సాధారణ రోగాలకు చికిత్సలు బంద్
ABN, First Publish Date - 2021-05-25T05:55:12+05:30
ఎప్పుడూ రోగులతో కిటకిటలాడే ఆసుపత్రులు వెలవెలబోతున్నాయి.
కొవిడ్ సెకండ్ వేవ్‌తో విధులకు దూరంగా వైద్యులు
ఓపీ సేవలూ అంతంతమాత్రమే
సకాలంలో చికిత్స అందక రోగగ్రస్తుల పాట్లు
(ఆంధ్రజ్యోతి-అమలాపురం)
ఎప్పుడూ రోగులతో కిటకిటలాడే ఆసుపత్రులు వెలవెలబోతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం జనాలు స్కానింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలులో ఉండడంతో జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ దాదాపు నిలిపివేశారు. అత్యవసర కేసులను మాత్రమే చూస్తామని, నిబంధనలు అనుసరించి బోర్డులు పెడుతున్నప్పటికీ ఆ పరిస్థితులు కోనసీమ సహా అనేక చోట్ల కానరావడం లేదు. రోగాలు తగ్గాయా లేక ఆసుపత్రులకు రోగులు దూరంగా ఉంటున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సెకండ్ వేవ్ తీవ్రతను గ్రహించిన ప్రైవేటు, కార్పొరేట్ వైద్యులు దాదాపు ఓపీలతో సహా అత్యవసర కేసులను సైతం పూర్తిగా విస్మరించారనే చెప్పాలి. కొన్ని ఆసుపత్రుల్లో 8, 9 నెలలు గర్భిణులకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మెజారిటీ ప్రజలు ఆయా గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడి వైద్యం చేయించుకుంటుంటే మరికొంతమంది టెలిఫోన్ల ద్వారా ఆయా డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురం ఏరియా ఆసుపత్రిలో నిత్యం 350 నుంచి 450 మంది వరకు ఓపీ కొనసాగేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. కోనసీమలోనే అతి పెద్ద కిమ్స్ ఆసుపత్రిలో వివిధ కారణాలతో ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక కర్ఫ్యూ అమలు వల్ల యాక్సిడెంట్లు పూర్తిగా నిల్‌కు రావడంతో ఆర్థోపెడిక్, న్యూరో, కార్డియాక్ వంటి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తీవ్రంగా ఉండే గుండె సంబంధమైన రోగులు మాత్రమే అత్యవసర చికిత్స కోసం కిమ్స్ సహా ఇతర ఆసుపత్రులకు వస్తున్నారు. అమలాపురం పట్టణంతో పాటు కోనసీమవ్యాప్తంగా 300 ఆసుపత్రుల్లో అతి తక్కువ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. ఆప్తమాలజీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ వంటి వివిధ వ్యాధులకు సంబంధించి రోగులు తర్వాత చూపించుకోవచ్చుననే ఆలోచనతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏరియా ఆసుపత్రి, కిమ్స్ సహా వివిధ ఆసుపత్రుల్లో డెలివరీ కేసులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక వివిధ స్కానింగ్ సెంటర్లు, వివిధ రక్త పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌లు అంతంతమాత్రంగానే పని చేస్తున్నాయు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యవసర వ్యాధిగ్రస్తులు కర్ఫ్యూ నిబంధనలు దృష్ట్యా కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లి వైద్యం చేయించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇళ్ల వద్దే ఉండే ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో వైద్య సేవలు పొందేందుకే ఆయా ప్రాంతాల్లోని రోగులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కొందరైతే రోగ లక్షణాలు చెప్పి మెడికల్ షాపుల్లో మందులు వాడడం ద్వారా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొవిడ్-19 లక్షణాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రైవేటు వైద్యులు సాధ్యమైనంత మేర ప్రజలకు అందించే వైద్య సేవలకు దూరంగా ఉండాలన్న ఆదేశాలతో కొన్ని ఆసుపత్రులకు లాక్‌డౌన్ ప్రకటించి వైద్యులు ఇళ్లల్లోనే ఉండి హోం క్వారంటైన్‌కు పరిమితమవుతున్నారు. సామాన్యులు ఆసుపత్రుల్లో ఓపీ సేవల కోసం ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ రెండు, మూడు ఆసుపత్రులు మినహా మిగిలిన చోట డాక్టర్ అందుబాటులో లేరు అనే సమాధానంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే మెడికల్ షాపులు మాత్రం నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. కర్ఫ్యూలో సైతం మందుల షాపుల వద్ద జనం క్యూలు కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు అతికష్టంపై కొవిడ్ నిబంధనలను సైతం పరిగణలోకి తీసుకుని సేవలు అందిస్తున్నాయి.
Updated Date - 2021-05-25T05:55:12+05:30 IST