‘శివమణి’కి ఏమైంది?
ABN, First Publish Date - 2021-01-11T06:08:04+05:30
నిజాయతీగా పనిచేస్తూ.. నేరస్తులు, అక్రమార్కులకు..
సీఐ రుషికేశవ
అనారోగ్యంతో ‘కిమ్స్’లో చేరిన సీఐ రుషికేశవ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
త్వరగా కోలుకోవాలంటూ స్థానికుల పోస్టింగులు
పుంగనూరు/పలమనేరు(చిత్తూరు): నిజాయతీగా పనిచేస్తూ.. నేరస్తులు, అక్రమార్కులకు వణుకు పుట్టిస్తూ.. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని ‘శివమణి’గా పేరుతెచ్చుకున్న సీఐ రుషికేశవకు ఇప్పుడు ఏమైంది? హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న ఆయన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఆయన ఎస్‌ఐగా, సీఐగా చేసిన ప్రాంతాల్లో ప్రజలు ఆవేదన చెందుతూ.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. 2002 బ్యాచ్‌కి చెందిన రుషికేశవ ప్రొబేషనరీ ఎస్‌ఐగా పలమనేరులో, తర్వాత ట్రైనీ ఎస్‌ఐగా తంబళ్లపల్లెలో చేరారు. అనంతరం పెద్దపంజాణి, పుంగనూరు, ములకలచెరువు, ఎర్రచందనం టాస్క్‌ఫోర్సుకు, అక్కడ్నుంచి సీఐగా పదోన్నతిపై ములకలచెరువు వెళ్లారు. తర్వాత మదనపల్లె స్పెషల్ బ్రాంచికి బదిలీ అయ్యారు.
ఈయన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం, సామాన్య కుటుంబ జీవితం గడిపారు. పనిచేసిన ప్రతిచోట గ్రామీణ యువకులు చెడుమార్గాల్లో వెళ్లకుండా వారిలో చైతన్యం తీసుకురావడంలో కృషి చేశారు. ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు అండగా నిలిచారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడలేదు. మంచి పోలీసు అధికారిగా ప్రజల్లో స్థానం సంపాదించారు. అప్పట్లో వచ్చిన నాగార్జున సినిమా ‘శివమణి’ పేరిట ఆయన ప్రజల్లో గుర్తింపు పొందారు. అందుకే 2008లో పుంగనూరు నుంచి ములకలచెరువుకు బదిలీ కాగా, స్థానికులు పోలీసు స్టేషన్ ముందు ధర్నా, రాస్తారోకో చేశారు. ఇక్కడే పనిచేయాలంటూ కొందరు గుండు కొట్టించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు సర్దిచెప్పాల్సి వచ్చింది.
ఎస్‌ఐపై పూలవర్షం
2009 ఎన్నికల సందర్భంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పుంగనూరులో ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో ములకలచెరువు ఎస్‌ఐగా ఉన్న రుషికేశవను పుంగనూరుకు బందోబస్తు విధులు కేటాయించారు. ఈ విషయం తెలిసి పోలీస్ విధుల్లో ఉన్న రుషికేశవను స్థానికులు అభిమానంతో పైకి ఎత్తుకుని ఊరేగించారు. ఆయనపై పూలు చల్లుతూ.. సంతోషంతో ఈలలు, కేకలు వేసి ఆనందాన్ని పంచుకున్నారు. తాను పోలీస్ అధికారినంటూ, ఇలా చేయరాదని ఆయన వారించాల్సి వచ్చింది.
వీఆర్‌కు వెళ్లి..
వైసీపీ అధికారంలోకి రాగానే సీఐ రుషికేశవను చిత్తూరు వీఆర్‌కు పంపారు. అనంతరం కర్నూలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆయన కిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు ఫొటో షేర్ కావడంతో, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పోస్టింగ్స్ పెట్టగా.. మరికొందరు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. సీఐ కుటుంబీకులతో సంప్రదించాలని ఫోన్‌లో ప్రయత్నించగా వారు స్పందించలేదు. కర్నూలు నుంచి రెండురోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య సమస్య.. ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలు తెలియరాలేదు.
Updated Date - 2021-01-11T06:08:04+05:30 IST