ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పందెం ‘బరి’లోకి

ABN, First Publish Date - 2021-01-10T05:30:00+05:30

సంక్రాంతి పర్వదినాల ముసుగులో పందెంబరులు..

ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో కోడిపందేల బరుల వద్ద ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడి పందేలకు రె‘ఢీ’

ఎక్కడికక్కడే భారీగా సిద్ధమవుతున్న బరులు

గుండాట బోర్డులకు భారీగా వేలం

కేశనకుర్రుపాలెంలో రూ.50 లక్షలు, వన్నెచింతలపూడిలో రూ.23 లక్షలు, కొత్తపేట బరికి రూ.20 లక్షలు

జనాదరణ కోసం రికార్డింగ్‌ డ్యాన్సలకు ఏర్పాట్లు

షరా ‘మాములు’గానే ప్రేక్షక పాత్రలో పోలీసులు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాల ముసుగులో పందెంబరులు సిద్ధమవుతున్నాయి. గతం కంటే భిన్నంగా ఎక్కడికక్కడే పందెంబరులతో పాటు పేకాట పోటీలు, రికార్డింగ్‌ డ్యాన్సులు, గుండాటలతో పాటు విందు, వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి వైసీపీ నేతలే రంగం సిద్ధం చేస్తున్నారు. అధికారపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల సాక్షిగా సంక్రాంతి ముసుగులో అసాంఘిక క్రీడా వినోదాలను ముందెన్నడూ లేని విధంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ పోలీసుల ప్రత్యక్ష ప్రమేయంతో ఈసారి కోడిపందెం బరులు సిద్ధమవుతున్నాయి. బరుల వద్ద గుండాట వంటి జూదాలను నిర్వహించడానికి భారీగా బహిరంగ వేలాలు నిర్వహిస్తున్నారు. కనిష్ఠం రూ.లక్ష కాగా గరిష్ఠంగా అరకోటికి పైనే పోటీపడి మరీ గుండాటలు నిర్వహించుకునేందుకు కోనసీమలోని వివిధ బరులను వేలం పాటల్లో దక్కించుకున్నారు. 


వైసీపీ నేతల సాక్షిగా 

సంక్రాంతి ముసుగులో జూద క్రీడా వినోదాల నిర్వహణకు జిల్లా పోలీసు యంత్రాంగం షరా ‘మామూలు’గా గ్రీనసిగ్నల్‌ ఇచ్చేసినట్టే. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో వైసీపీ పార్టీ పేరిటే కొన్ని బరులను సైతం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను అధికారపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ పార్టీ నేతలే తుంగలోకి తొక్కేస్తున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అడిగిన వారికి, అడగనివారికీ సైతం ఏ కార్యక్రమం నిర్వహించుకోవడానికైనా అధికార యంత్రాంగం సై అంటుంది. కోనసీమలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వందకు పైగా బరులు సిద్ధమవుతున్నప్పటికీ వాటిలో 10-15 బరులు అత్యంత కీలకమైనవి. 


ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలోని సువిశాల మైదానంలో అప్పుడే బరులు సిద్ధం చేశారు. చేలను లీజుకు తీసుకుని ఈ పందేలు  నిర్వహిస్తున్నారు. ఇక్కడ గుండాట, పేకాట వంటి అసాంఘిక జూద క్రీడలు నిర్వహించుకునేందుకు వీలుగా నిర్వాహకులు నిర్వహించిన బహిరంగ వేలంలో అరకోటికి పైగానే ధర పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొత్తపేటలోని ఒక ప్రైవేటు పాఠశాల స్థలంలో పందెం బరిని సర్వహంగులతో సిద్ధం చేశారు. ఇక్కడ గుండాట నిర్వహణకు రూ.20లక్షలకు ముగ్గురు వైసీపీ నాయకులు పాడుకున్నట్టు తెలిసింది. అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడి బరికి గుండాటకు జరిగిన వేలంలో భీమవరానికి చెందిన నిర్వాహకులు రూ.23లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం. ముమ్మిడివరం మండలం రాజుపాలెంలో రూ.6లక్షలు, పల్లిపాలెంలో రోజుకు రూ.1.50 లక్షలు వంతున వేలంలో దక్కించుకున్నారు. సమనస, కామనగరువు, కొంకాపల్లి, ఇందుపల్లిలలో వైసీపీ నాయకులే బరులు ఏర్పాటుచేయడంతో పాటు ఇక్కడ గుండాటలు, ఈసారి వినూత్నంగా రికార్డింగ్‌ డ్యాన్సలను  నిర్వహించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే  ప్రయత్నాలు చేస్తున్నారు.


కాట్రేనికోన మండలం చెయ్యేరు, గెద్దనపల్లి, అల్లవరం మండలం గోడి, గుడ్డివానిచింత, సడక్‌రోడ్డు, రెల్లుగడ్డ, గుండెపూడి, కొమరగిరిపట్నం, ఓడలరేవు, పి.గన్నవరం మండలంలో గంటి తదితర ప్రాంతాల్లో వైసీపీ నేతలు బరులు సిద్ధం చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశనపల్లి, పరమటపాలెం, కేశవదాసుపాలెం, కరవాక సహా వివిధ గ్రామాల్లో రికార్డింగ్‌ డ్యాన్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఊబలంక, గోపాలపురంలతో పాటు కొత్తపేట పరిసర ప్రాంతాల్లో భారీగా పేకాట పోటీలు నిర్వహించేందుకు కొందరు పేకాటరాయుళ్లకు  అధికారికంగా ఆహ్వానాలు అందుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోడ్‌ అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికార పగ్గాలన్నీ జిల్లా యంత్రాంగం చేతుల్లోనే ఉంటాయి. అయితే అటు ఎన్నికల కమిషన ఆదేశాలు, ఇటు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రజాప్రతినిధుల సాక్షిగా పందెంరాయుళ్లు పేట్రేగిపోనున్నారు. బాధ్యత వహించాల్సిన పోలీసు యంత్రాంగం మాత్రం మేమున్నామంటూ ఫ్లెక్సీలు కట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరుపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-01-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising