టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా నిర్మాణాల కూల్చివేత
ABN, First Publish Date - 2021-04-26T09:42:35+05:30
గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సకు చెందిన నిర్మాణాన్ని ఆదివారం తెల్లవారుఝామున కూల్చివేయడం
ఆదివారం తెల్లవారుఝామునే రంగంలోకి అధికారులు
కూల్చివేతలు దుర్మార్గం: పల్లా
ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: బాబు
విశాఖట్నం/గాజువాక, అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సకు చెందిన నిర్మాణాన్ని ఆదివారం తెల్లవారుఝామున కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు కూల్చివేత కార్యక్రమం చేపట్టారని పల్లా ఆరోపించారు. ఈ వ్యవహారంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీలోకి రావాలంటూ ఓ ఎంపీ చేసిన వివిధ ప్రయత్నాలను పల్లా సున్నితంగా తిరస్కరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన పల్లా ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ దీక్ష చేపట్టారనీ, ఇది వైసీపీ నాయకులకు మింగుడు పడలేదని పల్లా వర్గీయులు తెలిపారు.
ఈ దీక్షతో పల్లాకు మంచి పేరు వచ్చింది. దీనిని సదరు ఎంపీ జీర్ణించుకోలేకపోయరని ఆ వర్గాలు తెలిపాయి. ఎలాగైనా పల్లాను ఇబ్బంది పెట్టాలనే అడ్డగోలు కూల్చివేతకు దిగారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాను చేపట్టిన నిర్మాణానికి అన్ని అనుమతులూ ఉన్నాయని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అసలు జరిగింది ఏమిటన్నదానిపై ఆయన మాటల్లోనే... ‘‘మా కుటుంబ సభ్యులకు పాత గాజువాక జంక్షన్‌లో సర్వే నంబరు 5/1, 5/3లలో సుమారు 1,000 గజాల స్థలం ఉంది. అందులో 1976 నుంచి నిర్మాణం ఉంది. అది పాతది కావడంతో పునర్మిర్మాణం చేయాలని 2019లో ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. జీవీఎంసీ అందులో భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. భవిష్యత్తులో ఏమైనా రహదారి విస్తరిస్తే... కొంత స్థలం అవసరం వస్తుందని అధికారులు చెప్పారు. వారి సూచన మేరకు కొన్ని అడుగుల స్థలాన్ని జీవీఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా రిజిస్ట్రేషన్ కూడా చేశాం.
గత ఏడాది కాలంగా ఆ స్థలంలో నిర్మాణం జరుగుతోంది. అయితే తమకు గిఫ్ట్‌గా ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్డారని ఆరోపిస్తూ, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆదివారం తెల్లవారుఝామున 200 మంది పోలీసుల సాయంతో జీవీఎంసీ సిబ్బంది జేసీబీలతో నిర్మాణం కూల్చివేత ప్రారంభించారు’’ అని పల్లా ఆరోపించారు. ఈ క్రమంలో జీవీంఎసీ ప్లానింగ్ అధికారితో పల్లా మాట్లాడారు. నోటీసు ఇవ్వకుండా ఇలా చేయడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నోటీసు ఇచ్చామంటూ సదరు అధికారి తెలిపారు. నోటీసు ఇచ్చినట్లు అమ్మవారి గుడిలో ప్రమాణం చేయాలంటూ పల్లా డిమాండ్ చేశారు. దీంతో ఆ అధికారి అక్కడి నుంచి జారుకున్నారు.
కూల్చివేతలతో రాజకీయ విన్యాసాలు: చంద్రబాబు
పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని అధికారులు కూల్చివేయడాన్ని ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్నారు. ‘‘కొవిడ్ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే నిన్న గుంటూరులో ధూళిపాళ నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ రోజు విశాఖలో పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేశారు. రేపు ఎవరిపై పడతారో తెలియదు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా టీడీపీ నేత శ్రీనివాస్ ఆస్తులు ధ్వంసం చేయడం దుర్మార్గం’’ అని చంద్రబాబు ఆ ప్రకటనలో విమర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇదే అంశంపై ఓ ప్రకటన చేశారు.
‘‘కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా దొంగల మాదిరిగా తెల్లవారుఝామున వచ్చి ఆస్తులను కూల్చివేయడం ఏం పద్ధతి? కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టడంమాని వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల భవనాలు కూల్చివేసే పనిని పెట్టుకొంది. కోర్టులు పనిచేయని సెలవు దినాలను దీనికి ఎంపిక చేసుకొని విధ్వంసాలకు పాల్పడుతోంది.’’ అన్నారు.
కోర్టు నుంచే అనుమతి తెచ్చి నిర్మిస్తా పల్లా శ్రీనివాస్
‘‘అన్ని రకాల అనుమతులతోనే నిర్మాణం చేపట్టాను. ప్రస్తుతం ఖాళీగా వున్నందున నిర్మాణం చేసుకుంటామని, జీవీఎంసీ కమిషనర్ సృజనని కలిసి చెప్పా. అన్ని పత్రాలు సమర్పించి, అనుమతి తీసుకున్నాను. న్యాయ్యస్థానంపై నమ్మకం ఉంది. కోర్టులోనే తేల్చుకుంటాను. అక్కడి నుంచే అనుమతులు తెచ్చుకొని నిర్మాణం చేపడతా. ఎవరు అడ్డం పడతారో చూస్తా. ఎంపీ విజయసాయిరెడ్డిది పైశాచిక ఆనందం. పార్టీలోకి పిలిస్తే వెళ్లలేదని ఇలా చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు నాకు సరిపడవు. అందుకే దూరంగా ఉన్నా’’ అని పల్లా తెలిపారు.
Updated Date - 2021-04-26T09:42:35+05:30 IST