ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 రోజులు విచారణకు రాలేదా?

ABN, First Publish Date - 2021-02-02T09:06:06+05:30

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ 42 రోజులపాటు విచారణకు రాకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఈ జాప్యం రిజిస్ట్రీ పొరపాటా..?
  • లేక ఎస్‌ఈసీయే పట్టించుకోలేదా?
  • ఇన్ని రోజులూ మౌనమెందుకు?
  • ధిక్కార పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్న
  • ఆలస్యానికి బాధ్యులను గుర్తించండి
  • రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఆదేశం
  • మాజీ, ప్రస్తుత సీఎ్‌సలకు నోటీసులు
  • తదుపరి విచారణ 15కి వాయిదా


అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ 42 రోజులపాటు విచారణకు రాకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గత డిసెంబరు 18న దాఖలైన ఈ వ్యాజ్యం విచారణకు రాకపోవడానికి కోర్టు రిజిస్ట్రీ కారణమా లేక మీరే  పట్టించుకోలేదా అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ఆరా తీసింది. అత్యవసర విచారణ అవసరమైనప్పుడు కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌ 42 రోజుల పాటు నంబరుకు నోచుకోకుండా విచారణకు రాలేదంటే.. అది కోర్టు విధులను అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది. అధికారులు సహకరించకపోతే ఎస్‌ఈసీ ఇన్ని రోజులూ ఎందుకు మౌనంగా ఉందని నిలదీసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చినందున అధికారులపై ఒత్తిడి పెంచేందుకే పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతున్నట్లు కనబడుతోందని వ్యాఖ్యానించింది. ధిక్కరణ వ్యాజ్యం 42 రోజులు విచారణకు నోచుకోకపోవడంపై విచారణ జరిపి.. బాధ్యులైన అధికారులను గుర్తించి నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులైనా, కోర్టు అధికారులైనా న్యాయస్థానానికి సమానమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు.


పబ్లిసిటీ కోసం వేశారా? 

ఎస్‌ఈసీకి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత ఏడాది నవంబరు 3న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వాటి అమలుపై 15 రోజుల్లోగా స్థాయీనివేదిక సమర్పించాలని నాటి సీఎస్‌ నీలం సాహ్నికి స్పష్టం చేసింది. అయితే కోర్టు ఉత్తర్వులు అమలుచేయలేదంటూ సాహ్ని, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలపై ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ డిసెంబరు 18న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జనవరి 29న విచారణ జరిపిన హైకోర్టు.. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతించింది. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. ధిక్కార వ్యాజ్యం 42 రోజులు విచారణకు నోచుకోకపోతే ఎస్‌ఈసీ ఎందుకు కోర్టుకు రాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం పిటిషన్‌ దాఖలు చేశారా.. లేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిజంగానే అధికారులు అమలు చేయలేదా అని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిన నాటి నుంచి ఎస్‌ఈసీ పలు విషయాల్లో పోరాటం చేస్తోందన్నారు. అన్ని విషయాలూ బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని.. ప్రతి దశలో అడ్డంకులు కలిగిస్తున్నారని తెలిపారు. ‘ఎస్‌ఈసీ వేసే వ్యాజ్యాల్లో కమిషనర్‌ నిమ్మగడ్డ ఎందుకు సంతకం చేస్తున్నారు? కార్యదర్శి ఎందుకు సంతకం పెట్టడం లేదు’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.


 గత కార్యదర్శి సహకరించలేదని.. దాంతో మార్చాలని ప్రభుత్వానికి లేఖ రాశామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది చెప్పారు. కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా అని న్యాయమూర్తి అడుగగా.. చర్యలు తీసుకోవాలని సీఎ్‌సను కోరినట్లు తెలిపారు. కోర్టులో వ్యాజ్యాలు విచారణకు రాకముందే.. సంబంధిత పిటిషన్‌లో ఉన్న వివరాలను మీడియాకు విడుదల చేయవద్దని పిటిషనర్‌కు చెప్పాలని న్యాయమూర్తి సూచించారు. న్యాయవాది స్పందిస్తూ.. ఎన్నికల కమిషనర్‌ గానీ, తాను గానీ వ్యాజ్యంలోని విషయాలను ఎప్పుడూ మీడియాకు విడుదల చేయలేదన్నారు. అనంతరం నీలం సాహ్ని, ఆదిత్యనాథ్‌ దాస్‌, గోపాలకృష్ణ ద్వివేదిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. గత ఏడాది నవంబరు 3న తామిచ్చిన ఉత్తర్వుల అమలుపై సాహ్ని స్థాయీనివేదిక సమర్పించకపోతే.. తదుపరి విచారణకు నేరుగా కోర్టు ముందు హాజరుకావలసిందిగా ఆమెకు నోటీసులు జారీచేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది.

Updated Date - 2021-02-02T09:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising