. 


వాతావరణ మార్పులే కారణం!

నాలుగేళ్ల తర్వాత డెంగీ పెద్దఎత్తున ప్రబలేందుకు ప్రదాన కారణం వాతావరణంలో మార్పులేనని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు ప్రకటించారు. జూన్‌ మాసంలో ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్‌ మాసాంతం వరకు అడపా దడపా కురుస్తూనే ఉన్నాయి. దీంతో వర్షం నీరు పలు చోట్ల నిలిచి డెంగీకి కారణమయ్యే ఈడీస్‌ ఈజిప్టై దోమల సంతతి వృద్ధి చెందేందుకు కారణమైనట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది. డెంగీ వైరస్‌లో నాలుగు రకాలు ఉండగా, ప్రస్తుతం జిల్లాలో ప్రమాదకరమైన డెంగీ-2 స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాపిస్తోంది. డెంగీ-2 వైరస్‌తో హెమరేజిక్‌ ఫీవర్‌(రెండో దశ) బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దశలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గి శరీరంలో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి.  


వైద్యం అందని దైన్యం.. 

 డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ప్రజలు హడలిపోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకు వెళితే వేలకు వేలు ఖర్చవుతున్నాయి. అలాగని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వస్తే బెడ్లు లేవు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కో బెడ్డుపై ఇద్దరు రోగులను పడుకోబెడుతున్నారు. దీంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

 

జిల్లాలో పరిస్థితి ఇలా.. 

డివిజన్‌ కేంద్రం తెనాలి ప్రాంతంలో సీజనల్‌ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. సంగంజాగర్లమూడి, కఠెవరం గ్రామాల్లో ఇటీవల ఒక్కో డెంగ్యూ  లక్షణాల కేసులు నమోదయ్యాయి. సంగంజాగర్లమూడి పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడంతో పరీక్షలు జరగడంలేదు. సాధారణ జ్వర పీడితులు జిల్లావైద్యశాలకు రోజూ 15 నుంచి 20 మంది వస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  

అమరావతి మండల వైద్యాధికారుల లెక్కల ప్రకారం నెలరోజుల నుంచి ఇప్పటివరకు నాలుడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి కమ్యూనిటీ వైద్యశాలలో 35బెడ్లు ఖాళీ లేవు. చాలామంది గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలను, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారం రోజుల లోపు డెంగ్యూ లక్షణాలతో వైకుంఠపురంలో ఓ రైతు, ధరణికోటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

గడిచిన నెలలో ఈపూరు మండలంలో ఒకటి, వినుకొండ పట్టణంలో ఒకటి, చీకటీగలపాలెంలో ఒక డెంగ్యూ కేసు, శావల్యాపురం మండలంలో ఒక మలేరియా కేసు నమోదైనట్లు వైద్యాధికారులు అధికారికంగా చెబుతున్నారు. కానీ అనధికారికంగా ప్రైవేటు వైద్యశాలల్లో జ్వరపీడితులు వందల సంఖ్యల్లోనే చేరుతున్నారు. ఇటీవల వినుకొండ పట్టణంలో ముగ్గురు చిన్నారులు విషజ్వరాలతో మరణించారు.  

రెంటచింతల మండలం పాలువాయిలో ఓ చిన్నారి డెంగీ లక్షణాలతో మృతిచెందింది. ఈ మండలంలో జ్వరాలు తీవ్రత అధికంగా ఉంది. దుర్గి మండలంలో గ్రామ గ్రామాన జ్వరపీడితులు అధికంగా ఉన్నారు. కారంపూడి మండలంలో రెండు డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.  

మంగళగిరి నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ సెప్టెంబరు నెలలో నియోజకవర్గంలో మొత్తం 14 డెంగ్యూ లక్షణాల కేసులు నమోదు కాగా, వారిలో ముగ్గురు మృతిచెందారు. ఎర్రబాలెంలో ఓ చిన్నారి, మంగళగిరి పార్కురోడ్డులో ఏడేళ్ల బాలుడు మృతి చెందారు. తాజాగా ఎర్రబాలెం సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న యువతి డెంగ్యూ లక్షణాలతో చికిత్స పొందుతూ రెండు రోజుల కిందటే మృత్యువాత పడింది. ఇంకా పలువురు వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

