బేరాలు.. బెదిరింపులు
ABN, First Publish Date - 2021-02-03T05:53:52+05:30
పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు నేతల బేరాలు.. బెదిరింపులతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.
పంచాయతీల ఏకగ్రీవానికి అధికార ఎత్తులు
నామినేషన్ల ఉపసంహరణకు పదవులు, డబ్బులు ఎర
కొన్ని దగ్గర్ల గ్రామాల బయట తలదాచుకుంటున్న అభ్యర్థులు
మాట వినకపోతే పాత కేసులు బయటకు తీసి పోలీసుల సహకారం
పోలీసులే బెదిరించారని ఎస్‌ఈసీకి ఓ అభ్యర్థి ఫిర్యాదు
వీడియోలు, ఆడియోలు వైరల్ అవుతున్నా పట్టించుకోని పోలీసులు
తమ్ముడూ నీకేం కావాలో చెప్పు. పంచాయతీ ఏకగ్రీవం ముఖ్యం. నామినేషన్ ఉపసంహరించుకుంటే పసుపు యార్డు డైరెక్టర్ పదవి ఇప్పిస్తాం. లేదంటే రూ.2 లక్షలు ఇస్తాం. నేను జడ్పీటీసీ అభ్యర్థిని. హోంమంత్రి కజిన్‌నే, జిల్లా కలెక్టర్ పోస్టు కూడా వేయించా. చిన్నఫంక్షన్ పెడితే మా ఇంటికి వచ్చి గంట కూర్చున్నారు. రూ.25 కోట్లు స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయించా. జీవితాంతం డైరెక్టర్ అనే పేరుంటుంది. మన ఊరికి డబుల్ రోడ్డు వస్తుంది. ఒప్పుకోకపోతే పోలీసులు పట్టుకెళితే విడిపించేవారుండరు. ఆలోచించుకో.
- దుగ్గిరాల మండలం ఈమనిలో ఓ వార్డు అభ్యర్థి ఇంటికే వచ్చి అధికార పార్టీ నేత బెదిరింపు
-----------------
ఏంట్రా ఎక్కడో ఉండి అల్లర్లు రేపుతున్నావ్. ముందు నువ్వు స్టేషన్‌కు రా. లేకపోతే కేసు బుక్ చేస్తాం. రాలేనంటే కుదరదు. మేమొస్తే నీ పని అయిపోతుంది. సాయంత్రంలోపు నువ్వు స్టేషన్‌లో ఉండాల్సిందే.
- చుండూరు మండలంలో ఓ అభ్యర్థికి పోలీసుల హెచ్చరిక
------------
- గ్రామానికి రోడ్డు కావాలా. నువ్వు తప్పుకుని మనోడిని గెలిపిస్తే డబుల్ రోడ్డు వేయిస్తాం. కాదు.. ఇంకేదైనా కావాలంటే మొహమాటం లేకుండా అడుగు. నీ కోర్కె తీర్చుతాం.
- తీర గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థితో బేరాలు.
పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు వార్డుల ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నాయకులు కొందరు బేరాలు, బెదిరింపులకు దిగుతున్నారు. అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రతి పక్ష మద్దతు అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోంది. తెనాలి డివిజన్‌లో అభ్యంతరాల పరిశీలన జరుగుతుండగా, నరసరావుపేట డివిజన్‌లో నామినేషన్ల పర్వం మంగళవారం ప్రారంభమైంది. అయితే ఇప్పటికే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి నయానో భయానో తమవర్గీయులకు అడ్డం లేకుండా పోటీలో ఉన్న వారిని తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బెదిరింపుల వీడియోలు, వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు.
నరసరావుపేట, తెనాలి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు నేతల బేరాలు.. బెదిరింపులతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అవకాశం ఉంటే బేరాలు, దిగిరాకుంటే బెదిరింపులకు వెనుకాడటంలేదు. గతంలో చేసిన పనుల బిల్లులు చెల్లించాలంటే పోటీ చేయకూడదని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. తెనాలి డివిజన్‌లో నామినేషన్ల ఉపసంహరణకు ఇక రెండు రోజులే గడువు ఉంది. డివిజన్‌లో మొత్తం 9,500 నామినేషన్లు పరిశీలన దశలో ఉండగా వాటిల్లో ఇప్పటికే కొన్నింటిని తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు ఎత్తులు వేశారు. సక్రమంగా నామినేషన్లు ఉన్న వారిని బెదిరించి లేదంటే పాత కేసులను బయటకు తీసి, పోలీసుల ద్వారా ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇలాంటి బెదిరింపులతో కొన్ని గ్రామాల్లో టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులు ఏకంగా గ్రామాలు వదిలి వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో తెనాలి డివిజన్‌లో శాంతియుతంగా ఎన్నికలు ముగుస్తాయనుకుంటే చివరకు ఊహించని రీతిలో పరిస్థితులు మారుతున్నాయి. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు, చుక్కపల్లివారిపాలెం పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి కోసం కాకుండా వార్డు సభ్యుల ఏకగ్రీవాలకే భారీ ఆఫర్‌లు ఆశచూపటం ప్రస్తుతం సాంఘిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఓ అధికార పార్టీ నేత తన అనుచరులతో ఓ వార్డు సభ్యుడి ఇంటికే వెళ్లి నేరుగా బేరాలాడటం కొసమెరుపు. మరో చోటైతే గ్రామానికి డబుల్ రోడ్డు వేయిస్తానని, గతంలో సమితి ఉన్నప్పుడు ఎంత వైభవంగా గ్రామాలుండేవో అంతటి స్థాయిని తీసుకొస్తానని, పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్యే దగ్గర చెప్పుకోడానికి ఉంటుంది.. నీకుకూడా గ్రామానికి చేసిన తృప్తి ఉంటుందంటూ ఆశచూపటం కొసమెరుపు. ఇదే తరహాలో కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, తెనాలి, రేపల్లె, నగరం మండలాల్లో తాయిలాలతో ఉపసంహరణల బేరాలు సాగుతూనే ఉన్నాయని సమాచారం. ప్రభుత్వం ఇంకా మూడేళ్లుపైనే అధికారంలో ఉంటుంది.. పెద్దలతో గొడవలెందుకు! వారు చెప్పినట్టు తప్పుకుంటే పోలా! లేదంటే కేసుల్లో ఇరికిస్తారు.. ఇబ్బందులు ఎందుకు తెచ్చిపెట్టుకోవడం.. అంటూ కొందరు అధికారులే మంతనాలు సాగించేందుకు సిద్ధమయ్యారు. చుండూరు మండలంలో ఓ పంచాయతీ ఏకగ్రీవానికి సంబంధించి తనపై నామినేషన్ కూడా వేయనివ్వకుండా బెదిరింపులకు దిగారని, ఓ కానిస్టేబుల్, ఎస్‌ఐలే ఫోన్‌లో బెదిరించారనే ఆధారాలతో ఎన్నికల సంఘానికి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తాను నామినేషన్ కూడా వేయలేదని, గ్రామం వదిలేసి బయట తలదాచుకుంటున్నానని బాధితుడు మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. నిజాంపట్నం మండలంలోని 18 మండలాలూ ఏకగ్రీవం కావాలనే విధంగా హుకుం జారీ చేసినట్టు తెలిసింది. కొల్లూరు మండలంలో యాదవపాలెంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి బెదిరింపులు వచ్చినట్టు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరికొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను బెదిరించేందుకు సిద్ధమమయ్యారు. ఇందుకు కొందరు అంగీకరిస్తే, ఎక్కువ శాతం మంది తామే ఎదురు డబ్బిస్తామని, మీరే తప్పుకోవాలనే వాదనకు దిగారు. దీంతో ఇలాంటి వారికి పోలీసులతో బెదిరింపులు చేయిస్తున్నట్లు సమాచారం. బాపట్ల, పొన్నూరు, నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ చాలా గ్రామాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. మంగళవారం వరకు బేరాలు, బతిమాలటం, బెదిరింపులతో ఏకగ్రీవాలకు ప్రయత్నాలు సాగించి, చివరకు దారికి రానివారిని పోలీసులకు అప్పగిస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- నరసరావుపేట సెగ్మెంట్‌లో 20కిపైగా పంచాయతీలు ఏకగ్రీవం కానున్నట్లు అధికార, ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, పెదతురకపాలెం, ఇక్కుర్రు పంచాయతీలకు వైసీపీ మద్దతుదారుల మధ్యే పోటీ నెలకొనున్నది. పాలపాడు పంచాయతీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు సర్పంచ్ పదవి పంచుకునే విధంగా రాజీ కుదిరింది. కాకాని పంచాయతీకి ఏకగ్రీవం చేసుకునేలా రాజీ కుదిరినట్లు సమాచారం. దొండపాడు, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం, పమిడిమర్రు, కొందకావూరు, కొత్తపాలెం పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. రొంపిచర్ల మండలంలో టీడీపీ మండల స్థాయి నేత ఒకరు అధికార పార్టీ వారితో మంతనాలు జరుపుతూ ఏకగ్రీవ ఎన్నికలకు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందుకు కారణం సదరు నేతకు రూ.40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండటంతో అధికారపార్టీ ఒత్తిడితో సహకరిస్తున్నట్లు సమాచారం. వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాలలో కూడా అధికార పార్టీ ఏకగ్రీవాల కోసం పావులు కదుపుతున్నది.
తొలి రోజు ప్రశాంతం
సర్పంచ్, వార్డులకు 613 నామినేషన్లు
ప్రక్రియ పరిశీలించిన కాంతిలాల్‌దండే
నరసరావుపేట, ఫిబ్రవరి 2: నరసరావుపేట డివిజన్‌లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. 237 సర్పంచ్ పదవులకు 148, 2,364 వార్డులకు 465 నామినేషన్లు దాఖలయ్యాయి. నరసరావుపేట మండలం ములకలూరు, నాదెండ్ల మండలాల్లో నామినేషన్లు వేసేందుకు పెద్దసంఖ్యలో బారులు తీరారు. దీంతో ఆయా కేంద్రాల వద్దకు సాయంత్రం ఐదు గంటలలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌దండే నామినేషన్ పక్రియపై అధికారులతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. సబ్ కలెక్టర్ శ్రీవాస్‌నుపూర్ నరసరావుపేట మండలంలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. డీఎస్పీ విజయ భాస్కరరావు నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు తెలియజేయాలని సబ్ కలెక్టర్ తెలిపారు.
6175 మంది బైండోవర్ : డీ ఎస్పీ
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 6175 మందిను బైండోవర్ చేసినట్లు డీఎస్సీ విజయ భాస్కరరావు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద వీడియో నిఘా ఉంచామన్నారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు చెప్పారు.
రేపు గుంటూరులో ఎస్‌ఈసీ సమీక్ష
గుంటూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలపై గురువారం గుంటూరులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లా అధికారులతో సమీక్షించనున్నట్లు ఇన్‌చార్జి డీపీవో కొండయ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్‌లో సాయంత్రం 6 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు.
Updated Date - 2021-02-03T05:53:52+05:30 IST