చిరుధాన్యాలతో పోషక విలువలు మెరుగు
ABN, First Publish Date - 2021-09-18T05:32:38+05:30
చిరుధాన్యాలతో పోషక విలువలు పెరుగుతాయని ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. వీటిని తీసుకోవడం వల్ల మానవునికి శక్తితోపాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 17: చిరుధాన్యాలతో పోషక విలువలు పెరుగుతాయని ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. వీటిని తీసుకోవడం వల్ల మానవునికి శక్తితోపాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. 2023 సంవత్సరాన్ని యూఎన్‌వో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం (సీటీఆర్‌ఐ)లో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు జరిగింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ రానున్న కాలమంతా సేంద్రీయ ఉత్పత్తులపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాగులు, జొన్న లు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగెలు, అండు కొర్రలు వం టి తొమ్మిది రకాలైన చిరుధాన్యాలు వర్షాధార వ్యవసాయానికి అనుకూలమని, తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో దిగుబడికి చేతికందడం వల్ల రైతు కు ప్రయోజనమని పేర్కొన్నారు. కేవలం వరి, గోధుమ తినడం వల్ల ఆహా రంలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుందన్నారు. సీటీఆర్‌ఐ సంచాలకులు డి.దామోదరరెడ్డి చిరుధాన్యాల సాగు, మొక్కల పెంపకంపై రైతులకు, విద్యార్థులకు వివరించారు. మొక్కలు, చిరుధాన్యాల విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త కె.సరళ, శాస్త్రవేత్త బి.హేమ పాల్గొన్నారు.
Updated Date - 2021-09-18T05:32:38+05:30 IST