కేసుల సుడిలో సర్కార్
ABN, First Publish Date - 2021-08-28T08:37:39+05:30
నిబంధనలకు విరుద్ధమైన ఉత్తర్వులు ఇవ్వడం! కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం! అధికారులు సత్వరం స్పందించి వివరాలు అందించక పోవడం! కారణం ఏదైతేనేం... ఆంధ్రప్రదేశ్ సర్కారుపై హైకోర్టు,
రోజుకు సగటున 450 పిటిషన్లు
రాష్ట్రం ఎదుర్కొంటున్న కేసులు 1.94 లక్షలు
కోర్టు ధిక్కరణ కేసులు 8 వేలు
కొత్త పిటిషన్లకు సమాధానాలతో సరి
నిత్యం 40 వేల పేజీల రాత పని
కోర్టు పనుల్లో అధికారులు తలమునకలు
సాధారణ పరిపాలనపై తీవ్ర ప్రభావం
పీటీఐ వార్తా సంస్థ ప్రత్యేక కథనం
ప్రస్తుతం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కార అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం బిల్లులు, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో ఈ పరిస్థితి ఎదురవుతోంది. తప్పు చేస్తున్నది ఒకరు. దాని పర్యవసానాలను ఎదుర్కొంటున్నది మాత్రం అధికారులు!
కోర్టు ధిక్కార పిటిషన్లలో గానీ, రిట్ పిటిషన్లలో గానీ కొందరు ఉన్నతాధికారులు ప్రతి రోజూ హైకోర్టు ముందు హాజరవ్వాల్సిన దుస్థితి. ఇది ఎప్పటికీ పూర్తిగాని టీవీ సీరియల్‌గా మారింది.
ఓ ఉన్నతాధికారి
అమరావతి, ఆగస్టు 27: నిబంధనలకు విరుద్ధమైన ఉత్తర్వులు ఇవ్వడం! కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం! అధికారులు సత్వరం స్పందించి వివరాలు అందించక పోవడం! కారణం ఏదైతేనేం... ఆంధ్రప్రదేశ్ సర్కారుపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సగటున రోజుకు 450 కేసులు పడుతున్నాయి. పీటీఐ వార్తా సంస్థ ఈ విషయం వెల్లడించింది. కేసుల సుడిగుండంలో పడి పాలన గాడి తప్పిందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై శుక్రవారం పీటీఐ ఒక ప్రత్యేక కథనాన్ని అందించింది. ‘‘కోర్టు ధిక్కార పిటిషన్లు, కొత్త కేసులకు సమాధానం ఇవ్వడానికే అధికారుల పుణ్యకాలమంతా గడచిపోతోంది. పాలనా యంత్రాంగం ఇందులో తలమునకలు కావడంతో రోజువారీ కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయని ఉన్నతాధికారులు వాపోతున్నారు’’ అని తెలిపింది.
ఏడాది కిందటి వరకు ఏపీ హైకోర్టులో 2.03 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. అయితే... ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి ఏపీ ప్రభుత్వం 1.94 లక్షల కేసులను ఎదుర్కొంటోందని పీటీఐ పేర్కొంది. దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని వెల్లడించింది. ‘ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్‌వర్క్ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ వ్యాజ్యాల ఖర్చుకు లెక్కే ఉండడం లేదని చెప్పారు.
అంతులేని ధిక్కారం
సమయానుగుణంగా కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు వివిధ స్థాయుల్లోని ప్రభుత్వ అధికారులు 8 వేల కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్నారని పీటీఐ తెలిపింది. యంత్రాంగం నిర్లిప్తత, నిర్లక్ష్యంతో పాటు సర్కారు విధానాలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగి నుంచి సామాన్య పౌరుడి వరకు ఉంటున్నారు. వారంతా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై పడుతున్న కేసుల సంఖ్య 30 శాతం పెరిగిందని, ప్రభుత్వం తీసుకుంటున్న లోపభూయిష్ట నిర్ణయాలే దీనికి కారణమని మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు.
దశాబ్దాలుగా పెండింగ్...
తాను పుట్టడానికి 13 ఏళ్ల ముందు దాఖలైన కేసు ఇప్పటికీ తన శాఖలో పెండింగ్‌లో ఉందని 40వ పడిలో ఉన్న ఓ ఐఏఎస్ అఽధికారి వెల్లడించారు. ఆ మధ్య రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ వీణా ఈశ్ పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు దశాబ్దాల నాటి అవినీతి ఆరోపణల కేసులు ఇప్పటికీ అపరిష్కృతంగా పడి ఉండడాన్ని గమనించి ఆమె విస్తుపోయారు. ఈ సందర్భంగానే మరో కీలక అంశం బయటపడింది. ఓ శాఖలో నాలుగు అవినీతి కేసుల్లో ఏనాడో దోషులకు శిక్ష పడింది. కానీ, అవి ఇంకా పెండింగ్ జాబితాలో ఉన్నాయి. దీనిపై సదరు శాఖాధిపతి సిబ్బందిపై మండిపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందని నిలదీశారు. సంబంధిత ఫైళ్లు పోయాయని.. అందుకే అవి ఇప్పటికీ పెండింగ్ జాబితాలో ఉన్నాయని వారు బదులివ్వడం గమనార్హం. కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. తదుపరి కార్యాచరణ చేపట్టే వ్యవస్థే లేకుండా పోయిందని.. చాలా కేసుల్లో కోర్టు ధిక్కార చర్యలకు ఇదే కారణమని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. తన ఆదేశాలను అమలుచేయని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు ఇటీవల నాన్‌బెయిలబుల్ వారంటు జారీచేసింది. రెండేళ్ల కింద ఆమె ఆ శాఖ నిర్వహించారు. కోర్టు ఆదేశాలను తాను ఎప్పుడో అమలుచేశానని.. అయినా ఇలా జరగడంపై ఆమె ఆశ్చర్యపోయారు. చర్యల నివేదికను కోర్టుకు సమర్పించడంలో సంబంధిత ప్రభుత్వ న్యాయవాది విఫలమవడంతో ఆమె కోర్టు బోనెక్కాల్సి వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త విచారకర పరిస్థితులకు ఈ ఉదంతం ప్రత్యక్ష నిదర్శనమని సదరు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు శిక్ష..
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత... సీఎస్, డీజీపీల నుంచి కింది స్థాయి అధికారుల వరకూ కోర్టుమెట్లు ఎక్కడం పరిపాటిగా మారింది. కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ఓ ఐఏఎస్ అధికారికి, ఓ ఐఎ్‌ఫఎస్ అధికారికి గత నెలలో 9 రోజుల సాధారణ శిక్ష విధించింది. అయితే వారు పదే పదే వేడుకోవడంతో దానిని సవరించింది. ఆ రోజున కోర్టు కార్యకలాపాలు ముగిసేవరకు నిలబడి ఉండాలని ఆదేశించింది. చెరో రూ.1,000 చొప్పున జరిమానా విధించింది.
కౌంటర్లు వేయనందుకే..
ధిక్కార కేసులపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఓ అంతర్గత నివేదిక సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న 143 ధిక్కార కేసులకు సంబంధించి అధికారులు చాలా వాటిలో కోర్టులో కౌంటర్ అఫిడవిట్లే దాఖలు చేయలేదని అందులో పేర్కొంది. రిట్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేశారా లేదా అని అడిగితే.. చాలా కేసుల్లో ‘నో’ అని అధికారులు సమాధానమిచ్చారు. ఒక్క ఆర్థిక శాఖలోనే కాదు.. మొత్తం యంత్రాంగమంతా ఇదే పరిస్థితి. అందుకే కోర్టు నుంచి పిలుపులొస్తున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
న్యాయమూర్తి ఆగ్రహం
పలు సివిల్ పనులను పూర్తిచేసినా బిల్లులు చెల్లించడంలేదంటూ ఓ కాంట్రాక్టరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనికి జవాబివ్వాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నిరుడు అక్టోబరు 21న నోటీసులు జారీచేస్తే.. వాటిపై ఆయా శాఖల అధికారులు ఇంతవరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. వారి తీరును ఈ నెల 23న జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు.
Updated Date - 2021-08-28T08:37:39+05:30 IST