పిడుగురాళ్ల ప్రాంతంలో మోర్జంపాడు, పిన్నెల్లి, పిడుగురాళ్ల, గుత్తికొండ, బ్రాహ్మణపల్లి, కేశానుపల్లి, మాదినపాడు, గురజాల, దైదా, పులిపాడు, జంగమహేశ్వరపురం గ్రామాల్లో డెంగ్యూ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ వైద్యశాల నివేదికల ప్రకారం గురజాలలో ఐదు, మాచవరంలో 7, పిడుగురాళ్లలో 11, దాచేపల్లిలో ఒకటి డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరు కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో విషజ్వరాలతో వందలమంది చికిత్స పొందుతున్నారు. ఐదురోజుల డెంగ్యూ చికిత్సకు మోర్జంపాడుకు చెందిన ఓ వ్యక్తి సుమారు రూ.70వేలు ఖర్చుచేశారు. 

పొన్నెకల్లు పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో సెప్టెంబరు నెలలో 12 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. తాడికొండలో-5, పొన్నెకల్లులో-2, మోతడక, ముక్కామల, నిడుముక్కల, లచ్చన్నగుడిపూడి, బండారుపల్లి గ్రామాల్లో ఒక్కో డెంగ్యూ కేసు వచ్చాయి. లచ్చన్నగుడిపూడి గ్రామంలో డెంగ్యూ లక్షణాలతో ఒకరు  మృతి చెందారు.  

సత్తెనపల్లి మండల ఫణిదం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లెక్కల ప్రకారం విషజ్వరాల బారిన పడినవారు 44 మంది ఉన్నారు. నకరికల్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డెంగ్యూ బాధితుడు ఒకరు, కుంకలకుంట పీహెచ్‌సీ పరిధిలో ముగ్గురు ఉన్నారు. 

 

పారిశుధ్యం అంతంతమాత్రం.. 

గ్రామాల్లో పారిశుధ్యం అంతంతమాత్రంగా ఉండటంతో దోమలు వ్యాప్తి అధికమై ఆయా గ్రామాల ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి.  వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి పారిశుధ్య లోపమేనని విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులలో డెంగ్యూ చికిత్సకోసం ప్రత్యేక బెడ్‌లను ఏర్పాటు చేయకపోగా, పారిశుధ్యాన్ని మెరుగు పరిచే ఎటువంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నీటి కాలుష్యం కూడా ఇందుకు తోడవుతోంది.  

 

మలం రంగు మారితే అప్రమత్తమవ్వండి..

డెంగ్యూ మరణాలకు అశ్రద్ధ కూడా కారణం. జ్వరం వచ్చిన రోజునే కరోనా పరీక్ష, ప్లేట్లెట్ల పరీక్ష చేయించుకుని అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లల్లో మలం రంగు మారుతుంటే అప్రమత్తమై వెంటనే ఆసుపత్రులు తీసుకు రావాలి. అంతర్గత రక్తస్రావం, ప్రారంభమైనప్పుడే మలం రంగు మారుతుంది. కడుపునొప్పి వాంతులను కూడా అశ్రద్ధ చేయవద్దు. ఈ ఏడాది డెంగ్యూ ప్రమాదకరంగా ఉంది.. మరికొన్ని రోజులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. 

- డాక్టర్‌ పద్మలత, హెచ్‌ఓడీ, ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల విభాగం

  

బొప్పాయితో మేలు..

డెంగీ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బొప్పాయికి డిమాండ్‌ పెరిగింది. అది తింటే రక్తంలో ప్లేట్‌లెట్లు పెంచుతాయనే వైద్యవర్గాలు కూడా చెప్పడమే ఇందుకు కారణం. బొప్పాయి రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయని కూడా వైద్యవర్గాలు ప్రకటించడం విశేషం. బొప్పాయి ముక్కలు, బొప్పాయి ఆకురసం తాగితే రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయని తెలియడంతో ప్రజలు వీటి కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో బొప్పాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుంటూరు నగరంలోని కొన్ని ఆసుపత్రుల్లో సైతం డెంగీ వైద్యం కోసం చేరిన రోగులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వయంగా వైద్యసిబ్బంది బొప్పాయి ముక్కలను అల్పాహారంగా ఇవ్వడం గమనార్హం.  

 

మనమేం చేయాలి..

ఇంటి పరిసర ప్రాంతాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, వాడి పడేసిన టైర్లను దూరంగా పడేయాలి. కూలర్లు, తొట్టెల్లో నీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.   

 

 

 


Updated Date - 2021-10-02T05:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising