తమ్ముడికి అన్నయ్య మద్దతు
ABN, First Publish Date - 2021-01-28T09:07:28+05:30
జనసేన అధినేత, తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి ప్రముఖ నటుడు చిరంజీవి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
- రాజకీయంగా పవన్‌కు చిరు సహకారం
- ఆయనతో భేటీలో మాకు హామీ ఇచ్చారు
- మళ్లీ సినిమాలు చేయమంది చిరంజీవే
- కార్యకర్తల భేటీలో మనోహర్ వ్యాఖ్యలు
విజయవాడ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత, తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి ప్రముఖ నటుడు చిరంజీవి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన క్రియాశీలక కార్యకర్తలకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా, కిట్లు అందజేసేలా విజయవాడలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవితో పవన్ కల్యాణ్, నేను కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. ఆ సమయంలో మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ కల్యాణ్‌కు చిరంజీవి సూచించారు. అలాగే, పవన్ కల్యాణ్‌ఖు రాజకీయంగా అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు’’ అని తెలిపారు. కార్యకర్తలంతా ఆదర్శవంతులుగా, నిజాయతీపరులుగా ఉంటూ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, నాయకత్వానికి అండగా ఉండాలని మనోహర్ సూచించారు.
‘‘పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రైతులకు అండగా నిలవడానికి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలి. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించినా ముట్టడించడానికి సిద్ధంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పోటీ చేయాలి. ప్రతిచోటా నామినేషన్ దాఖలు చేయాలి. ప్రభుత్వం ఏకగ్రీవాలు చేయాలని కుట్రలు చేస్తోంది. ఇంతకుముందు దౌర్జన్యాలు చేసి 25 శాతం ఏకగ్రీవాలు చేశారు. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులకు పట్టణ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలి’’ అని నాదేండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Updated Date - 2021-01-28T09:07:28+05:30 IST