‘ఉపాధి’ నిధులు.. హుష్!
ABN, First Publish Date - 2021-06-28T08:06:34+05:30
ఉపాధి పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. పథకం అమల్లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ఖజానాకు మళ్లించుకుంటున్న రాష్ట్ర సర్కారు
గత ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులకు బ్రేక్
పనులు తనిఖీ చేసి ఇస్తామంటూ కోర్టులో అఫిడవిట్
బకాయిల ప్రస్తావన తెస్తే విజిలెన్స్ పేరిట హడావుడి
400 కోట్లు విడుదల ఉత్తర్వులు కాగితాలకే పరిమితం
కోర్టులనూ తప్పుదారి పట్టిస్తూ చెల్లింపుల్లో కాలయాపన
ఈ ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులకూ అంతంతే మోక్షం
కేంద్రం మార్గదర్శకాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉపాధి పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. పథకం అమల్లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నుంచి పుష్కలంగా నిధులందుతున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని పలువురు అధికారులే పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు ముందు పనులు చేసినవారికి ముందుగా ఆన్లైన్లో చెల్లింపులు చేయాల్సిన ప్రభుత్వం... కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పెండింగ్ బిల్లులు చెల్లించకుండా... గతంలో రాష్ట్ర ఖజానా నుంచి ఉపాధి పథకానికి అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని జమ చేసుకున్నామని చెప్పడంతో బకాయిదారులంతా ఉసూరుమంటున్నారు. పాత బకాయిలు అటుంచి కొత్త పనులకు ఇకనుంచి గ్రీన్ చానల్లో బిల్లులు ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ 2019 డిసెంబరు 30న మెమో జారీ చేశారు. దీంతో ఈ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించే ఉద్దేశం లేదన్నది స్పష్టమైంది. అప్పటి వరకూ కేంద్రం నుంచి నిధులొస్తే తమ బిల్లులొస్తాయని ఎదురు చూసినవారు, నిధులొచ్చినా ఆ ఊసే ఎత్తకపోవడంతో తమ బిల్లులు ఇక రావన్న ఆందోళనలో పడ్డారు. పైగా పాత బకాయిల ప్రస్తావన తెస్తే... విజిలెన్స్ విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత ఇస్తామని మంత్రి నుంచి అధికారుల వరకు ఒకేమాట చెబుతున్నారు.
మరోవైపు కేంద్రం నుంచి నిధులు రాలేదని... వస్తే చెల్లిస్తామంటున్నారు. అయితే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మాత్రం రాష్ట్రానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన నిధులన్నీ చెల్లించామని, బకాయిలు లేవని తేల్చేశారు. ఇదే విషయమై ఎంపీలు విజయసాయిరెడ్డి, కనకమేడల రవీంద్ర పార్లమెంట్లో గతంలో వేసిన ప్రశ్నలకు కేంద్రమంత్రి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసే క్రమంలో సిమెంటు రోడ్లు, డ్రైన్లు, పార్కుల నిర్మాణం కోసం చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక నలుగురైదుగురు స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో సర్పంచ్ల అసోషియేషన్ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు.
కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా...
ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి బకాయిలు ఆయా గ్రామ పంచాయతీలకు నెలలోపు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు గతంలోనే హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రానికి కేంద్రం ఏయే తేదీల్లో నిధులు విడుదల చేశారో వివరాలివ్వాలని, వాటిని నిబంధనల ప్రకారం విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించారు. అయితే రాష్ట్రానికి ఇవ్వాల్సిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఇప్పటికే చెల్లించామని, ఈ పనులకు సంబంధించి పాత బకాయిలు ఎందుకు చెల్లించలేదని అడిగిన కేంద్ర అధికారులనూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. అప్పటి వరకు ఎఫ్‌టీఓలను టీసీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తున్నామని, ఇకనుంచి సీఎ్‌ఫఎంఎస్ అమల్లోకి తీసుకొస్తున్నందున నిధులు విడుదల చేయడం ఆలస్యమైందని కేంద్రానికి లేఖ రాసింది. త్వరలో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పింది. మరోసారి ఈ పనుల్లో అవకతవకలు జరిగాయని, విచారణ అనంతరం చెల్లిస్తామని చెబుతూ కేంద్ర అధికారులను మభ్యపెట్టారు. అనంతరం హైకోర్టు ఆదేశాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మెట్టు దిగి అంచనా విలువ రూ.5లక్షల లోపు ఉన్న పనులకు సంబంధించిన బిల్లులను 20శాతం తగ్గించి చెల్లిస్తామని అఫిడవిట్లో పేర్కొంది. అయితే కోర్టుకిచ్చిన అఫిడవిట్‌ను మర్చిపోయారు.
ఈ ఏడాది మార్చి 30న హైకోర్టు మరోసారి ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వంపై సీరియస్ అయింది. కోర్టుకిచ్చిన అఫిడవిట్ ప్రకారం ఎందుకు బిల్లులు విడుదల చేయలేదని నిలదీసింది. దీనిపై సరైన సమాధానం చెప్పకపోతే సీఎ్‌సను కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించడంతో రూ.5లక్షల లోపు అంచనా విలువ కలిగిన పనులకు సంబంధించి సుమారు రూ.400కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులు మాత్రం విడుదల చేయలేదు. కోర్టు అఫిడవిట్లో చెల్లింపులు చేశామని ఉత్తర్వుల కాపీని చూపించినా, నిధులు మాత్రం విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని మాజీ సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. కోర్టును తప్పుదారి పట్టిస్తూ బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర పథకాల స్ఫూర్తికి దెబ్బ
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడంతో పాటు ఆస్తులు సమకూర్చి భావితరాలకు అవి జీవనాధారంగా ఉండాలన్న సంకల్పంతో కేంద్రం వేల కోట్లు నిధులు సమకూరుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకునే యోచన చేయకుండా రాజకీయంగా ప్రత్యర్థుల్ని దెబ్బ తీయడానికి, కక్ష ధోరణితో గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకుండా మొండివైఖరి అవలంబిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో కేంద్ర పథకాల స్ఫూర్తి దెబ్బతింటోదని చెబుతున్నారు. గత ప్రభుత్వంతో పోటీ పడి అభివృద్ధి పనులు చేపట్టి మరిన్ని కేంద్ర నిధులు రాబట్టేందుకు కృషి చేయాల్సిన సర్కారు ఆ ప్రయత్నాలే చేయడం లేదని, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి నిధులు తగ్గే ప్రమాదముందని వ్యాఖ్యానిస్తున్నారు.
నిబంధనలకు తిలోదకాలు
రాష్ట్రానికి ఉపాధి మెటీరియల్ నిధులు విడుదల చేసే ప్రతి సందర్భంలోనూ మూడు రోజుల్లోపు చెల్లింపులు చేపట్టాలని, ఆలస్యమైతే వడ్డీతో పాటు చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకనుంచి నిధులు విడుదల చేయబోమని కేంద్రం హెచ్చరిస్తునే ఉంది. అంతేకాకుండా బిల్లులు చెల్లింపుల్లో పాత బకాయిలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ముందు చేసిన పనులకు ముందు చెల్లింపులు చేయాలని కూడా పేర్కొంటోంది. అయితే ఆ నిబంధనలేవీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ మెటీరియల్ నిధులకు సంబంధించి గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం... ఇప్పటి పనులకు చేసిన చెల్లింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ పనులు చేపట్టేందుకు గ్రామాల్లో ఎవరూ ముందుకురాకపోవడంతో ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేల చొరవతో ఇప్పుడిప్పుడే కొన్నిచోట్ల గ్రామ సచివాలయాల భవనాలు, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పనులకు కూడా బిల్లులివ్వడం ఆలస్యం కావడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. పనులు భారీ సంఖ్యలో ప్రారంభించి, బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు చేసేందుకు గ్రామాల్లో ఎవరూ ఆసక్తి చూపడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
Updated Date - 2021-06-28T08:06:34+05:30 IST