టీటీడీ విషయంలో జగన్ సర్కార్ సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..!?
ABN, First Publish Date - 2021-02-21T17:06:41+05:30
ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించాలనే ప్లాన్ లో దాగిఉన్న సీక్రెట్ ఎంటీ..?
పదేళ్ల కిందట నిలిచిపోయిన కల్యాణమస్తును మళ్లీ పట్టాలెక్కిస్తోంది టీటీడీ. దేశవ్యాప్తంగా కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాలను కూడా ఖరారు చేసింది. అయితే ఆర్థికభారం, అవినీతితో అప్పట్లో బ్రేక్ వేసిన టీటీడీ... ఇప్పుడు సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో నిధులు లేని సమయంలో ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించాలనే ప్లాన్ లో దాగిఉన్న సీక్రెట్ ఎంటీ. అవినీతికి చెక్ పెట్టడానికి స్కెచ్ వేయకుండా టీటీడీ మళ్లీ పాత పద్దతిలోనే ఎందుకు వెళ్తోంది అనేదానిపై ప్రత్యేక కథనాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.
అప్పట్లో ఫుల్ రెస్పాన్స్..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ప్రపంచవ్యాప్తంగా తరలివస్తుంటారు. స్వామివారికి ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు కానుకలు వస్తుంటాయి. టిటిడి ఏటా రూ.200 కోట్ల రూపాయలను వెచ్చించి హిందు ధార్మిక ప్రచారం నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2007లో టీటీడీ అట్టహాసంగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని గతంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది.
పెళ్లి చేసుకుంటే...!
కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా, పెళ్ళి చేసుకునే జంటలకు 2 గ్రాముల బంగారంతో మంగళసూత్రాలతో పాటు వస్ర్తాలను ఉచితంగా అందజేసింది. వధూవరులుతో పాటు 50 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేసింది టీటీడీ. ఇలా ఒక్క జంట వివాహానికి దాదాపు 8 వేల రూపాయలు వరకు ఖర్చు చేసిది టీటీడీ. ఇక నూతన వధువరులతో పాటు వారి బంధువులకు 50 మందికీ ఉచితంగా భోజనం కూడా సరఫరా చేసేది. అందుకు అయ్యే ఖర్చును టీటీడీయే భరించేది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ధపా ఐదు వేల నుంచి 12 వేల వరకు జంటలు పాల్గొనేవి. ఏడు విడతలుగా నిర్వహించిన ఈ పథకానికి ఏటా టిటిడి రూ.50 కోట్ల వరకు వెచ్చించింది టీటీడీ.
వైసీపీ నేతల ప్లాన్ ఇదేనట..
ఏపీలో కొన్ని నెలలుగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. కేంద్ర పెద్దలు కూడా సీరియస్ కావడంతో విషయం జాతీయస్థాయి వరకు వెళ్లింది. విపక్షాలకు మంచి అవకాశం ఇచ్చినట్లైంది. సర్కార్ కు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. ప్రతిపక్షాలతో పాటు మఠాధిపతులు, స్వామీజీలు నుంచి కూడా నిరసనలు తప్పడం లేదు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన టీటీడీ, కల్యాణమస్తును మళ్లీ పట్టాలెక్కిస్తోందనే టాక్ వినిపిస్తోంది. హిందూ ధర్మ పరీరక్షణ, సంస్కృతి, సంప్రదాయాలపేరుతో టీటీడీ చేపడుతున్న కల్యాణమస్తుతో మళ్లీ హిందుత్వ వాదుల్లో సర్కార్ పై సదాభిప్రాయం వస్తుందనేది వైసీపీ నేతల ప్లానట. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ కల్యాణమస్తును పట్టాలెక్కిస్తున్నారట.
అప్పట్లో ఖర్చులు ఇలా..!
2007లో కార్యక్రమం ప్రారంభించిన సమయలో ఒక్కో జంట వివాహానికి దాదాపు 8 వేల రూపాయల వరకు ఖర్చు చేసింది టీటీడీ. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో జనం రోడ్డునపడ్డారు. టీటీడీ ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు బంగారం రేట్లు భారీగా పెరిగాయి. 2 గ్రాముల బంగారు మంగళసూత్రానికి దాదాపు 10 వేల పైనే ఖర్చవుతుంది. గతంలో లాగా జంటకి దాదాపు 15 వేల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక భోజనాలతో కలుపుకుంటే దాదాపు 25వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుది. ఖర్చు చేసే సంగతి ఎలా ఉన్నా, నిధులు పక్కదారి పట్టకుండా కట్టడి చేసేదెలా అనేదే ప్రశ్న. పైగా నిధులు ఎలా సమకూరుస్తుందనేది కూడా ప్రశ్నార్థకమే.
