భ్రూణ హత్యలు తగ్గాయ్!
ABN, First Publish Date - 2021-10-06T08:30:52+05:30
గర్భంలో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేయడం హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా భ్రూణ హత్యలు ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే స్కానింగ్‌లపై నియంత్రణ, ఆడపిల్లల పట్ల ఆదరణ, అక్షరాస్యత
- స్వల్పంగా పెరిగిన ఆడ శిశువుల సంఖ్య
- అయినా ప్రతి వెయ్యి బాలురుకి 934 బాలికలే
- రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన శిశు మరణాలు
- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి
గుంటూరు (మెడికల్), అక్టోబరు 5: గర్భంలో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేయడం హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా భ్రూణ హత్యలు ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే స్కానింగ్‌లపై నియంత్రణ, ఆడపిల్లల పట్ల ఆదరణ, అక్షరాస్యత పెరగడం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో భ్రూణ హత్యలు క్రమేపీ తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఇప్పటికీ ప్రతి వెయ్యి మంది బాలుర (ఐదేళ్లలోపు ఉన్నవారు)తో పోలిస్తే ఆడపిల్లలు 934 మందే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. కానీ 2015 సర్వేతో (ప్రతి వెయ్యిమంది బాలురకు 914 మంది బాలికలు) పోలిస్తే 2019 సర్వేలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడినట్టే. రాష్ట్రంలో 2019 జూలై 2 నుంచి నవంబరు 14 వరకు ఈ సర్వే నిర్వహించారు. ఆ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న 25 నుంచి 29 ఏళ్ల యువతుల్లో 29.3 శాతం మంది తమకు 18 ఏళ్లలోపే వివాహమైనట్లు తెలిపారు. వీరిలో 12.6 శాతం మంది మైనార్టీ తీరేలోపు తల్లులయ్యారు. ఇదే వయస్సు గ్రూపు యువకుల్లో 14.5 శాతం మంది తమకు 21 ఏళ్లలోపు వివాహమైనట్లు చెప్పారు. 96.5 శాతం మంది గర్భిణీలకు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు కాగా.. ప్రైవేటు వైద్యశాలల్లో 61.4 శాతం, ప్రభుత్వాస్పత్రుల్లో 26.6 శాతం సిజేరియన్లు జరిగాయి.
సర్వేలో మరికొన్ని విశేషాలు..
- 15 ఏళ్ల పైబడిన బాలురులో 22.6 శాతం మంది ధూమపానం, 23.3 శాతం మంది మద్యపానం చేసినట్లు తెలిపారు.
- 36.3 శాతం మంది మహిళలు, 31.1 మంది పురుషులు అధిక బరువుతో, 60.1 శాతం మంది మహిళలు, 16.2 శాతం మంది పురుషులు రక్తహీన తతో బాధపడుతున్నారు.
- 19.5 శాతం మంది మహిళల్లో, 21.8 శాతం మంది మగవారిలో మందులు వాడుతున్నా మధుమేహం నియంత్రణలో ఉండటం లేదు.
- 25.3 శాతం మంది ఆడవారిలో, 29 శాతం మంది మగవారిలో మందులు వాడుతున్నా బీపీ నియంత్రణలో ఉండటం లేదు.
- మహిళల్లో 68.6 శాతం, పురుషుల్లో 79.5 శాతం మంది అక్షరాస్యులని సర్వే గుర్తించింది.
- శిశువు పుట్టిన మొదటి గంటలోనే సగటున 52 శాతం మంది తల్లులు పాలు పడుతున్నారు. శిశు మరణాల సంఖ్య (ప్రతి వెయ్యి జననాలకు) 30కి తగ్గింది. గత సర్వేలో ఇది 35గా ఉండేది.
- మహిళల్లో 70 శాతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోగా, పురుషుల్లో ఇది అర శాతం మాత్రమే. ఒక శాతం లోపే గర్భనిరోధక సాధనంగా కండోమ్ వినియోగిస్తున్నారు. ఒక శాతం మంది గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు.
- హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై మహిళల్లో 24.6 శాతం మందికి, పురుషుల్లో 38.6 శాతం మందికి కనీస అవగాహన ఉంది. 82.6 శాతం మంది మగవారికి కండోమ్ వినియోగంపై అవగాహన ఉంది.
- 30 శాతం మంది గృహిణులు ఇంట్లో గృహ హింస, శారీరక దాడులకు గురైనట్లు చెప్పారు.
- 48.9 శాతం మంది మహిళలు సెల్‌ఫోన్ వాడుతున్నారు. 81.8 శాతం మంది హహిళలకు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలున్నాయి.
- మహిళల్లో 21 శాతం, పురుషుల్లో 48.8 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు.
Updated Date - 2021-10-06T08:30:52+05:30 IST