గోదారి ఒడిలోకి గండి పోచమ్మ!
ABN, First Publish Date - 2021-07-16T07:34:22+05:30
ప్రాజెక్టులో ముంపు సహజం! పోలవరం వంటి ప్రాజెక్టులో ముంపు మరింత అధికం! ఈ ముంపులో గుళ్లు మునుగుతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలున్న గ్రామాలూ గోదారి గర్భంలోకి చేరనున్నాయి
పోలవరం ముంపులో గిరిజన ఆలయం
పాపికొండల యాత్రలో ఇదే తొలి మజిలీ
ఇప్పటికే ఆలయ ఆవరణలోకి నీళ్లు
ప్రాజెక్టులో ముంపు సహజం! పోలవరం వంటి ప్రాజెక్టులో ముంపు మరింత అధికం! ఈ ముంపులో గుళ్లు మునుగుతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలున్న గ్రామాలూ గోదారి గర్భంలోకి చేరనున్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. వీటి విశేషాలతో ‘ఆంధ్రజ్యోతి’ అందించే కథనాలు...
కొండమీదే కొత్త గుడి కట్టాలి
గండిపోచమ్మ తల్లి మా కుల దేవత. సోదెవారి ఆడపడచు. మా ముత్తాల నుంచి ఇక్కడ అమ్మకు సేవచేసేవారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల గుడి మునిగిపోతోంది. వరదల సమయంలో అమ్మవారి విగ్రహం కూడా మునిగిపోతుంది. ఇక్కడ గుడిని కాపాడాలి. అలాగే... ఇప్పుడున్న గుడి రోడ్డును ఆనుకుని ఉన్న కొండ మీద కొత్త గుడి కట్టాలి.
- పూజారి వెంకన్న దొర
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
‘‘గండి పోచమ్మ తల్లీ... కాపాడు! మమ్మల్ని చల్లగా చూడు. మా యాత్ర చక్కగా సాగేలా దీవించు’’...
ఇది పాపికొండల విహారానికి వెళ్లే పర్యాటకుల ప్రార్థన! లాంచీ సిబ్బంది మొక్కు! ఇప్పుడు ఆ గండి పోచమ్మకే గండం వచ్చింది. పోలవరం ముంపుతో గుడి ఆవరణలోకి నీరు వచ్చింది. త్వరలోనే... అమ్మోరు తల్లినీ గోదావరి తనలో కలుపుకోనుంది.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన గిరిజన దేవత... గండి పోచమ్మ. పాపికొండల యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైనా... బోట్లు, లాంచీలు తొలుత ఇక్కడికి రావాల్సిందే. పర్యాటకులు, లాంచీల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటారు. ఈ గుడి దగ్గర నుంచి పాపికొండలు సుందరంగా కనిపిస్తాయి. కొండల మీద వెలిసిన గిరిజన గ్రామాలూ కనిపించేవి. ఈ ఆలయానికి వందేళ్ల పైబడిన చర్రిత ఉంది. పాపికొండలకు వెళ్లే పర్యాటకులతోపాటు... ఉభయ గోదావరి జిల్లాలు, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ ఒడిసా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడికి వస్తారు. గొందూరు గ్రామానికి చెందిన గిరిజన తెగ సోదె వారు గండి పోచమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు. గండి పోచమ్మ తల్లి పూజారి గిరిజనుడే. ప్రస్తుతం సోదె వెంకన్నదొర, బూబూదొర అనే ఇద్దరు సోదరులు పూజారులు ఉన్నారు. వీరిని ఆసాదులు అని పిలుస్తారు. వీరు ఐదవ తరానికి చెందినవారు. 1990లో ఈ ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు.
ఇదీ నమ్మకం!
గోదావరి ప్రవాహానికి ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో గతంలో పెద్ద కొండ ఉండేదట. ఆ ప్రవాహానికి కొండ తొలుచుకుపోయి.. గండి ఏర్పడిందని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని పోచమ్మ గండి అంటారు. అంతకుముందు నుంచే ఇక్కడ ఈ దేవత గుడి ఉంది. వరదల సమయంలో గోదావరిలో మునిగిపోతుందని గిరిజనులు ఆ విగ్రహాన్ని పైకి తెచ్చి గుడికట్టాలని భావించగా... తవ్వేకొద్దీ విగ్రహం కిందకు వెళ్లిపోయిందట! దీంతో... ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి దాని పైభాగాన... ఇప్పుడున్న గుడిని కట్టి, విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
మూడు ప్రతిపాదనలు
గండి పోచమ్మ గుడి నీట మునుగుతుండటంతో... అధికారులు మరోచోట గుడి నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పురుషోత్తపట్నం సమీపంలోని పునరావాస కాలనీలో లేదా... ఈ అమ్మవారు గొందూరు ప్రజల ఆడపడుచు కాబట్టి కొత్త గొందూరులో... అదీ కాకపోతే, గుడి రోడ్డును ఆనుకుని ఉన్న కొండ మీద కొత్త ఆలయం నిర్మించాలని భావిస్తున్నారు.
Updated Date - 2021-07-16T07:34:22+05:30 IST