మళ్లీ ఎందుకు..!?
2011లో ఆగిన తర్వాత 2013లో ఈ కార్యక్రమాన్ని తిరుమలలోనే నిర్వహించాలని బాపిరాజు హయాంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి పాలకమండలి నిర్ణయం తీసుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇది అంతిమంగా, టీటీడీకి ఆర్దికంగా భారంగా మారుతుందని భావించిన అధికారులు పథకాన్ని అప్పట్లో వాయిదా వేసేశారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ పథకాన్ని పట్టాలెక్కించడానికి కారణమేంటీ, అసలే కరోనా ఎఫెక్ట్ తో ఆదాయం తగ్గిన టీటీడీకి ఇదీ ఆర్థికంగా భారం అవుతుంది కదా..అంతేకాదు గతంలో జరిగిన అవినీతికి ఎలాంటి పరిష్కారం చూపకుండా మళ్లీ కల్యాణమస్తు నిర్వహించడంపై సర్వత్ర చర్చనీయంశంగా మారింది.
మెయిన్ ఉద్యేశం ఇదీ..
అప్పటి విజిలెన్స్ అధికారుల నివేదిక ఈ కార్యక్రమం ఎలా దారి తప్పిందో చెప్పింది. హిందు ధార్మిక ప్రచారంలో భాగంగా కల్యాణమస్తు నిర్వహించాలన్నది టీటీడీ లక్ష్యం. ఇందులో పేదవారైన హిందువులకు వివాహం జరిపించటం మెయిన్ ఉద్యేశం. కానీ, ఇందులో 90 శాతం మంది ఇతర మతస్థులు పాల్గొంటున్నారని తేల్చేసింది విజిలెన్స్ నివేదిక. పైగా వృద్ధులు కూడా కొందరు పెళ్లి చేసుకుంటున్నారని తేల్చింది. ఇదంతా నిధులను పక్కదారిపట్టించటమే అని నివేదిక తేల్చేసింది. అంతేకాదు...పెళ్లి సందర్భంగా భోజనం పేరుతో చేసే ఖర్చులో టిటిడి ఉద్యోగులు నిధులను భోంచేస్తూన్నారని కూడా విజిలెన్స్ నివేదిక చెప్పింది. అప్పటి ఈఓ క్రిష్ణారావుకి 2011 మార్చిలో ఈ నివేదిక అందింది. నిర్ణయం తీసుకునే లోపే..క్రిష్ణారావు బదిలి అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన ఎల్వీ సుబ్రమణ్యం ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
అనుమానంతో రంగంలోకి దిగి..!
స్వయంగా టీటీడీ నిర్వహిస్తున్న వివాహ కార్యక్రమం కావడంతో సాక్షాత్తు ఆ దేవదేవుడైన శ్రీవారి ఆశిస్సులు లభిస్తాయన్న నమ్మకంతో కళ్యాణమస్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2011 వరకు ప్రతి ఏటా రెండు విడతల్లో కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ. ఇలా దాదాపు 44వేలకు పైగా జంటలు ఒక్కటయ్యారు. అంతా బాగానే నడుస్తున్న సమయంలో టీటీడీ చూపించిన ఖర్చుల లెక్కలతో అసలు చిక్కులు బయటపడ్డాయి. ఆరో విడత కళ్యాణమస్తు నిర్వహణకు టీటీడీ దాదాపు 6.73కోట్లు వెచ్చించింది. ఇందులో 4.23 కోట్ల రూపాయలను కేవలం భోజనం, డెకరేషనుకు ఖర్చు చేసారట. అంతే అవినీతి జరిగిందన్న అనుమానంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు పథకం పక్కదారి పడుతోందని రిపోర్ట్ ఇచ్చారు.
కొట్టాయ్యాలనే ప్లాన్ చేస్తున్నారా..!?
ఇక గతేడాది డిసెంబర్ లో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య కేంద్రాలలో తిరిగి పునః ప్రారంభిస్తామని ప్రకటించిన టీటీడీ..ఏపీలో ఆలయాలపై దాడులు, జాతీయస్థాయిలో ఇష్యూ కావడంతో అదే జాతీయస్థాయిలో కల్యాణమస్తును గ్రాండ్ గా నిర్వహించి..ఏపీ ప్రభుత్వం హిందు ధర్మ ప్రచారానికి పెద్దపీట వేస్తుందనే క్రెడిట్ కొట్టెయ్యాలనే ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి హిందు ధార్మిక ప్రచారం కోసం పునః ప్రారంభిస్తున్న కళ్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.
Updated Date - 2021-02-21T17:06:41+05:30 IST